– స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో ముందస్తు సమావేశం శుక్రవారం జరిగింది.
సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు.
గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలి. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలి.
వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భారీ వర్షాలు కురిసి కొన్ని రూట్లలో రోడ్లు దెబ్బతిన్నాయి. ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుని గౌరవ సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకునే విదంగా సహకరించాలి. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలి, తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయి.
కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలి. అవసరమైన నోడల్ అధికారులను , లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలి. పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలి. తెలంగాణ పోలీసు దేశంలోనే సమర్ధవంతమైనది, మంచి పేరు ఉన్నది. మీ ఆధ్వర్యంలో శాసన మండలి సమావేశాలు సజావుగా జరిగే విధంగా సహకరించాలి.
చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మాట్లాడుతూ… సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన అధికారులను అందుబాటులో ఉంచుతాం. సభా నిర్వాహణకు ఇబ్బందులు లేకుండా, సజావుగా జరిగే విదంగా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తాం.
డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి.నరసింహా చార్యులు, తదితరులు హాజరయ్యారు.