– కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి సుడిగాలి పర్యటన
– ఉదయం నుంచి సాయంత్రం వరకు విస్తృత పర్యటన
– పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు
కొల్లాపూర్: నియోజకవర్గంలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన చేశారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రైతులు విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే ఇవ్వాలి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదని, డీడీలు కడితే సరిపోతుందని, విద్యుత్ స్తంభాలు, వైర్లు మోయాల్సిన అవసరం లేదని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
డీ.డీ. కట్టిన 60 రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందని చెప్పారు. శుక్రవారం వనపర్తి జిల్లా కొల్లాపూన్ నియోజకవర్గంలోని పానగల్, చిన్నంబావి మండలాల్లో మంత్రి జూపల్లి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పానగల్ మండలం దావాజిపల్లి గ్రామంలో రూ. 1.96 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. అదేవిధంగా చిన్నంబావి మండలం అయ్యవారి పల్లి గ్రామ పరిధిలో ఒక 33/11 కెవి సబ్ స్టేషన్ ను శంఖుస్థాపన చేశారు.
ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ సైతం చేశారు. అయ్యవారి పల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రానికి భూమి పూజ చేశారు. అనంతరం చిన్నంబావి మండల కేంద్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 23 మంది మహిళా లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లను మంత్రి పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు సి.యం. రిలీఫ్ ఫండ్ చెక్కులను సైతం అందజేసారు. అర్హులైనప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాకపోతే వారికి ప్రత్యేకంగా ఇండ్లు కేటాయిస్తామని భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వ్యవసాయ బోరు బావికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి విద్యుత్ శాఖ ద్వారా ట్రాన్స్ఫార్మర్, సరిపడ విద్యుత్ స్తంభాలు, కాసారాలు, ఇతర సామాగ్రిని కాంట్రాక్టర్లకు ఇచ్చి పని చేసినందుకు డబ్బులు కూడా మంజూరు చేయడం జరుగుతుందని కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే రైతు స్తంభాలు, వైర్లు, ఇతర పనిముట్లు కొని స్తంబాలు సైతం మోస్తున్నారని అన్నారు. ఇక నుండి ఇలా జరగడానికి వీల్లేదని రైతు డి.డి కట్టి దరఖాస్తు చేసుకుంటే నిర్ణిత గడువు 60 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ బిగించి కనెక్షన్ ఇచ్చే బాధ్యత విద్యుత్ శాఖదే అని కరాఖండిగా తేల్చిచెప్పారు.
దావాజిపల్లి నుండి పుల్గర్ చర్ల వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 37 కోట్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాల వల్ల చెరువులు, కుంటలు, కాల్వలు తెగిపోవడం కానీ, పంటనష్టం జరిగినట్లైతే.. అధికారులతో సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో నివేదిక తెప్పించుకుని, సమగ్ర నివేదికను సమర్పించాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.
గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ. 8 లక్షల కోట్లు అప్పులు చేశారని, వాటికి నెలకు రూ. 6500 వడ్డీలు కడుతున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత అప్పులు ఎన్నడూ చేయలేదని అన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,
రూ. 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, పేదలకు సన్న బియ్యం పంపిణీ ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు రూ. 500 బోనస్, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ… పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం ఏర్పడక ముందు 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలించి 65 వేల కోట్లు అప్పులు చేశారని, బి.ఆర్.ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో 8 లక్షల కోట్లు అప్పులు చేసిపోయారని తెలిపారు. వారు చేసిన అప్పులకు నెలకు వడ్డీ 6500 కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇంత అప్పుల భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుతుందన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండరు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.