(భోగాది వేంకటరాయుడు)
తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచి కొడుతున్నట్టే, పులివెందుల… ఒంటిమిట్ట జెడ్ పీ టీ సీ ఉప ఎన్నికల ఫలితాల విశేషాల తో తెలుగు న్యూస్ చానెళ్లన్ని విరుచుకు పడుతుంటే ; సాక్షి ఛానల్… వరద వార్తలతో కాలక్షేపం చేస్తున్నది. అక్కడ వరద… ఇక్కడ వాన…. అంటూ నానా తంటాలు పడుతున్నది. సిమ్లా లోని రెండు గ్రామాలకు భారీ నష్టం అంట. మూసారం బ్రిడ్జ్ పై రాకపోకలను బంద్ చేశారంట. గుంటూరు కాలవకు గండి పడిందంట.
నేను 8 గంటల నుంచి సాక్షి ఛానల్ చూస్తూన్నా, పులువెందుల… ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఫలితాల విశేషాలు ఎలా అందిస్తారో చూద్దామని కూచున్నాను. కానీ, సౌండ్ లేదు.
చివరకు 11.25 నిముషాలకు, కడప ఎం పీ అవినాష్ రెడ్డి సాక్షి తెరమీదకు వచ్చి, దొంగ ఓట్ల తో గెలిచారని, నిజమైన ఓటర్లు కాదని చెప్పారు. అసలు దీనిని ఎలక్షన్ అంటారా అని అవినాష్ రెడ్డి ఎంతో అమాయకం గా ప్రశ్నించారు.
నిజమే. కరడు గట్టిన ప్రజాస్వామ్య వాదులకు ఇప్పుడు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్ పీ టీ సీ ల పదవులకు జరిగిన ఉపయెన్నికల తీరు బాధ కలిగించింది.
చివరకు, ఉండబట్టలేక, ‘ మీకు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది…’ అంటూ మనసులో మాట బయట పెట్టారు ( ఇదంతా ‘సాక్షి’ ఉవాచే ).
ఈ మాట అర్ధం ఏమిటి? ” మా మార్క్ ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపిస్తాం ” అనేగా!
ఆ “ప్రజాస్వామ్యా “న్ని పులివెందుల జనం గత ముప్ఫయ్ ఏళ్ళ నుంచీ చూస్తూనే ఉన్నారనే మాట బహిరంగ రహస్యమే కదా! రాష్ట్ర ప్రజలకైతే వైసీపీ మార్క్ ప్రజాస్వామ్యం 2019 నుంచి 2024 వరకు స్పష్టం గా, మరింత దగ్గరగా చూసిన అనుభూతి కలిగింది.
2024 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ తరహా ఫలితాలు వచ్చాయో…. ఇప్పుడు ఈ రెండు ఉప ఎన్నికల్లో కూడా అదే తరహా ఫలితాలు వచ్చాయి.
అందని ద్రాక్ష పుల్లన అనో… చేదు అనో…. అనవచ్చు. లేకపోతే బతకని బిడ్డ బారెడు అనికూడా అనుకోవచ్చు.
కానీ, జనం మాత్రం….” కధ ముగిసింది…. ” అంటున్నారు.