మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో గిడుగు వెంకట రామమూర్తి జయంతి, నందమూరి హరికృష్ణ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. శాసన సభ్యురాలు గళ్ళ మాధవి, జాతీయ పార్టీ కార్యాలయ కార్యదర్శి పర్చూరు అశోక్ బాబు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీ రమణ, తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, పరుచూరి కృష్ణ, వందనా దేవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు వారి చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ.. గిడుగు వెంకట రామమూర్తి తెలుగు భాషకు చేసిన సేవలను కొనియాడారు. గిడుగు వెంకట రామమూర్తిని తెలుగు భాషోద్యమ పితామహుడిగా అభివర్ణించారు. తెలుగును సామాన్య ప్రజలకు చేరువ చేసి, పుస్తకాలను సరళమైన భాషలో రాసేందుకు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. గిడుగు చేసిన కృషి వల్లే తెలుగు భాషలో సాహిత్యం, రచనలు సులభంగా అర్థమయ్యేలా మారాయన్నారు. ఆయన పేరు తెలుగు భాషా ఉద్యమానికి పర్యాయపదంగా మారిందన్నారు.
అలాగే నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో దాని బలోపేతంలో హరికృష్ణ కీలక పాత్ర పోషించారని అన్నారు. 1982లో ఎన్టీఆర్ ప్రచార రథాన్ని నడిపి రాష్ట్రమంతా పర్యటించి పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేశారని గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా హరికృష్ణ సేవలు అందించారని, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ కు మద్దతుగా నిలిచారన్నారు. ఆయన ఆకస్మిక మరణం తెలుగుదేశం పార్టీకి, అభిమానులకు తీరని లోటని పేర్కొన్నారు.