– పారదర్శకత, సామాజిక సమానత్వం, ఆర్థిక స్థిరత్వమే లక్ష్యం
– మీడియాకు వివరించిన కమీషనర్ నిషాంత్ కుమార్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త బార్ పాలసీ 2025–28ను ప్రకటించింది. బార్ల నిర్వహణలో పారదర్శకత, ఆర్థిక స్థిరత్వం, సామాజిక సమగ్రతను సాధించడమే ఈ విధానంలోని ప్రధాన ఉద్దేశమని ఆబ్కారీశాఖ కమిషనర్ నిశాంత్‌కుమార్ సోమవారం మంగళగిరిలోని కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు.
సామాజిక సమానత్వానికి ప్రాధాన్యం
ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ఎంఎస్. నెం. 275 (తేదీ 13.08.2025) ప్రకారం రాష్ట్రంలో మొత్తం 840 బార్లు అనుమతించబడ్డాయి. అదనంగా 10 శాతం బార్లు గీతకులాలకు కేటాయించబడతాయి. వీటికి లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ లభిస్తుంది. దీనిద్వారా సామాజిక సమానత్వం, సాధికారతను ప్రోత్సహించడమే లక్ష్యమని కమిషనర్ తెలిపారు.
డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా కేటాయింపు
అన్ని బార్ లైసెన్సులు పూర్తిగా పారదర్శకంగా డ్రా ఆఫ్ లాట్స్ విధానం ద్వారా కేటాయించబడతాయి. ప్రతి బార్‌కు కనీసం నాలుగు చెల్లుబాటు అయ్యే దరఖాస్తులు ఉండాలి. ఇలాచేయడం ద్వారా పోటీ పెరుగుతుందని, అడ్డదారుల దరఖాస్తులు తగ్గుతాయని నిషాంత్ కుమార్ వివరించారు. ఇటీవల ఏపీలో రిటైల్ షాప్‌ల కేటాయింపులో ఒక దుకాణానికి సగటున 26 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలో ఇటీవల బార్ల కేటాయింపులో ఒక్కో బార్‌కు 131 దరఖాస్తులు అందినట్టు ఆయన ఉదహరించారు.
లైసెన్స్ కాలపరిమితి, ఫీజు నిర్మాణం
కొత్త పాలసీ ప్రకారం బార్ లైసెన్స్ గడువు మూడు సంవత్సరాలపాటు ఉంటుంది. ఇది 01.09.2025 నుండి 31.08.2028 వరకు అమలులో ఉంటుంది. లైసెన్స్ ఫీజు చెల్లింపులను సరళతరం చేశారు. 50,000 లోపు జనాభా గల పట్టణాల్లో రూ.35 లక్షలు, 50,001 నుండి 5 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 5 లక్షలకు పైబడిన నగరాల్లో రూ.75 లక్షలు ఫీజు ఉండనుంది. అన్ని విభాగాల్లో ప్రతి ఏడాది పది శాతం రుసుము వృద్ధి వర్తిస్తుంది.
సౌకర్యాలు, ప్రత్యేక పరిమితులు
లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాలలో చెల్లించవచ్చు. ఒక వాయిదా మొత్తానికి సమానంగా బ్యాంకు గ్యారంటీ సమర్పించాలి. బార్లను నగర పాలక సంస్థల పరిధిలో, పర్యాటక కేంద్రాల్లో (ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను మినహాయించి), భవిష్యత్తులో పరిశ్రమల కారిడార్లు, మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాంతాలు, ఎస్ఈజెడ్లలో అనుమతిస్తారు. తిరుపతిలో అలిపిరి వైపు వెళ్లే ముఖ్య మార్గాలలో బార్లకు నిషేధం విధించారు.
సుస్థిరత వైపు అడుగు
రిటైల్ షాప్ లైసెన్స్ రుసుముల కంటే తక్కువ స్థాయిలో కొత్త బార్ ఫీజులు నిర్ణయించడం ద్వారా రమారమి మూడేళ్లపాటు స్థిరమైన ఆదాయ విధానానికి మార్గం సుగమం అవుతుందని కమిషనర్ నిశాంత్‌కుమార్ అన్నారు. గతంలో కొన్నింటి లైసెన్స్‌లు పునరావృత వేలంపాట్ల తర్వాత కూడా, ఖాళీగా మిగిలిపోయాయని, కొత్త పాలసీ ఆ సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రెస్ మీట్ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త బార్ పాలసీ 2025–28 సామాజిక సమగ్రత, పారదర్శకత, స్థిరత్వం వైపు ఒక కీలకమైన ముందడుగు అని, ఇది కొత్త వ్యాపారవేత్తలకు, ప్రస్తుత లైసెన్స్ దారులకు సమాన అవకాశాలు కల్పిస్తుందని వివరించారు. ఈ విధానంలో రెస్టారెంట్ ప్రారంభానికి ఒక నెల రోజుల వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.