– మా బిల్లులు మాకు ఇప్పించండి
హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ మత్స్య భవన్ వద్ద చేప రైతులు అర్ధనగ్న ఆందోళనకు దిగారు. గత రెండు సంవత్సరాలుగా తాము సరఫరా చేసిన చేపల బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.75 కోట్లు, 2024–25కి మరో రూ.34 కోట్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని. అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదని వారు ఆరోపించారు. “రైతుల ప్రభుత్వమని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మా సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు?” అని ప్రశ్నించారు.
చేపల ఉత్పత్తిలో తెలంగాణకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినా, ఆ చేపల పంపిణీ చేసిన రైతులు మాత్రం బకాయిల కోసం బతుకులాట పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షంలో పిల్ల జల్లతో భారీ ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ప్రభుత్వం, అధికారులను హెచ్చరించారు..