• మహిళల హక్కులు, భద్రత, సాధికారతే మహిళా కమిషన్ లక్ష్యం
• సోషల్ మీడియా వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి
• పది మందికి పైగా ఉద్యోగులు ఉంటే సంస్థల్లో ఐసీసీ తప్పనిసరి
• వన్ స్టాప్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
• మహిళా ఉద్యోగులు గౌరవంగా, భద్రంగా పనిచేసే వాతావరణం పీవోఎస్‌హెచ్ చట్టం కల్పిస్తుంది.
• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు అనేక చట్టాలను తీసుకువచ్చాయి.
– రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ
విజయవాడ: శక్తి యాప్ మహిళలకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. విజయవాడ వన్ టౌన్ లోని కేబీఎన్ కళాశాలలో మంగళవారం మహిళల సంక్షేమం, భద్రత, రక్షణ, సాధికారతపై జిల్లా స్థాయి అవగాహన సమావేశం జరిగింది. ఎన్టీయార్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత సంస్థ, యుజీసీ ఉమెన్స్ స్టడీ సెంటర్ – కేబీఎన్ కళాశాల సహకారంతో నిర్వహించిన అవగాహన సదస్సుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళలు ఎటువంటి ఆపదలో ఉన్నా శక్తి యాప్ లో సహాయం కోరవచ్చన్నారు. మహిళలు, బాలికలు శక్తి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. ఇటీవల సైబర్ నేరాలు అనే కొత్త ముప్పు పొంచి ఉందని, మహిళలు డిజిటల్ భద్రతా చైతన్యం పెంచుకోవాలన్నారు. అవసరమైన సమయంలో ప్రభుత్వ హెల్ప్ లైన్స్, చట్టపరమైన రక్షణను ఉపయోగించుకోవాలన్నారు.
సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని, నకిలీ అకౌంట్లు సృష్టించి అపవాదులు వేయడం, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం చేయడం వంటి పై అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలు ప్రత్యేక రక్షణ కోసం 181 హెల్ప్ లైన్ ద్వారా తక్షణ సహాయం పొందాలని డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు.
మహిళల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠమైన చట్టాలు, కార్యక్రమాలు నిర్వహిస్తుందని డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని, వాటి నివారణకు క్షేత్రస్థాయి నుండి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆడపిల్లలు, మహిళలపై అన్యాయాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పది మందికిపైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో ఐసీసీ(ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ) ఉండాలని డాక్టర్ రాయపాటి అన్నారు.
పని ప్రదేశంలో మహిళా ఉద్యోగులు గౌరవంగా, భద్రంగా పనిచేసే వాతావరణం కల్పించడం ఆయా సంస్థల యాజమాన్యల బాధ్యత అని తెలిపారు. మహిళల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మహిళలు, బాలికల కష్ట సమయంలో సురక్షిత ఆశ్రయం, సహాయం పొందడానికి ఆశ్రయ గృహాలు, శక్తి సదన్ లు, సఖి సెంటర్లు, చైల్డ్ హోమ్స్ ఉపయోగపడుతున్నాయన్నారు.
సఖీ వన్ స్టాప్ సెంటర్ లో అన్ని సేవలు ఒకే చోట లభిస్తాయన్నారు. విద్యార్థులు తమ చదువు, లక్ష్యాలపై దృష్టి పెట్టాలని ప్రేరణనిచ్చారు. ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని, తాజాగా ప్రారంభించిన “స్త్రీశక్తి పథకం” వాటిలో ముఖ్యమైనదన్నారు.
అనంతరం వన్ స్టాప్ సెంటర్, మహిళ పథకాలపై అవగాహన పెంచేలా రూపొందించిన పోస్టర్ ను డాక్టర్ రాయపాటి శైలజ విడుదల చేశారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యురాలు రాధాకుమారి, జిల్లా మహిళా&శిశు సంక్షేమ, సాధికారత అధికారి షెక్ రుఖ్సానా సుల్తాన్ బేగమ్, మహిళా కమిషన్ కార్యదర్శి అనురాధ, కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి, కార్యదర్శి, ప్రతినిధి టి.శ్రీనివాస్, ఎంఈవోలు, సీడీపీవోలు, జిల్లా ఐసీసీ కమిటీ చైర్మన్, సభ్యులు, అధ్యాపకులు, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, ఓఎస్సీ ఎస్ఐ, ఏఎస్ఐ, ఎస్‌హెచ్‌జీ గ్రూపుల మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు.