– 2025–26 తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన కేంద్రం
– వైద్య సిబ్బందికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు
అమరావతి: రక్తహీనత (ఎనీమియా) నివారణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఆరు నెలల శిశువు నుంచి చిన్న పిల్లలు, యువత, గర్భిణులు, బాలింతల్లో రక్త హీనత తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా తీసుకున్న చర్యలతో ఏపీకి జాతీయ స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. రక్తహీనత తగ్గించే సిరప్, మాత్రల పంపిణీకి సంబంధించిన వివిధ కేటగిరీల్లో కనబరిచిన పనితీరు ప్రతిపాదికన రాష్ట్రానికి తొలి ర్యాంకును కేంద్రం ప్రకటించింది.
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెల (తొలి త్రైమాసికం)ల్లో రక్త హీనత నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలు తీసుకున్న చర్యలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమీక్షించింది. ఐఎఫ్ ఏ మాత్రలు, సిరప్ పంపిణీ ప్రాతిపదికన రాష్ట్రాల వారీగా ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, హర్యానా, తెలంగాణ రాష్ట్రాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు లభించాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు మూడో ర్యాంకు లభించింది. అయితే… ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కూటమి ప్రభుత్వం పనితీరును మరింత మెరుగుపరుచుకుని తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.
2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏపీకి రెండో ర్యాంకు లభించింది. కిందటేడాది కంటే ఈ సారి ఏపీ పనితీరు మరింత మెరుగుపడింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ పథకం అమలుకు తరచుగా సమీక్షిస్తూ వస్తున్నారు.
5 కేటగిరిల్లో ప్రథమ స్థానం
ఆరు కేటగిరీలకుగాను 5 కేటగిరిల్లో ఏపీ తొలిస్థానాన్ని దక్కించుకుంది. ఇండెక్స్ లో 88 శాతం వృద్ధి నమోదుతో ఏపీ తొలి ర్యాంకును దక్కించుకుంది. 6-59 నెలల కేటగిరిలో 77.3 శాతం, 5-9 ఏళ్ల కేటగిరిలో 95 శాతం, 10-19 ఏళ్ల కేటగిరిలో 94.7 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 10-19 ఏళ్ల కౌమార దశ పిల్లల కేటగిరిలో మాత్రమే ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఈ కేటగిరిలో హర్యానా, తెలంగాణ రాష్ట్రాలు తొలి రెండు ర్యాంకులను దక్కించుకున్నాయి.
జాతీయ స్థాయిలో తొలి స్థానంలో రాష్ట్రాన్ని నిలిపిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు.
పంపిణీ ఇలా..
ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సిరప్ ను 2025-26లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 22,99,649 మంది పిల్లల (6 నుంచి 59 నెలలు)కు ఉచితంగా అందజేశారు.
ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను 30,35,641 (5–9 ఏళ్ల మధ్య పిల్లలు) మందికి అందించారు.
కౌమార దశలో ఉన్న వారిలో 29,84,033 మంది, గర్భిణుల్లో 2,69,952, బాలింతల్లో 1,63,177 మందికి ఐఎఫ్ఏ మాత్రలను అందించారు.
వయసుల ప్రాతిపదికన సిరప్, మాత్రల పరిమాణంలో మార్పులున్నాయి. రక్తహీనతను నివారించేందుకు ఎనీమియా ముక్త్ భారత్ (ఏఎంబీ) కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2018 నుంచి అమలుచేస్తోంది. పిల్లల కోసం వారి తల్లులకు ఆశా వర్కర్లు, ఎ.ఎన్.ఎం.ల ద్వారా ఐఎఫ్ఏ సిరప్ బాటిళ్లను అందిస్తున్నారు. మిగిలిన వయసుల వారికి విద్యా సంస్థల్లో పంపిణీచేస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు నేరుగా ఇస్తున్నారు.
6 నుంచి 59 నెలల పిల్లలకు 1 ఎంఎల్ ఐఎఫ్ (ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్) సిరప్ వారానికి రెండుసార్లు చొప్పున 8 నుంచి పది డోసుల చొప్పున వైద్య ఆరోగ్య శాఖ అందిస్తోంది. 5-9 ఏళ్ల పిల్లలకు ఐఎఫ్ఏ మాత్రలను నెలకు నాలుగు చొప్పున ఇస్తోంది. 10-19 ఏళ్ల మధ్యన ఉన్న పిల్లలకు నెలకు నాలుగు ఐఎఫ్ఏ మాత్రలు పంపిణీ చేస్తోంది.
గర్భిణిలు, బాలింతలకు 180 మాత్రలు చొప్పున ఇస్తున్నారు. గర్భం దాల్చి మూడు నెలలు దాటిన అనంతరం, ప్రసవం జరిగిన మరుసటిరోజు నుంచి ఈ మాత్రలను వైద్య ఆరోగ్య శాఖ ఉచితంగా అందిస్తోంది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను అందించగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధుల్ని సమకూరుస్తోంది.