– అయ్యన్నపాత్రుడు
అమరావతి: స్వాతంత్య్రం ద్వారా మనకు స్వేచ్ఛ లభించింది గాని ప్రతి ఒక్కరూ వారి వారి బాధ్యతలను తెలుసుకుని మన ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ సమాజాభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి సిహెచ్. అయ్యన్న పాత్రుడు సూచించారు. 79వ స్వాతంత్య్రం దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
ఆ తర్వాత మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వాతంత్య్రం దినోత్స శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ ఆగస్టు 15వతేది ఒక సాధారణమైన రోజు కాదని అది మనకు స్వేచ్ఛను ఇచ్చిన శుభ దినమని పేర్కొన్నారు. బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి కలిగి కోట్లాది మంది ప్రజల కలలు సాకారమైన రోజని అన్నారు. ఈ స్వేచ్ఛకు మూలం నిరాహార దీక్షలు, ఇరుకైన జైళ్ళ గదుల్లో బంధించబడి అనేకమంది ప్రాణ త్యాగాల ఫలితమే స్వాతంత్య్ర దినోత్సవమని చెప్పారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామ రాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ ,మువన్నెల జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య వంటి ఎందరో మహనీయుల త్యాగాలను మనం ఎల్లప్పుడూ గుర్తించు కోవాలని అన్నారు. ముఖ్యంగా ఈనాటి యువత స్వాతంత్య్రయోధ్యమ చరిత్రను తెల్సుకోవాల్సిన అవసరం ఉందని అయ్యన్న పాత్రుడు సూచించారు.
ప్రజాస్వామ్యానికి ప్రాణం సదుపాయాలు కాదని సమర్థవంతమైన పాలన అని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ప్రతి ప్రజా సమస్యలు సభలో చర్చకు రావాలని, ప్రతి నూతన విధానం ప్రజల శ్రేయస్సు కోసమే ఉండాలని అదే మన లక్ష్యమని అన్నారు. నేటి యువత స్వాతంత్య్రం పోరాటం గురించి తెల్సుకుని ఆనాటి త్యాగధనులను గుర్తించుకుని దేశానికి సేవ చేయాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికైన అసెంబ్లీ సమావేశాలకు కొంతమంది ఎంఎల్ఏలు హాజరు కావడం లేదని అది వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఇకనైనా ప్రతి సభ్యుడూ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై సభలో చర్చించాలని స్పీకర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సభాపతి కె.రఘురామ కృష్ణ రాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, పలువురు ఉప కార్యదర్శులు, ఇతర అధికారులు, అసెంబ్లీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.