– బుచ్చి రాంప్రసాద్
మంగళగిరి : రాష్ట్రంలో ఉన్న అర్చకుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని టీడీపీ ఏపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తెలిపారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ ఏపీ బ్రాహ్మణ సాధికార సమితి సమావేశంలో ఆయన ముఖ్యఅథితిగా పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింది. బ్రాహ్మణ సంక్షేమం కోసం గత టీడీపీ ప్రభుత్వం రూపొందించిన జీఓ 76 ను రద్దు చేసి 439 జీఓ తీసుకొచ్చిన జగన్ సర్కార్… అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించింది.
కార్పొరేషన్ కు సరైన నిధులు కేటాయించకుండా బ్రాహ్మణుల సంక్షేమాన్ని విస్మరించింది. త్వరలో జీఓ 76 ను అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. దేశంలోనే మొట్టమొదటి సారి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకె దక్కింది. మరో 12 రాష్ట్రాల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపునకు నిదర్శనం. రాష్ట్రంలో 27 వేల ఆలయాల్లో 90 వేల అర్చక కుటుంబాలు పౌరోహిత్యం నిర్వహిస్తున్నాయి. ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది. బ్రాహ్మణ వృత్తిని కుల వృత్తిగా గుర్తించే అంశాన్ని పరిశీలించమని సీఎంను కోరతాం. నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర సమయంలో వేద విద్యను అభ్యసించిన బ్రాహ్మణ యువతకు నిరుద్యోగ భృతి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని నారా లోకేష్ కి సూచిస్తే హామీ ఇచ్చారు. చెప్పినట్టే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే దాదాపు 900 మంది వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున ఏడాది పాటు అందజేశాం.
టీడీపీ మేనిఫెస్టోలో 11 అంశాలను బ్రాహ్మణ సంక్షేమం కోసం అమలు చేయాలని సూచించాం. ఆలయాల వైదిక, ఆగమ అంశాల్లో అధికారుల జోక్యం లేకుండా, దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో అదనంగా మరో ఇద్దరికి అవకాశం కల్పించాం. రాష్ట్రంలోని రూ.50 వేలకుపైగా వార్షికాదాయం ఉన్న ఆలయాల్లోని అర్చకులకు కనీస వేతనాన్ని రూ.15 వేలకు పెంచాం. అలాగే అర్చకులకు ఆలయాల సమీపంలోనే వసతి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అందుకు పూర్తి సహకారం అందిస్తామని ఆమె ప్రకటించారు. ఆ విషయాన్ని కూడా పరిశీలిస్తాం.
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో బ్రాహ్మణ సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమా కార్యక్రమాలపై సమాలోచన చేసి మన రాష్ట్రంలో కూడా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటాం. బ్రాహ్మణ సాధికార సమితి ఆధ్వర్యంలో అర్చకుల సమస్యల పరిష్కారానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సీఎం చంద్రబాబును కలిసి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణ సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు.
బ్రాహ్మణ సమాజానికి ఏం కావాలన్న చెప్పండి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సాధికార సమితి అధికార ప్రతినిధి ఈమని సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీ రమణ, జేఏసీ అధ్యక్షులు జంద్యాల వెంకట రామలింగేశ్వర శర్మ, జేఏసీ జనరల్ సెక్రటరి ఎంవీ శేషాచారి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన అర్చకులు, సాధికార సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.