– క్షతగాత్రులకు రూ 25 లక్షలు ఇవ్వాలి
-బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
-నిర్లక్ష్యపు అధికారులను సస్పెండ్ చేయాలి
– టీజీ ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫరూకీ అలీ బాధ్యత రహిత ప్రకటనలు మానుకోవాలి
– విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి
హైదరాబాద్: విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురై చనిపోయిన యువకుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు.
ఇటీవల శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామంతపూర్ లో నిర్వహించిన శోభాయాత్ర లో విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు చనిపోవడం, పదుల సంఖ్యలో క్షతగాత్రులు కావడం.. అదేవిధంగా వినాయక విగ్రహాలను మండపాలకు తీసుకువెళ్లే క్రమంలో విద్యుత్ తగిలి హైదరాబాద్ బాలాపూర్ పరిధిలో మరియు కామారెడ్డి జిల్లా పరిధిలో ముగ్గురు యువకులు చనిపోవడం తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి హిందూ యువకులు పిట్టల్లా రాలిపోతుండటం విశ్వహిందూ పరిషత్ తట్టుకోలేకపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నాసీరకపు విద్యుత్తు తీగలు అమర్చడం, అదేవిధంగా చేతికి అంది ఎత్తులో ప్రమాదపు గంటికలు మోగించే విధంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయకపోవడం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, కాబట్టి ఒక్కో బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించి, ఆ కుటుంబంలో ఓ యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే టీజీఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఆలీ ఫరూకి బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. జరిగిన ప్రమాదాన్ని చిన్నదిగా చేసే ప్రయత్నం చేయడం హిందూ సమాజాన్ని చులకన చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాసిరకపు తీగలు అమర్చి, వేలాడుతున్న తీగలను సరి చేయని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని, హిందువుల పండుగలపై చిన్నచూపు చూపడం ఏమాత్రం సరికాదని తీవ్రస్థాయిలో ఆయన హెచ్చరించారు.
ఈ రాష్ట్రంలో హిందువుల పండుగలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. ప్రస్తుతం వినాయక నవరాత్రి ఉత్సవాలు, దసరా నవరాత్రి వేడుకలు , దీపావళి , బతుకమ్మ సంబరాలు రానున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.