– ఇకపై రెండు ప్రధాన శ్లాబులే
– పన్నులు, ధరలు తగ్గే చాన్స్
– యథావిధిగా పొగాకు, లగ్జరీ వస్తువులపై అధిక పన్నుల విధానం
– మంత్రుల బృందం భేటీలో కీలక నిర్ణయాలు
ఢిల్లీ: సామాన్యులు, వ్యాపారులకు పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కేవలం రెండు ప్రధాన శ్లాబులను మాత్రమే అమలు చేయాలని రాష్ట్రాల మంత్రుల బృందం సూత్రప్రాయంగా అంగీకరించింది.
బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన గురువారం జరిగిన జీవోఎం సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రమ భట్టాచార్య, కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానంలో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. ‘జీఎస్టీ 2.0’గా పిలుస్తున్న ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం జీఎస్టీలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం చొప్పున నాలుగు పన్ను రేట్లు ఉన్నాయి.
తాజా ప్రతిపాదనల ప్రకారం.. 12 శాతం, 28 శాతం శ్లాబులను పూర్తిగా తొలగిస్తారు. ఇకపై చాలా వరకు వస్తువులు, సేవలు 5 శాతం లేదా 18 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ మార్పుల వల్ల 12 శాతం శ్లాబులో ఉన్న దాదాపు 99 శాతం వస్తువులు 5% శ్లాబులోకి రానున్నాయి. 28% పన్ను పరిధిలో ఉన్న సుమారు 90% వస్తువులు 18% శ్లాబులోకి రానున్నాయి. దీంతో వినియోగదారులపై భారం గణనీయంగా తగ్గుతుందని అంచనా.
పొగాకు ఉత్పత్తులు, కొన్ని రకాల విలాసవంతమైన వస్తువులపై ప్రస్తుతం ఉన్న అధిక పన్నుల విధానం కొనసాగుతుంది. లగ్జరీ కార్లను కూడా 40% పన్ను శ్లాబు పరిధిలోకి తీసుకురావాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది.