– ఎరువుల సరఫరా విషయంలో కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం
– అవసరానికి మించి యూరియా ఇచ్చిన కేంద్రం
– అదనపు యూరియా ఎక్కడికి వెళ్ళింది?
– కాంగ్రెస్ మిస్మేనేజ్మెంట్ వల్లే కృత్రిమ కొరత – “రన్ ఆన్ ఫర్టిలైజర్”
– ఇఫ్కో, క్రిబ్కో, ఆర్సీఎఫ్ నుంచి 7,250 రేక్స్ యూరియా తెలంగాణకు సరఫరా
– కరీకల్ పోర్ట్ దిగుమతుల్లో 10,000 MT ప్రత్యేకంగా తెలంగాణకు కేటాయింపు
– ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ బీసీలకు అన్యాయం
– ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వి. హన్మంతరావు పేరు ప్రకటించాల్సింది కదా?
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్: తెలంగాణలో ఎరువుల సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. నిజానికి కేంద్రం అవసరానికి మించిన యూరియాను తెలంగాణకు సరఫరా చేసిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్ వల్ల కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు.
ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించారు. ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు, తెలంగాణ బీసీ వర్గానికి చెందిన దత్తాత్రేయ కి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని మాట్లాడారు. మరి వారి ఆత్మప్రబోధన ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదు?
కాంగ్రెస్ పార్టీలోని, ఇండీ కూటమి ఎంపీలందరూ ఇప్పటికైనా ఆత్మప్రబోధన చేసుకుని, ఎన్డీయే ప్రకటించిన ఎంబీసీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కి ఓటు వేయాలని కోరుతున్నా. అప్పుడే నిజమైన బీసీలకు న్యాయం జరుగుతుంది.
రేవంత్ రెడ్డికి “భాస్కర్ అవార్డు – గోబెల్స్ ప్రైజ్” అన్నారు కదా. మరి ఇప్పుడు ఆత్మప్రబోధన ఎందుకు గుర్తుకు రాలేదు? ఆయన ఆత్మప్రబోధన చేసుకుని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వి. హన్మంతరావు పేరు ప్రకటించాల్సింది కదా? కాంగ్రెస్ పార్టీకి కేవలం బీసీ ఓట్లు మాత్రమే ముఖ్యం. కానీ రిజర్వేషన్ల విషయంలో వారికి చిత్తశుద్ధి అసలు లేదు.
రైతులను భయపెట్టి “రన్ ఆన్ ఫర్టిలైజర్” పరిస్థితిని తీసుకువచ్చింది కాంగ్రెస్సేనని ఆయన స్పష్టం చేశారు. ఇఫ్కో, క్రిబ్కో, ఆర్సీఎఫ్ నుంచి 7,250 రేక్స్ యూరియా రాష్ట్రానికి వచ్చిందని, కరీకల్ పోర్ట్ దిగుమతులలో 10,000 మెట్రిక్ టన్నులు ప్రత్యేకంగా తెలంగాణకు కేటాయించిందని వివరించారు. ప్రపంచ సమస్యల మధ్య కూడా కేంద్రం వెనుకాడలేదని, రైతుల సంక్షేమమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ధ్యేయమని రాంచందర్ రావు తెలిపారు.
హైదరాబాద్‌లో ఈ రోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎరువుల సరఫరా విషయంలో గత కొన్ని రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ప్రచారం చేస్తోంది. “మదర్ ఆఫ్ ఆల్ లైస్” అంటే కాంగ్రెస్ పార్టీ. నిజాన్ని కూడా అబద్ధం లా నమ్మించే నైపుణ్యం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఉంది.
కాంగ్రెస్ పార్టీ..“కేంద్రం యూరియా ఇవ్వడం లేదు కాబట్టే రైతులకు ఎరువుల కొరత” అని తప్పుడు ప్రచారం చేసింది. కాని వాస్తవానికి కేంద్రం యూరియా సరఫరా ఎక్కడా ఆపలేదు. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు చర్చకు రావాలని.. ఎందుకంటే ఎక్కడా కేంద్రం యూరియా సరఫరా తగ్గించలేదు. కొరతకు కారణాలు వేరే ఉన్నాయి. అందుకే మార్కెట్లో కొరత కనిపించిందని నేను గతంలోనే స్పష్టంగా వివరించాను.
ఈ విషయంలో చర్చకు నేను గతంలోనే సిద్ధమని సవాల్ విసిరాను. కానీ దానికి సంజాయిషీ చెప్పే ధైర్యం కాంగ్రెస్ నాయకులు చూపలేదు. కేంద్ర ప్రభుత్వం 2025 రబీ సీజన్ (అక్టోబర్ 2024 – మార్చి 2025)లో తెలంగాణకు అవసరమైన 9.87 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం అమ్మినది 10.43 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగిలింది 2.04 లక్షల టన్నులు ఖరీఫ్ సీజన్ ఓపెనింగ్ స్టాక్‌గా ఉంది. ఈ ఖరీఫ్ సీజన్ (ఆగస్టు 2025 వరకు)లో కావాల్సిన 8.30 లక్షల మెట్రిక్ టన్నులలో ఇప్పటివరకు 5.18 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం సరఫరా చేసింది. కాబట్టి ఈ రోజు వరకు మొత్తం అందుబాటులో ఉన్న యూరియా – 7.22 లక్షల మెట్రిక్ టన్నులు.
అసలు సమస్య – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ముందుగానే “స్టాక్ లేదు” అని అబద్ధాలు చెప్పడం. ఇది మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ భయంతో రైతులు ఒక్కసారిగా షాపులకు చేరుకోవడం, దళారులు బ్లాక్ మార్కెట్ కొనుగోలు చేయడం వలన కృత్రిమ కొరత ఏర్పడింది.
దీన్నే “రన్ ఆన్ ఫర్టిలైజర్” అంటాం. బ్యాంకులపై వదంతులతో ప్రజలు డబ్బులు వాపస్ తీసుకున్నప్పుడు బ్యాంకులు దివాళా తీయడం లాగే ఇప్పుడు తెలంగాణలో “రన్ ఆన్ ఫర్టిలైజర్” నడుస్తున్నది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వం వహిస్తున్న సొంత జిల్లాలో, గత ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో అదనంగా 3,200 టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ఏడాది పంట విస్తీర్ణంలో గత సంవత్సరంతో పోల్చితే ఏ మార్పూ లేదు. మరి ఇంత అదనపు యూరియా ఎక్కడికి వెళ్ళింది? నిజంగా రైతుల చేతికి చేరిందా, లేక బ్లాక్ మార్కెట్ మాఫియా చేతికి చేరుతోందా? దీనిపై మంత్రి తుమ్మల సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం వల్లే కృత్రిమ యూరియా కొరత ఏర్పడింది.
ఇఫ్కో, క్రిబ్కో, ఆర్సీఎఫ్ కంపెనీలు కలిసి తెలంగాణకు దాదాపు 7,250 రేక్స్ యూరియా సరఫరా చేశాయి. కరీకల్ పోర్ట్ నుంచి మొత్తం 30,000 మెట్రిక్ టన్నుల fertilizers దిగుమతి అయ్యాయి. వాటిలో 10,000 మెట్రిక్ టన్నులు తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇది కాంగ్రెస్ ఒత్తిడి వల్ల కాదు, కేంద్రం తన బాధ్యతగా చేసిన కర్తవ్యమే.
ఇటీవల రామగుండం ఫ్యాక్టరీలో సాంకేతిక సమస్యల కారణంగా ఉత్పత్తి ఆగినా, కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రపంచ సమస్యలు (ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం, రెడ్ సీ ఇష్యూ, ఎగుమతులు తగ్గడం) మధ్య కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అవసరం కంటే ఎక్కువ యూరియా పంపించింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు మేనేజ్మెంట్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు.
రైతుల సంక్షేమమే నరేంద్ర మోదీ ప్రభుత్వ ధ్యేయం. కేంద్రం రూ. 1.40 లక్షల కోట్ల సబ్సిడీని ఎరువులపై కేటాయించింది. రైతులకు కేవలం 10–20% ధరలకే ఎరువులు అందిస్తోంది. తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కావలసినంత యూరియా అందుతుంది.
భారతీయ జనతా పార్టీ దేశ సమగ్రత, ఐక్యత కోసం పనిచేసే పార్టీ. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేది చట్టం. అంతేకాని ఎవ్వరినీ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలనడం సరికాదు. మనమంతా భారతీయులమే. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఎవరైనా ఇక్కడ నివసించడానికి హక్కు ఉంది. అంతేకాని “మార్వాడీ గో బ్యాక్” అనే నినాదాలు మంచివి కావు.
ఈ నినాదాల వెనుక, చర్యల వెనుక అర్బన్ నక్సల్స్ వంటి అనేక శక్తులు ఉన్నాయి. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులే ఇటువంటి నినాదాలకు బలం చేకూరుస్తున్నారు. నేడు తెలంగాణలో శాంతి-భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది.
తెలుగు ప్రైడ్ అంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ… గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ గౌరవం చూపకుండా, తెలుగు వారైన వెంకయ్య నాయుడి కి మద్దతు ఇవ్వలేదు. అందుకు బదులుగా వేరొకరికి సపోర్ట్ చేసింది. నిజంగా తెలుగు రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్సే.