– జీఓలో కృష్ణానది డిసిల్టేషన్లో శాండ్ అని ఉండటంతో సమస్య
– ఎన్జీటీ నుండి అభ్యంతరం వ్యక్తమయ్యే అవకాశం
– దానితో ఇసుక తవ్వే అవకాశం ఉండదు
– ‘సూర్య’ ప్రత్యేక కథనంతో అధికారుల దిద్దుబాటు
– శాండ్ పేరు తొలగిస్తూ మున్సిపల్ శాఖ తాజా జీఓ
– ‘సూర్య’ఎఫెక్ట్
( మార్తి సుబ్రహ్మణ్యం)
అమరావతి: రాజధాని నిర్మాణంపై రాజకీయ ప్రత్యర్ధులు కల్పిస్తున్న అవాంతరాలు.. ప్రస్తుతం అమరావతిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను, నిర్మొహమాటంగా, నిష్పక్షపాతంగా కళ్లకుకట్టినట్లు వివరిస్తూ.. వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తున్న ‘సూర్య’ కథనాలను, అధికారపార్టీకి చెందిన కొందరు భూతద్దంలో చూస్తూ.. అవి తమకు వ్యతిరేకంగా ఉన్నాయని భ్రమిస్తున్న నేపథ్యంలో, రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుక తరలింపు అంశంపై.. మున్సిపల్ శాఖ గతంలో ఇచ్చిన జీఓను ‘సూర్య’ కథనం నేపథ్యంలో సరిదిద్దుకుని, అందులో దొర్లిన కొన్ని సాంకేతిక పదాలను తొలగించి మళ్లీ మరో జీఓ ఇవ్వడం విశేషం.
కృష్ణానది నుంచి ఇసుక తీసి దానిని రాజధాని నిర్మాణానికి తరలించే అంశానికి సంబంధించి మున్సిపల్ శాఖ ఇచ్చిన ఒక జీఓ ఇసుక తరలింపునకు అవరోధంగా మారింది. దానికి కారణం ‘శాండ్ డీసిల్టేషన్’ అని ఆ జీవోలో పేర్కొనడమే. దానివల్ల రాజధాని నిర్మాణాలకు ఇసుక దొరికే మార్గాలు మూసుకుపోయేందుకు కారణమయింది.
ప్రస్తుతం కృష్ణా నదిలో కోటీ 40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉందని లెక్క కట్టారు. ఆ ఇసుకను తీసి నిర్మాణానికి వాడే బాధ్యతను, సిఆర్ డిఏ అధికారులకు అప్పగించారు. దీనికోసం 14.7.2025న పట్టణాభివృద్ధి శాఖ జిఓ 678 ఇచ్చింది. ఇందులో శాండ్ డీ సిల్టేషన్ అనే పదాన్ని చేర్చారు.
సిడబ్ల్యుసి నిబంధనల ప్రకారం.. రిజర్వాయర్లు, బ్యారేజీల్లో ఎగువన కనీసం ఐదు కిలోమీటర్ల వరకూ ఇసుకను తీయాలంటే, మాతృ సంస్థలే ఆ పని చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ జలవనరులశాఖ ఆ పని చేయాలి. కానీ పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించారు.
శాండ్ పూడిక తీత మీద క్యాబినెట్ సమావేశం అనంతరం, సీఆర్డీఏ అధికారులు ఇసుక తీత మీద సాధ్యాసాధ్యాలు వివరించాలని కోరారు. దీనిపై జలవనరులశాఖ అధికారులు సలహాదారు నేతృత్వంలో నివేదికను తయారు చేసి పంపించారు.
దీంతో ఇసుక తవ్వకానికి సంబంధించి 286 కోట్లు కేటాయిస్తూ జిఓ కూడా ఇచ్చారు. టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ అధికారులూ సిద్ధమయ్యారు.
అయితే.. నదుల్లో డీ సిల్టింగ్‌కు సంబంధించి 2022 అక్టోబరులో కేంద్రం విడుదల చేసిన నేషనల్ ఫ్రేం వర్కు ఫర్ సెడిమెంట్ మేనేజ్ మెంట్ ముసాయిదా నిబంధనల ప్రకారం..
1.సిఎల్ 2.2(5) ప్రకారం అన్ని సాంకేతిక అంశాల అధ్యయనాల తర్వాత డీ సిల్టేషన్, డ్రెడ్జింగ్ కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
2. అలాగే సిఎల్ 7.4 ప్రకారం సాంకేతిక ఆర్థిక అంశాలపై డిపిఆర్ తయారు చేసి ఆమోదం కోసం సాంకేతిక సలహా కమిటీ ఏర్పాటు చేయవచ్చు.
3.సిఎల్ 7.1, 7.2 ప్రకారం అవసరమైన పర్యావరణ అనుమతి (ఎన్విరాన్మెంట్ క్లియరెన్సు) కావాల్సి ఉంటుంది.
ఎన్జీటీ సెంట్రల్ జోన్ బెంచ్ రాజస్థాన్ కు చెందిన దినేష్ బోత్రా కేసులో ఈ విధంగా వ్యాఖ్యానించింది. ‘‘డీ సిల్టింగ్ చేయాల్సిందే. దాన్ని వల్ల నీటి వనరులు పెరుగుతాయి అని చెబుతూనే ఆ పేరుతో అక్రమ మైనింగ్‌ను అంగీకరించకూడదు ’’ అని స్పష్టంగా వ్యాఖ్యానించింది. అయితే ఇటీవల క్యాబినెట్ తీర్మానంలో ఇసుకను తీయాలని నిర్ణయం చేయడం సాంకేతిక ఇబ్బందిని సృష్టించే అవకాశం లేకపోలేదు.
జిఓలో శాండ్ అని పెట్టడం వల్ల భవిష్యత్ లో ఎన్జీటీ నుండి అభ్యంతరం వ్యక్తమయ్యే అవకాశం వుంది. మాజీ మంత్రి దివంగత దేవినేని నెహ్రూ 2016లో ఎన్జీటీలో దాఖలు చేసిన కేసు తీర్పును కూడా ఇందులో ఉటంకించారు. శాండ్ మైనింగ్‌ను నేరుగా అంగీకరించే అవకాశం లేదు. దీంతో దీన్ని డీ సిల్టింగ్గా మార్చాల్సి ఉంటుంది. శాండ్ డీ సిల్టింగ్ అనే పదం ఇబ్బందిని కలిగించవచ్చు.
కమిటీలో వీళ్ళు ఉండాలి
నేషనల్ ఫ్రేం వర్కు ఫర్ సెడిమెంట్ మేనేజ్ మెంట్ అనెగ్జర్ 6లో రాష్ట్రస్థాయి టెక్నికల్ అడ్వయిజరీ కమిటీలో జలవనరులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థికశాఖ, సిడబ్ల్యుసి చీఫ్ ఇంజనీరు, ఈ అండ్ ఎఫ్ ప్రతినిధి, వాటర్‌వేస్ ప్రతినిధి, మైనింగ్, కలెక్టర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ వీరితోపాటు మరికొంత మంది సభ్యులు గా కమిటీ ఏర్పాటు చేయాలి.
అయితే ప్రభుత్వం కమిటీ వేయకుండానే.. సాంకేతిక అధ్యయనం చేయకుండానే జలవనరులశాఖకు ఎటువంటి సంబంధమూ లేని, సిఆర్డిఏ ద్వారా టెండర్లు పిలిచేందుకు సిద్దమయినట్లు తెలిసింది. అదే జరిగితే ఇసుక తీత ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పని జలవనరుల శాఖ ద్వారా చేయించి సిఆర్డిఏ వినియోగించుకుంటే, ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. సాంకేతిక నిపుణులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీలోనూ అసహనం పెరుగుతోందా?
ఇదీ వాస్తవం కాగా.. అమరావతికి సంబంధించి ప్రభుత్వానికి సరైన సూచనలిస్తూ, నిర్మాణాత్మక విమర్శలు చేస్తున్న మీడియాపై.. టీడీపీలోనూ, గత జగన్ సర్కారు మాదిరిగానే అసహనం కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి ఇలాంటి కథనాలు ప్రభుత్వ ప్రకటనలు, ఇతర ప్రయోజనాలు ఆశించే ప్రధాన మీడియా ప్రచురించవు. ప్రసారం చేయవు. కారణం అనేక రకాల మోహమాటాలు!
కానీ ప్రతిష్ఠాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణం కోసం.. అహరహం కష్టపడుతున్న సీఎం చంద్రబాబునాయుడు కల సాకారంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలతోపాటు, భారీ వర్షాలు వచ్చిన సందర్భంలో రాజధాని గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు-వాటికి పరిష్కార మార్గాలు సూచించి, వాటిని పాటించకపోతే రాజధాని ప్రమాదంలో పడటం ద్వారా, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినక తప్పదని అధికార యంత్రాంగాన్ని మేల్కొలుపుతూ రాస్తున్న కథనాలను.. టీడీపీలోని సోషల్‌మీడియా యువతరం, ‘భాషా సమస్య’తో వాటిని వ్యతిరేక కోణంలో చూడటమే విస్మయం కలిగిస్తోంది.
ఆ మేరకు పార్టీలో పనిచేస్తున్న ఈ కొత్త తరం యువకులు వాటిని వ్యతిరేక కోణంలో చూడటంతోపాటు, ‘ముద్రలు’ వేస్తున్న పరిస్థితి టీడీపీలో తొలిసారి కనిపిస్తోంది. ప్రధానంగా సోషల్‌మీడియాలో పనిచేసే వారికి తెలుగుభాషపై సరైన పట్టు- పరిజ్ఞానం లేకపోవడం, పత్రికాభాషపై అవగాహన లేకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మూడు నిమిషాల వీడియో తయారుచేసేందుకు అలవాటుపడ్డ ఈ విభాగాలకు పత్రికల్లో వచ్చే వార్తలను పూర్తిగా చదివి, వాటిని అర్ధం చేసుకోకపోవడమే ఈ సమస్యకు అసలు కారణంగా కనిపిస్తోంది.
సహజంగా ప్రభుత్వాలు ఏదైనా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపడుతున్న సందర్భంలో.. వాటికి సంబంధించి అనుకూల-వ్యతిరేక వార్తలు రావడం సహజం. అంటే ప్రత్యర్ధి పార్టీలకు చెందిన మీడియాలో వాటికి వ్యతిరేక కథనాలు వస్తుంటాయి. అధికార పార్టీలకు అనుకూలంగా ఉండే మీడియా మాత్రం.. వాస్తవాలు తెలిసినా వాటిని రాసేందుకు ఇష్టపడవు. కారణం ప్రభుత్వ ప్రకటనలు, ఇతరతా వ్యవహారాలన్నది బహిరంగ రహస్యమే.
అయితే తటస్థంగా ఉండే కొన్ని మీడియా సంస్థలు మాత్రం.. ఆ ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే-ఎదురవుతున్న అవాంతరాలు-వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తూ కథనాలు రాస్తుంటాయి. వాటిని సద్విమర్శ-నిర్మాణాత్మక సూచనగా భావించి, అందులో పేర్కొన్న అంశాలపై దృష్టి పెట్టి వాటిలో లోపాలుంటే సవరించుకోవడం ప్రభుత్వాల ధర్మం. అప్పుడే ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుంది. గతంలో ఇలాంటి వాతావరణమే ఉండేది.
ఇప్పుడు అందుకు భిన్నంగా.. అలాంటి నిర్మాణాత్మక సూచనలు, సద్విమర్శలు చేసే మీడియాను కూడా.. అధికారంలో ఉన్న పార్టీలకు అనుబంధంగా ఉండే సోషల్‌మీడియా ఉద్యోగులు, అవగాహనా రాహిత్యంతో వ్యతిరేక కోణంలో చూడటంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.
వైసీపీ అధినేత జగన్ పార్టీ స్థాపించిన తర్వాత మొదలైన ఈ జాఢ్యం, అన్ని ప్రధాన పార్టీలకూ అంటుకుంది. ప్రభుత్వ నిర్ణయాలపై నిర్మాణాత్మక విమర్శలు చేసేవారిని.. వ్యతిరేక కోణంలో చూసే సంప్రదాయం వైసీపీతో మొదలయి, అది విజయవంతంగా కొనసాగడమే విచారకరం. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలు చేసే మీడియా కూడా, ఇలాంటి చర్యలతో వ్యతిరేకమయ్యే ప్రమాదం లేకపోలేదు.
రాజుల కాలంలో.. తమ పాలనపై సద్విమర్శలు చేసేవారిని జీతాలిచ్చి నియమించుకునే సంప్రదాయం ఉండేది. సదరు విమర్శకుడు పాలనలో తీసుకున్న నిర్ణయం ఎందుకు తప్పు? ఏరకంగా తప్పన్నది వివరించాల్సి ఉంటుంది. ఆ విమర్శలో వాస్తవ కోణం ఉంటే, పాలకులు వాటిని సరిదిద్దుకునేవారు. ఇప్పుడు సద్విమర్శలు చేసినా భరించలేని అసహనకాలం దర్శనమిస్తోంది.