నల్గొండ: కొత్త కలెక్టర్ కార్యాలయ భవనం గ్రౌండ్ ఫ్లోర్ ను డిసెంబర్ లోగా, మొత్తం భవనాన్ని వచ్చే సంవత్సరం జూన్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
శుక్రవారం నాడు మంత్రి పాత కలెక్టర్ కార్యాలయం వెనకవైపు నిర్మిస్తున్న నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 82 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తులతో నిర్మిస్తున్న ఈ భవనంలో పూర్తిగా రెవెన్యూ విభాగం, జిల్లా కలెక్టర్ ,అదనపు కలెక్టర్ల ఛాంబర్లు, మంత్రి ఛాంబర్, ఉండేలా ఏర్పాటు చేయాలని, పాత కలెక్టర్ కార్యాలయంలో పూర్తిగా జిల్లాలోని అన్ని శాఖల అధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, ఇందుకుగాను పాత కలెక్టర్ కార్యాలయాన్ని పూర్తిగా ఆధునీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
కొత్త కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ హాల్ ను ఫాల్ సీలింగ్,ఎల్ ఈ డి స్క్రీన్లు, అన్ని సౌకర్యాలతో తో నిర్మించాలని చెప్పారు. కొత్త కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ అంచనాలను ఎట్టి పరిస్థితులలో మార్చకూడదని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. గ్రౌండ్ ఫ్లోర్ ను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ఇవ్వాలని, కార్యాలయ భవనం మొత్తాన్ని జూన్ 2 నాటికి పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
భవన నిర్మాణ పనులు, నాణ్యత పై ప్రత్యేక దృష్టి నిలపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కోరారు. నల్గొండ కొత్త కలెక్టర్ కార్యాలయ నిర్మాణం ఆయా జిల్లాలలో ఉన్న సమీకృత జిల్లా అధికారుల కార్యాలభవనాల కన్నా బాగుండాలని అన్నారు. ఈ కార్యాలయం మొత్తం పూర్తి అయితే బయట ఉన్న డిఈఓ ,డిఎంహెచ్ఓ కార్యాలయాలను ఇక్కడికి తీసుకురావడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాబ్ దర్గా గుట్టలపై నిర్మిస్తున్న ఘాట్ రోడ్ల నిర్మాణ పనులపై ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షించారు. రెండు గుట్టలపై నిర్మిస్తున్న ఘాట్ రోడ్లకు సంబంధించి ఇప్పటివరకు 5 కిలోమీటర్ల రోడ్డు పూర్తయిందని ఆర్ అండ్ బి అధికారులు మంత్రికి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఘాట్ రోడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్ అండ్ బి సూపరింటిండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి , నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, కాంట్రాక్టర్ రామ్ ప్రసాద్, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.