– మొదటి సంతకం ప్రీతి ఫైల్‌పైనే పెడతానని హామీ ఇచ్చారు
-కానీ ఆయన మాట నిలబెట్టుకోలేదు
– జనసేన ఆఫీసు ముందు ఆమరణ దీక్ష చేస్తా
– వంగలపూడి, శ్రీకాంత్ పెరోల్ కేసుపై దృష్టి పెడుతున్నారు – గిరిజనులను ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారు
– సుగాలి ప్రీతి తల్లి పార్వతి సంచలన ఆరోపణలు
విజయవాడ: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , అధికారంలోకి వచ్చాక ఆ మాట మరచిపోయారని సుగాలి ప్రీతి హత్య కేసులో న్యాయం కోసం ఎనిమిదేళ్లుగా పోరాడుతున్న ఆమె తల్లి పార్వతి మండిపడ్డారు. “న్యాయం చేయలేని సేనానిగా పవన్ ఎలా నిలుస్తారు?” అని ప్రశ్నించారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా, నా కూతురి కేసు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మొదటి సంతకం ప్రీతి ఫైల్‌పైనే పెడతానని హామీ ఇచ్చారు. కానీ ఆయన మాట నిలబెట్టుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన పార్టీ ఆఫీసు ముందు ఆమరణ దీక్ష చేస్తానని సుగాలి ప్రీతి తల్లి ప్రకటించారు.
సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని, ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కేసు అసెంబ్లీలో కూడా చర్చకు రావాలని కోరారు. హోం మంత్రి వంగలపూడి, శ్రీకాంత్ పెరోల్ కేసుపై దృష్టి పెడుతున్నారు. కానీ నా కూతురి కేసుపై ఆ శ్రద్ధ లేదు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసుకు ప్రత్యేక బృందం వేస్తే, నా కూతురి కేసుకు ఎందుకు అదే శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు. గిరిజనులను ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.