– మాజీ శాసన మండలి సభ్యుడు లక్ష్మణరావు
గుంటూరు: ఉద్యోగ సాధనలో పోటీ తత్వం గణనీయంగా పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం, స్పోకెన్ ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ ఎఫైర్స్ లలో నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే విజేతలగా నిలవగలరని మాజీ శాసన మండలి సభ్యుడు కె.ఎస్. లక్ష్మణరావు తెలిపారు.
కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీ ఉదయం గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జరిగిన విద్యా వేత్తల సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. లక్ష్మణరావు ప్రసంగిస్తూ విద్యారంగానికి కౌండిన్య ఐఏఎస్ అకాడమీ చేస్తున్న కృషిని కొనియాడారు. గత 20 సంవత్సరాలుగా రెండు కోట్ల రూపాయల కు పైగా ప్రతిభ గల పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్స్ ఇవ్వడం, దాదాపు ఏడు కోట్ల రూపాయల విరాళాలు సేకరించి కౌండిన్య ఐఏఎస్ అకాడమీ నిర్మించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి, రిటైర్డ్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ చంద్రశేఖర్, చరిత్ర అధ్యాపకులు పి.శ్రీనివాసులు, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి.సేవా కుమార్, కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివా రెడ్డి, రాజ్యాంగ చర్చా వేదిక కార్యదర్శి అవధానుల హరి, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేతలు పాల్గొన్నారు.