– కంచ ఐలయ్య లాంటి మేధావులను పోటీలో పెట్టొచ్చు కదా?
– బీసీ నాయకుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు పెట్టలేదు?
– యూరియా ఇచ్చిన పార్టీకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు
– దమ్ముంటే ముఖ్యమంత్రిగాని.. మంత్రులు గాని గ్రామాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడాలి
– పదేండ్ల కేసీఆర్ పాలనలో రాని ఎరువుల కొరత, రేవంత్ అసమర్థతోనే ఇవాళ వచ్చింది
– తెలంగాణలోని ప్రతీ గ్రామంలో ఎరువుల కోసం రైతులు చాంతాడంత లైన్లు కడుతున్నారు
– కాంగ్రెస్ నాయకులే బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు
– ఎరువుల కొరతపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: ‘‘ ఇంతవరకు ఏ కూటమి కూడా మమ్మల్ని సంప్రదించలేదు. ఎన్నికల తేదీ నాటికి మేము చర్చించి మా వైఖరిని ప్రకటిస్తాం. మేము ఎన్ డి ఏ కూటమిలో లేము. ఇండియా కూటమిలోనూ లేము. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. రేవంత్ రెడ్డి పెట్టిన అభ్యర్థి అయితే కచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ ఒక చిల్లర పార్టీ. ఒక థర్డ్ క్లాస్ పార్టీ. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెట్టిన అభ్యర్థిని మేం ఎలా సపోర్ట్ చేస్తాం? బీసీల మీద ప్రేమ కురిపించే కాంగ్రెస్ పార్టీ మరి బీసీ నాయకుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు పెట్టలేదు? కంచ ఐలయ్య లాంటి మేధావులను పోటీలో పెట్టొచ్చు కదా? తెలంగాణ రైతులకు కావాల్సిన రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సెప్టెంబర్ 9 లోపు ఇచ్చిన పార్టీ అభ్యర్థికే ఉప రాష్ట్ర పతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని’’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు వ్యాఖ్యానించారు. ఇంతవరకు తమను ఏ కూటమీ సంప్రదించలేదని, అయితే తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగానే తాము నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఎరువుల కొరతపై హైదరాబాద్ నందీనగర్ నివాసంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ అసమర్థత, అనుభవలేమి, ప్రణాళిక రాహిత్యంతోనే రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రమైందని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఎరువుల కొరత రాలేదన్న కేటీఆర్, సీజన్ కు ఆరు నెలల ముందే 24 గంటల పాటు మానిటరింగ్ చేసి కేసీఆర్ ఎరువులను తీసుకొచ్చేవారని చెప్పారు.
ఎరువులను కొందరు కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 70 లక్షల మంది తెలంగాణ రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే కాంగ్రెస్, బీజేపీలు ఎలక్షన్లు, కలెక్షన్లు అని నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు.
ఎరువుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని, లేకుంటే క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తమకు ఢిల్లీలో బాస్ లు ఎవరూ లేరన్న కేటీఆర్, తెలంగాణ ప్రజలే తమకు బాస్ లని తెలిపారు. ఎనిమిది మంది కాంగ్రెస్, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు పైసా ప్రయోజనం కలగడం లేదని మండిపడ్డారు.
రైతు డిక్లరేషన్ పేరుతో నానా హంగామా చేసిన రాహుల్ గాంధీ తెలంగాణ రైతుల యూరియా సమస్యపై పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. బీసీల మీద ప్రేమ నటించే కాంగ్రెస్ పార్టీ, ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ నేతను ఎందుకు ప్రకటించలేదో చెప్పాలన్నారు.
గత రెండు నెలలుగా తెలంగాణలోని ఏ పల్లె చూసినా ఒక దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. ఎరువుల కోసం చాంతాడంత లైన్లో నిలబడి రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకంతో ఒక్క బస్తా ఎరువు దొరక్క రైతులు ఆగమాగం అవుతున్నారు. తాము పండించిన పంటను కొనండి అని అధికారుల కాళ్ళ మీద అన్నదాతలు పడే దుస్థితి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉంది. ఎరువుల బస్తాల కోసం కూడా అధికారుల కాళ్ళ మీద రైతులు పడుతున్నారు
ఆరు నెలల ముందే బఫర్ స్టాక్ ను తీసుకొచ్చి గోదాముల్లో నిలువ చేసి ఇంకా సీజన్ స్టార్ట్ కాకముందే దేశంలో ఎక్కడెక్కడ యూరియా దొరుకుతుందో అక్కడి నుంచి తెప్పించి రైతులకు అందజేశాం. రైతుల కడుపులో సల్ల కదలకుండా ఇంటికి ఎరువుల బస్తాలు పంపాం.
వ్యవసాయ సన్నద్ధత, ఎరువుల మీద ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఎరువులను సరఫరా చేయమని అడగలేదు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లు ఎన్నడూ ఎరువుల కోసం రైతులు లైన్లు కట్టలేదు. రాత్రంతా పడిగాపులు కాయలేదు. పోలీసులను పెట్టి ఎరువులు పంచాల్సిన దుస్థితి ఏ రోజు రాలేదు.
ఎక్కడ రైతులు తిరగబడి అధికారులను తంతారేమోనని పోలీస్ పహారాలో ఎరువులను పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, రవాణాశాఖ, జిల్లా యంత్రాంగం మధ్య తీవ్రమైన సమన్వయ లోపం ఉంది. అందుకే వచ్చిన ఎరువులను కూడా సరిగా పంపిణీ చేయలేకపోతున్నారు. నడిపించే నాయకుడికే వ్యవసాయం మీద కనీస అవగాహన లేకపోవడంతోనే ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది.
దమ్ముంటే ముఖ్యమంత్రిగాని మంత్రులు గాని గ్రామాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడాలి. క్యూలైన్ లో చెప్పులు ఆధార్ కార్డులు పెట్టి రైతులు ఎదురుచూస్తున్న దృశ్యాలను మీడియాలో చూసైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టని రైతు కుటుంబం లేనే లేదు.
పరకాల నియోజకవర్గం నల్లబెల్లిలో తన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుతో మూడు బస్తాల యూరియా తెచ్చిన రైతుపై రేవంత్ ప్రభుత్వం నాన్ బేయిలబుల్ కేసు పెట్టి అరెస్టు చేసింది ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉందా? రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని ముఖ్యమంత్రి చెప్తుంటే అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు మాత్రం కేంద్ర ప్రభుత్వం సరిపోయేంత ఎరువులు ఇవ్వలేదని ఆందోళన చేస్తున్నారు.
అంటే ముఖ్యమంత్రి చెబుతున్నది అబద్ధమా? కాంగ్రెస్ ఎంపీలు ఆడుతున్నది డ్రామానా ? స్పష్టం చేయాలి. 51 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖం చూసైనా 51 బస్తాల యూరియాను మోడీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ రాష్ట్రంలో పుట్టిన రోజు గిఫ్ట్ గా ఎరువుల బస్తాలను ఇచ్చే దుస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదు. రాష్ట్రంలోని చెరువులను నింపకుండా కృష్ణా, గోదావరి జలాలను వృథాగా ఆంధ్రకు పంపుతున్న రేవంత్ ప్రభుత్వ నిర్వాకాన్ని తెలంగాణ రైతులు గమనిస్తున్నారు.
ఇవాళ మళ్లీ రైతులు ఆత్మహత్యలు మొదలయ్యాయి. ఇప్పటికే 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల నివారణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది. రేవంత్ ప్రభుత్వ అసమర్ధతతో 70 లక్షల మంది తెలంగాణ రైతులు నష్టపోతున్నారు. వారి తరఫున కొట్లాడ్డానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. త్వరలోనే మా పోరాట కార్యాచరణ కూడా ప్రకటిస్తాం.
ఢిల్లీకి నోట్ల మూటలు మోయడంలో చూపించిన శ్రద్దలో పావు వంతైనా ఎరువుల బస్తాలు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి చూపిస్తే ఇవాళ ఈ సంక్షోభం వచ్చేదే కాదు. ఇంత జరుగుతుంటే ఒక్క బీజేపీ ఎంపీ , మంత్రి , ఎమ్మెల్యే, నాయకుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడగడం లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఎరువులు వచ్చాయనే కూడా చెప్పడం లేదు.
పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను బతిమిలాడుకొని, వాళ్ళ రాష్ట్రానికి ఎరువులను తెచ్చుకున్నారు. కానీ మన మంత్రులకు ముఖ్యమంత్రికి ఆ తెలివి కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు ఫుల్లుగా వచ్చాయి.
కానీ కింది స్థాయిలో అవి ఏమవుతున్నాయో తెలియడం లేదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రావు చెబుతున్నాడు. అంటే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని చెప్తున్నాడా? కాంగ్రెస్ వాళ్లు మధ్యలోనే యూరియాని దోచుకు తింటున్నారని చెబుతున్నాడా? ఇంత జరుగుతుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఎరువుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వచ్చింది? ఎంతమందికి పంపిణీ చేశారు? ఎంత మొత్తం పక్కదారి పట్టిందో చెప్పాలి.