(నవీన్)
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని ఒకవైపు ఆర్భాటపు ప్రకటనలు వినిపిస్తున్నాయి. మరోవైపు దేశం అప్పుల కుప్పగా మారుతోందని, సంపన్నులు మరింత కుబేరులై, పేదలు నిరుపేదలుగా మిగిలిపోతున్నారని సామాన్యుడి ఆవేదన. ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యం హాస్యాస్పదం కాదు, తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. అసలు మన ఆర్థిక వ్యవస్థలో లోపం ఎక్కడుంది? ఈ అప్పుల భారతం భవిష్యత్తు ఏమిటి?
గత దశాబ్ద కాలంలో మన దేశ అప్పుల భారం ఆందోళనకర స్థాయిలో పెరిగింది. 2014లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పు సుమారు ₹83 లక్షల కోట్లు. నేడు అది ₹207 లక్షల కోట్లు దాటిపోయింది. అంటే పదేళ్ళలో అప్పు రెట్టింపు కన్నా ఎక్కువైంది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే మన అప్పుల నిష్పత్తి 81 శాతానికి పైగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇది ప్రమాద ఘంటిక. సాధారణంగా ఈ నిష్పత్తి 60 శాతం మించకూడదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తారు.
ఈ అప్పులు కేవలం సంక్షేమం కోసమో, అభివృద్ధి కోసమో చేసినవి కావు. గత పదేళ్ళలో కార్పొరేట్ సంస్థలకు రద్దు చేసిన బ్యాంకు రుణాలు ₹16 లక్షల కోట్లకు పైమాటే. అంటే సామాన్యుల సొమ్ముతో నడిచే బ్యాంకులకు కార్పొరేట్లు ఎగ్గొట్టిన అప్పులను ప్రభుత్వం తన నెత్తిన వేసుకుంది. దీనికోసం మళ్ళీ ప్రజల నుంచే అప్పులు చేసింది.
ఈ అప్పుల భారానికి మనం చెల్లిస్తున్న మూల్యం చాలా పెద్దది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సింహభాగం వడ్డీలకే పోతోంది. ప్రభుత్వం పన్నుల రూపంలో సంపాదించే ప్రతి రూపాయిలో దాదాపు 37 పైసలు పాత అప్పులకు వడ్డీ కట్టడానికే సరిపోతోంది. ఇది ప్రభుత్వ మొత్తం ఖర్చులో 20 శాతం. వడ్డీలకే ఇంత పెద్ద మొత్తం వెళ్ళిపోతుంటే ఇక విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? దేశ భవిష్యత్తును వడ్డీల రూపంలో మనం ఏటా కాల్చేస్తున్నాం. ఇది మన అభివృద్ధి అవకాశాలను మనమే అణచివేసుకోవడం లాంటిది.
ఈ ఆర్థిక విధానాల అసలు లోపం ఇక్కడే ఉంది. ఇది సంపద సృష్టిలో, పంపిణీలో తీవ్ర అసమానతలకు దారితీస్తోంది. ఆక్స్ఫామ్ నివేదికల ప్రకారం, దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కేవలం ఒక్క శాతం కుబేరుల చేతిలో కేంద్రీకృతమై ఉంది. అదే సమయంలో, దేశంలోని నిరుపేద 50 శాతం జనాభా (సుమారు 67 కోట్ల మంది) చేతిలో ఉన్నది కేవలం 3 శాతం సంపద మాత్రమే.
ఈ వ్యత్యాసం యాదృచ్ఛికం కాదు. ఇది ప్రభుత్వ విధానాల ఫలితం. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వంటి పరోక్ష పన్నుల ద్వారా పేదల నుంచి ఎక్కువ ఆదాయం రాబడుతున్నారు. జీఎస్టీ ఆదాయంలో 64 శాతం కింది స్థాయి 50 శాతం ప్రజల నుంచే వస్తోంది. మరోవైపు కార్పొరేట్లకు పన్ను రాయితీలు, రుణ మాఫీలు ఇస్తున్నారు. అంటే, పేదలపై పన్నుల భారం మోపి, ఆ డబ్బును సంపన్నుల ప్రయోజనాలకు మళ్లిస్తున్నారు.
అప్పులు సామాన్యులు మోస్తుంటే, దాని ఫలాలు కొద్దిమంది అనుభవిస్తున్నారు. ఇంతటి తీవ్రమైన అప్పుల భారం, అసమానతలు పెట్టుకుని మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకోవడం వాస్తవాన్ని వక్రీకరించడమే.
దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కేవలం మొత్తం జీడీపీ అంకెలపై ఆధారపడి ఉంటుంది. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో మొత్తం ఉత్పత్తి విలువ ఎక్కువగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. కానీ నిజమైన అభివృద్ధిని తలసరి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాలు, మానవాభివృద్ధి సూచికలతో కొలవాలి. ఈ విషయాల్లో మనం బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాల కన్నా వెనుకబడి ఉన్నామని జీన్ డ్రెజ్, అమర్త్య సేన్ వంటి ఆర్థికవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు.
అధిక యువ నిరుద్యోగం, పడిపోతున్న ఎగుమతులు, తగ్గుతున్న పొదుపు రేటు వంటివి మన ఆర్థిక వ్యవస్థలోని లోపాలను స్పష్టం చేస్తున్నాయి. ఈ చేదు నిజాలను దాచిపెట్టి, కేవలం జీడీపీ అంకెలను చూపించి గొప్పలు చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టడమే.
భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలంటే విధానాల్లో మౌలికమైన మార్పు రావాలి. కార్పొరేట్ ప్రయోజనాల నుంచి దృష్టి మళ్లించి ప్రజా సంక్షేమం వైపు చూడాలి. అప్పులు చేయడం కాదు, ఆదాయ వనరులు పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. సంపన్నులపై సంపద పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు విధించి, పేదలపై పరోక్ష పన్నుల భారం తగ్గించాలి. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులను భారీగా పెంచాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. లేకపోతే, ఈ అప్పుల భారతం అసమానతల అగాధంలో మరింత లోతుకు కూరుకుపోవడం ఖాయం.
(రచయిత సీనియర్ జర్నలిస్టు)