* విశాఖలో ఈనెల 29న నేషనల్ స్పోర్ట్స్ డే
* గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో అట్టహాసంగా జోనల్ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు
గుంటూరు: క్రీడా రంగాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈనెల 29న విశాఖపట్టణం వేదికగా నేషనల్ స్పోర్ట్స్ డే ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని వివరించారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడా పోటీలను శాప్ ఛైర్మన్ రవినాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాప్ డైరెక్టర్లు ఎ.రమణారావు, ఎస్.సంతోష్ కుమార్, యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పాల్ కుమార్, యూనివర్సిటీ సీఎస్ఆర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ మండూరుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి 2వేల మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. తొలుత ఇండోర్ స్టేడియంలోని బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ కోర్టులను సందర్శించి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు.
అనంతరం శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ అంతర్జాతీయ హకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ ను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాకారులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. దానిలో భాగంగానే జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈనెల 29న నిర్వహించే స్పోర్ట్స్ డే వేడుకలో సీఎం చంద్రబాబు చేతులు మీదుగా నగదు ప్రోత్సాహకాలు, పతకాలు అందజేస్తామన్నారు. క్రీడాకారుల జీవిత భద్రతకు రాత పరీక్ష లేకుండా 3శాతం రిజర్వేషన్ తో స్పోర్ట్స్ కోటా కింద అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగవకాశాలు కల్పిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదన్నారు.
క్రీడాభివృద్ధికి విద్యాశాఖామంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి విశేషమైనదన్నారు. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలకు రూ.30 వేలు నిధులను కేటాయించి క్రీడా సామగ్రిని అందజేస్తున్నారన్నారు. పాఠశాలల్లో క్రీడా స్థలాల అభివృద్ధికి పంచాయతీరాజ్ ద్వారా 10శాతం నిధులను కేటాయిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని, దానికి అనుగుణంగా కృషి చేస్తున్నారని వివరించారు. 2029లో ఏపీలో జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు.
అనంతరం శాప్ డైరెక్టర్ రమణారావు మాట్లాడారు. క్రీడాకారులకు అత్యుత్తమ క్రీడా సదుపాయాలను కల్పించడంతోపాటు క్రీడా ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తుందన్నారు. క్రీడాకారులందరూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని అత్యుత్తమంగా రాణించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముందు క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవోలు నరసింహారెడ్డి, అజీజ్, ఝాన్సీలక్ష్మి, బి.రాజరాజేశ్వరి, యతిరాజ్, పాల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.