– టీయుడబ్ల్యుజె
హైదరాబాద్ : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ ను తిరస్కరించడం అత్యంత బాధాకరమైన విషయమని, తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అభిప్రాయబడింది. ఈరోజు జరిగిన పరిణామం వేదనభరితమైనదని పేర్కొంది.
దాదాపు 18 ఏళ్లుగా అనంత కోటి ఆశలతో ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ ను కొట్టివేయడం తీవ్ర నిరాశను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం పై సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ లు మాట్లాడుతూ 18 సంవత్సరాల క్రితమే కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లించిన జే ఎన్ జే సొసైటీ సభ్యులకు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వెంటనే అదే చోట ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యతను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి దానిని అమలు చేయడం ద్వారా ఈ ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తే బాగుంటుందనే విషయాన్ని సూచించారు. ఈ సొసైటీ సభ్యులకు ఇళ్ల స్థలాల కేటాయించడం ద్వారా మార్గం సుగమం చేయడంతో పాటు ఇతర జర్నలిస్టులకు సైతం ప్రస్తుతం ముఖ్యమంత్రి మాట ఇచ్చిన విధంగా న్యూ సిటీలో ఇళ్ల స్థలాలను కేటాయించి జర్నలిస్టుల సొంతింటి కల సాకారాన్ని నెరవేర్చాలని కోరారు.
గత 30 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో జర్నలిజం వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాలు పొందలేక, ఉంటున్న ఇళ్లకు అద్దెలు చెల్లించలేక అపసోపాలు పడుతున్నారని వివరించారు. దీనిని ప్రధాన సమస్యగా గుర్తించి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో స్పందించి సత్వరమే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని విన్నవించారు.