(నవీన్)
2025 ఆగస్టు 20న భారత లోక్‌సభ ఒక అసాధారణ ఘర్షణకు వేదికైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు, 2025ను ప్రవేశపెట్టారు. ఆ క్షణంలోనే సభ అట్టుడికిపోయింది. ప్రతిపక్షాలు తీవ్ర నిరసనకు దిగాయి. కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ ఆ బిల్లు ప్రతులను చించివేయడం ఆ గందరగోళానికి పరాకాష్ట.
ఆ చించివేసిన కాగితపు ముక్కలు కేవలం ఒక బిల్లుకు సంబంధించినవి కావు. అవి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో నెలకొన్న తీవ్ర విభజన, అపనమ్మకాలకు ప్రతీకలుగా నిలిచాయి.
ప్రభుత్వం మూడు కీలక బిల్లులను సభ ముందు ఉంచింది. రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు అందులో ప్రధానమైనది. తీవ్రమైన నేరారోపణలపై అరెస్ట్ అయిన ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా రాష్ట్ర మంత్రులు వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే, వారి పదవి వాటంతట అదే రద్దవుతుంది. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న కేసులకు ఇది వర్తిస్తుంది. రాజ్యాంగంలోని అధికరణలు 75, 164, 239AA లకు సవరణలు చేయడం ద్వారా ఈ మార్పును తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ప్రభుత్వ వాదన ప్రకారం, ఇది అవినీతిపై పోరాటంలో ఒక కీలక ముందడుగు. తీవ్రమైన ఆరోపణలతో జైలులో ఉన్నప్పటికీ పదవిలో కొనసాగడం నైతిక విలువల ఉల్లంఘన అని ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ వంటి వారు జైలు నుంచే పదవిలో కొనసాగిన ఉదంతాలను ఇది ప్రస్తావిస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, ఒక ప్రజాప్రతినిధిపై నేరం రుజువై, రెండేళ్లకు పైగా శిక్ష పడితేనే అనర్హత వేటు పడుతుంది.
కానీ ఈ కొత్త బిల్లు, నేరం రుజువు కావడానికి ముందే, కేవలం అరెస్ట్ ఆధారంగా పదవిని తొలగించాలని ప్రతిపాదిస్తోంది. ఇది న్యాయవ్యవస్థ చేతిలో ఉన్న అధికారాన్ని కార్యనిర్వాహక వర్గానికి బదలాయించడమే.
ఈ బిల్లును ప్రతిపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టని ఆరోపించాయి. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి, ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్ర జరుగుతుందని వారు భయపడుతున్నారు. “ఇది దేశాన్ని పోలీస్ రాజ్యంగా మార్చే ప్రయత్నం” అని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా విమర్శించారు.
ఈ భయాలు అకారణమైనవి కావు. గత కొన్నేళ్లుగా ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలు ప్రతిపక్ష నేతలనే లక్ష్యంగా చేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఆరోపణలతో, విచారణ పేరుతో నెలల తరబడి జైలులో ఉంచి, రాజకీయంగా దెబ్బతీయవచ్చని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ బిల్లు ఆ ప్రక్రియకు రాజ్యాంగబద్ధత కల్పించడమేనని వారి ఆందోళన. “రేపు ఏ ముఖ్యమంత్రి పైనైనా తప్పుడు కేసు పెట్టి, 30 రోజులు జైల్లో ఉంచి, పదవి నుంచి తొలగించవచ్చు” అని ప్రియాంకా గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్య ఈ ఆందోళన తీవ్రతను తెలుపుతోంది.
లోక్‌సభలో బిల్లును చించివేయడం పార్లమెంటరీ నియమాలకు, సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. సభా గౌరవాన్ని మంటగలపడమే. స్పీకర్‌కు సభలో క్రమశిక్షణను కాపాడేందుకు విస్తృత అధికారాలు ఉన్నాయి. సభ్యులను సభ నుంచి బహిష్కరించే అధికారం కూడా ఉంది.
అయితే, తమ గొంతును ప్రభుత్వం పూర్తిగా నొక్కేస్తోందని, చర్చకు అవకాశం ఇవ్వకుండా చట్టాలను బలవంతంగా రుద్దుతోందని భావించినప్పుడు, ప్రతిపక్షాలు ఇలాంటి తీవ్ర నిరసనలకు దిగుతుంటాయి. తమ వాదన సభలో వినిపించే అవకాశం లేనప్పుడు, తమ నిస్సహాయతను, నిరసనను దేశ ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఇదొక ప్రదర్శనగా మారుతుంది. ఇది పార్లమెంటరీ చర్చల వైఫల్యానికి ఒక ప్రతీక.
ప్రస్తుతానికి ఈ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) పరిశీలనకు పంపారు. ఇది తాత్కాలిక ఉపశమనమే. కానీ ఈ ఘటన భారత ప్రజాస్వామ్యంలో అధికారం, జవాబుదారీతనం, కేంద్ర-రాష్ట్ర సంబంధాల మధ్య సమతుల్యతల మౌలిక విలువల ధ్వంసాన్ని ప్రశ్నిస్తోంది. దర్యాప్తు సంస్థలు రాజకీయ ఆయుధాలుగా మారుతూండటాన్ని నిలదీస్తోంది.
కె.సి. వేణుగోపాల్ చించివేసిన ఆ కాగితపు ముక్కలు కేవలం ఒక బిల్లు ప్రతులు కావు. అవి కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య చెదిరిపోయిన నమ్మకానికి, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పడుతున్న బీటలకు నిలువుటద్దం. ఈ విభజన ఇలాగే కొనసాగితే, చిరిగేది కాగితాలు కాదు, ప్రజాస్వామ్యపు పునాదులే.
(రచయిత సీనియర్ జర్నలిస్టు)