– బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ ఎంపీ వద్దిరాజు
న్యూఢిల్లీ: తమ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్ల పాలనలో ఐటీ,ఫార్మా, వైద్యారోగ్య రంగాలలో గొప్పగా ఎదిగిన తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఏం) ఏర్పాటు చేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఐఐఏం సవరణ -2025 బిల్లును బుధవారం రాజ్యసభలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఎంపీ రవిచంద్ర పాల్గొని మాట్లాడుతూ, అస్సాంలోని గౌహతిలో 550 కోట్లతో ఐఐఏం నెలకొల్పాలనే బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.
దేశ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ తెలంగాణలోని 33 జిల్లాలలో మెడికల్, నర్సింగ్ కాలేజీలు,పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు నెలకొల్పి ఉన్నత విద్యను అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తెచ్చారన్నారు. హైదరాబాద్ ఐటీ,ఫార్మా,లైఫ్ సైన్సెస్ రంగాలలో గొప్పగా అభివృద్ధి చెంది ప్రపంచ పటంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నదని ఎంపీ రవిచంద్ర చెప్పారు.