– ఆ ఆడియో నకిలీదని చెప్పమంటూ బెదిరిస్తున్నారు
– ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించండి
– పార్టీ కోసం జైలుకు వెళ్లా
– మీడియాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేత ధనుంజయ నాయుడు
అనంతపురం: అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే వర్గీయుల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని.. తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు, టీఎన్ఎస్ఎఫ్ నేత గుత్తా ధనుంజయ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు.
ధనుంజయ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. “ఎమ్మెల్యే ప్రసాద్ వర్గీయులు నా భార్యకు, సోదరుడికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఆ ఆడియో నకిలీదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఎమ్మెల్యే వల్ల నా ప్రాణానికి హాని ఉంది. పార్టీ కోసం కష్టపడి జైలుకు కూడా వెళ్లాను” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను తానే బయటపెట్టానని చెబుతున్న ధనుంజయ తనకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.
‘వార్ 2’ సినిమా విడుదల సందర్భంగా, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ హీరో ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అనంతపురంలో సినిమాను ఆడనివ్వనని హెచ్చరించారని ఆరోపిస్తూ ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆడియోను ధనుంజయ నాయుడు లీక్ చేయగా, ఎమ్మెల్యేపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
అనంతపురంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన తెలిపి, ఆయన ఫ్లెక్సీలను చించివేశారు. ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన తల్లిని కూడా అవమానించిన ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ధనుంజయ కోరారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయ నాయుడు మీడియా ముందుకొచ్చి, ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆరోపించడంతో ఈ వ్యవహారం మరింత ముదిరినట్లయింది.
మరోవైపు ఎమ్మెల్యే దగ్గుపాటిని పిలిపించిన సీఎం చ ంద్రబాబునాయుడు, ఆయనను తీవ్రంగా మందలించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు సహించబోనని హెచ్చరించినట్లు పార్టీ నేతలు వెల్లడించారు.