– చికాగో సాహితీ మిత్రుల సభలో ఈమని శివ నాగిరెడ్డి
చికాగో: విలక్షణమైన తెలుగు వారి సంస్కృతికి దేవాలయాలు పట్టుగొమ్మలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
చికాగో సాహితీ మిత్రులు, చికాగో ఆంధ్ర అసోసియేషన్, లేమాంట్ లోని హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో, గుప్తాహాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, శాతవాహనుల కాలం నుంచి విజయనగర అనంతర కాలం వరకు వివిధ శైలిలో నిర్మించిన ఆలయాలు సనాతన ధర్మ కేంద్రాలుగా, విద్య, వైద్యాలయాలుగా, కళలకు కాణాచిగా బహుముఖ పాత్రలను పోషించాయన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయ నిర్మాణ వికాసాన్ని గురించి ప్రసంగిస్తూ, సా.శ.పూ. 2వ శతాబ్దిలో దేశంలోనే మొట్టమొదటి శివాలయం తిరుపతి సమీపంలోని గుడిమల్లం లో నిర్మించబడిందని, సా.శ. 1వ శతాబ్దిలో తెలంగాణలో బ్రిడ్జ్ రంగాపూర్ వద్ద శివాలయం, ఆ తరువాత ఇక్ష్వాకుల నాటి సా.శ. 3వ శతాబ్ది ఆలయాలు నాగార్జునకొండ వద్ద, సా.శ. 4వ శతాబ్దం నాటి చేజర్ల, పెద్దవేగి, గుమ్మడం, సా.శ 5వ శతాబ్ది నాటి కీసరగుట్ట శివాలయాలు ఇటుకలో నిర్మించబడినాయన్నారు.
ఆ తర్వాత బాదామి చాళుక్యులు అలంపురం, వేంగి చాళుక్యులు పొందుగలలో సా.శ. 6వ శతాబ్దిలో రాతితో ఆలయాలు నిర్మించారని, అదే కాలంలో విజయవాడ, ఉండవల్లి, భైరవకోన, అడవి సోమనపల్లిలో గృహాలయాలను తొలిచారని, ఇక రాష్ట్ర కూటులు, వెములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, తూర్పు గాంగులు, రేనాటి చాళుక్యులు, నోలంబులు, విజయనగర చక్రవర్తులు, రెడ్డి రాజులు, పద్మనాయకులు, ముసునూరి నాయకులు తమ తమ ప్రత్యేకమైన శైలిలో తెలుగు నేలపై విలక్షణ వాస్తు విన్యాసం, శిల్పకళ ఉట్టిపడేటట్టు నిర్మించి వాటిని సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దారని శివనాగిరెడ్డి చెప్పారు.
అనంతరం చికాగో సాహితీ మిత్రులు సంస్థ కార్యదర్శి, అధ్యక్షులు జయదేవ్ మెట్టుపల్లి, శ్రీకృష్ణ మతుకుమల్లి, తానా మాజీ అధ్యక్షులు, సాహితీ ప్రియులు జంపాల చౌదరి, అంతర్జాతీయ చిత్రకారుడు, పద్మశ్రీ డా. ఎస్వీ రామారావు, చికాగో ఆంధ్ర అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ పెద్దమల్లు, తమిస్ర కొచ్చాడ, రాఘవ జట్ల, నర్సింహారెడ్డి ఒగ్గు, సునీత రాచపల్లి, శ్రియ కొంచాడ, ప్రసంగకర్త శివనాగిరెడ్డిని ఘనంగా సత్కరించారు.