– రాష్ట్రంలో 1.24 కోట్ల కుటుంబాలను నేరుగా కలిశాం.
– వివాదాలకు ఏ ఒక్కరూ ఆస్కారం ఇవ్వకూడదు
– తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలి
– మంత్రులు, పార్టీ నేతలు ఈ విషయంలో మరింత చొరవ చూపాలి
– టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లు, జోనల్ కో-ఆర్డినేటర్లు, గ్రామ, మండల స్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్
– సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహణ, పార్టీ కమిటీల నియామకం అంశాలపై చర్చ
అమరావతి : టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం కోసం, ప్రజలకు వివరించేందుకు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు విజయవంతం అయ్యింది. సాంకేతికతను ఉపయోగించుకుని ఇంటింటికి వెళ్లి ప్రజలకు పథకాలను వివరించాం.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 1.24 కోట్ల కుటుంబాలను నేరుగా కలిశాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంఛార్జ్‌లు ఏ గ్రామానికి ఏ సమయంలో వెళ్తున్నారో యాప్ ద్వారా తెలుసుకున్నాం. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా చూస్తే…..ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను, నేతలను ప్రజలు ఆహ్వానించారు.ప్రభుత్వాన్ని దీవించారు. ఇదొక పాజిటివ్ సైన్. ఎన్నికల్లో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నాం కాబట్టే ఈ స్థాయి సంతృప్తి వ్యక్తం అయ్యింది.
పింఛన్ల పెంపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి- ఉచిత బస్సు ప్రయాణ పథకాలను చెప్పిన విధంగా అమలు చేశాం. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. దీని కోసం నాయకులు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల కోసం నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నాం.
వ్యవసాయ మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించాం. ఇతర పదవుల భర్తీ కూడా చేపడతాం. రాష్ట్రంలో ఒక నేర చరిత్ర కలిగిన పార్టీ ఉంది. వాళ్ల పని నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే వారి పని. సోషల్ మీడియా, సొంత టీవీ, పత్రికల్లో, అనుబంధ మీడియాతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.
రాజధాని మునిగిపోయిందని….ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని….ఊళ్లు మునుగుతాయని…ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాజధాని కోసం పొన్నూరును ముంచారని ఒకసారి, కొండవీటి వాగు ఎత్తిపోతల పంపులు పని చేయడం లేదని మరో సారి….ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడిందని ఇంకో సారి వార్తలు వేశారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళ పరచాలి అనే సిద్దాంతంతోనే వైసీపీ రోజూ పనిచేస్తోంది.
వైసీపీ చేస్తున్న ఏ ప్రచారాన్ని పరిశీలించినా వాళ్ల కుట్ర ఏంటో అర్థం అవుతుంది. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలి. మంత్రులు, పార్టీ నేతలు ఈ విషయంలో మరింత చొరవ చూపాలి. లేకపోతే ప్రజలు ఆ తప్పుడు ప్రచారాలనే నిజం అని నమ్మే స్థాయికి తీసుకువెళతారు.
మనపై చేసే అసత్య ప్రచారాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంఛార్జ్‌లు, కార్యకర్తలు మరింత క్రమశిక్షణతో ఉండాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు మరింత బాధ్యతగా ఉండాలి. మీ మాట, మీ చర్య పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉండకూడదు. వివాదాలకు ఏ ఒక్కరూ ఆస్కారం ఇవ్వకూడదు.
రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కఠినంగా ఉంటాం. పార్టీ కమిటీలను సాధ్యమైనంతవరకు ఈ నెల చివరికి పూర్తి చేయాలి. దీనికి సంబంధించి పనిని వేగవతం చేయాలి.
ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లతో ముఖాముఖి అవుతున్నాను. మంచి చెడులు వారితో చర్చిస్తున్నాను. పొరపాట్లు ఉంటే సరిదిద్దుతూ సూచనలు ఇస్తున్నా. ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. వారి ఆకాంక్షలను తీర్చేలా నేతల, ప్రభుత్వ పనితీరు ఉండాలి. దీన్ని మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలి.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, నేతలను అభినందిస్తున్నాను. టీడీపీ అభ్యర్థులను గెలిపించి కాలర్ ఎగరేసి తిరిగేలా, గర్వపడేలా అంతా పని చేశారు. వివేకానందరెడ్డికి న్యాయం చేయండి, 30 ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించినందుకు దండాలు అని బ్యాలెట్ బాక్సులో రాసి వేశారు. ఇది పులివెందులలో పరిస్థితి అద్దం పడుతోంది.
నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు చట్టబద్దంగా వ్యవస్థలు పనిచేశాయి కాబట్టే అంత మంది పోటీ చేశారు. అంత మంది స్వేచ్ఛగా ఓట్లువేశారు. కానీ ఇప్పుడు ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా కూటమి అభ్యర్థులు గెలవాలి. ప్రజలతో మమేకమై, వారి అవసరాలు తీర్చి, సమస్యలు పరిష్కరిస్తే ప్రతి ఎన్నికల్లోనూ సునాయాసంగా గెలుస్తాం.