– కక్ష సాధింపు కే లిక్కర్ స్కాం సృష్టి
– నాకు లేని ల్యాప్ ట్యాప్‌ను సిట్ ఎలా స్వాధీనం చేసుకుంటుంది?
– మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
తిరుపతి: చంద్రబాబు తన పాలనా వైఫల్యాల నుంచి, తన దుర్మార్గాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి లేని లిక్కర్ వ్యవహారాన్ని సృష్టించారని మాజీ డిప్యూటీ సీఎం కె. నారాయణస్వామి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నెల్లూరు గంగాధర్ జిల్లా వైయస్ఆర్సీపీ సమన్వయకర్త కె.కృపాలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు.
కేవలం కక్షసాధింపుల కోసం లిక్కర్ స్కాం అంటూ ఒక బేతాళ కథను తయారు చేసి, దాని ద్వారా తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు కుట్రను అమలు చేస్తున్నాడని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కొనసాగింపుగానే 76 ఏళ్ల వయస్సున్న నాపై కూడా చంద్రబాబు కుట్రపని, విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
వృద్ధాప్యం కారణంగా నాకు ఆరోగ్యం బాగోలేదు. అందుకనే నేను గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని, నా కుమార్తెకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వైయస్ జగన్ నా కుమార్తెకు టిక్కెట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్న సిట్ వాళ్లు వచ్చి దర్యాప్తు పేరిట నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను.
ఎక్సైజ్ మంత్రిగా అయిదేళ్ళ పాటు పనిచేశాను. ‘నాకేమీ తెలియదు, నాపైన ఉన్న వారు అన్ని నిర్ణయాలు చేశారు’ అని ఎలా చెబుతాను? అలా చెప్పాను అని అంత బాధ్యతారహితంగా మీడియాలో ఎలా కథనాలు రాశారో అర్థం కావడం లేదు. నా ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి నన్ను అరెస్ట్ చేస్తున్నారని, మా ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారని, ఏదో స్వాధీనం చేసుకుంటున్నారంటూ ఇలా కసీ, ద్వేషం, పగతోనే నాపైన తప్పుడు బ్రేకింగ్‌లు, స్క్రోలింగ్‌లు వేశారు. తప్పుడు కథనాలు రాశారు.
నా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూనే పదవులను అందుకున్నాను. నాపైన ఎప్పుడూ ఎటువంటి ఆరోపణలు లేవు. సిట్ వాళ్లు దర్యాప్తులో తాము చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటిదీ తేల్చలేకపోయినా, వాళ్లేదో కనిపెట్టినట్టుగా కట్టు కథలు అల్లుతున్నారు. వాటినే ఈ మీడియా రాస్తుంది, వాటినే ఛార్జిషీట్లలో పెట్టడం కూడా మనం చూస్తున్నాం. అంతకుమించి సిట్ వాళ్లు చూపించిన ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు. ఈ లిక్కర్ వ్యవహారం అక్రమ కేసని తేల్చిచెప్పడానికి ఇంతకన్నా రుజువులు అవసరం లేదు.
నాకు ల్యాప్‌టాప్ లేకపోయినప్పటికీ నిన్న సిట్ వాళ్లు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్టు తప్పుడు రాతలు రాశారు. నేను ఎప్పుడూ ల్యాప్ టాప్ వాడలేదు, ఉపయోగించడంకూడా నాకు తెలియదు. సిట్ వాళ్లు కూడా మా ఇంటి దగ్గర నుంచి ఎలాంటి ట్యాప్ టాప్ ను తీసుకెళ్లలేదు. మరి ఈ తప్పుడు ఎలా రాయగలుగుతున్నారు? చివరకు సిట్ వాళ్లు నా ఫోన్‌ను తీసుకున్నారు. నా ఫోన్ తీసుకుని వాళ్లేం చేస్తారు? నా లాంటి వాడు ఈ ఫోన్లను ఎంతవరకూ వాడుతాడు? అయినా ఏదో ఉందని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.
ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పనులు చేసిపెట్టినట్లు నిరూపిస్తే విషం తాగి చనిపోతాను. లిక్కర్ పాలసీలో ఎం తప్పు జరిగిందని అప్రూవర్‌గా మారాలి? దళిత, బలహీనవర్గానికి చెందిన నాయకుడిననే నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు కథనాలు రాశారు.