– హెచ్ ఎన్ ఎస్ ఎస్ ద్వారా రాయలసీమ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న సీఎం
– నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆరాటం
– రాష్ట్ర జలనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
కుప్పం: ఆసియాలోని అతిపెద్ద కెనాల్ ను పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కుప్పం మండలం పరమ సముద్రం చెరువు సమీపంలో శనివారం ఏర్పాటు చేసిన జల హారతి బహిరంగ సభలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి మాట్లాడారు. ఆసియాలోని అతిపెద్ద కెనాల్ ను పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. హెచ్ ఎన్ ఎస్ ఎస్ ద్వారా కరువు ప్రాంతమైన రాయలసీమ జిల్లాను ముఖ్యమంత్రి సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కై ముఖ్యమంత్రి ఆరాట పడుతున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కరువు ప్రాంతమైన రాయలసీమ ను రతనాలసీమగా మార్చాలని నాటి దివంగత నందమూరి తారకరామ రావు నుండి, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వరకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, కేసి కెనాల్, హెచ్ ఎల్ సి, ఎల్ ఎల్ సి, మైలవరం, జీడిపల్లి, గొల్లపల్లి, చిత్రావతి, తదితర జలాశయాలకు అత్యంత నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వం తమదేనన్నారు. 1999 జూలై 9న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా హంద్రీ నీవా కాలువ పనులు భూమి పూజ జరిపారని, తిరిగి ఆయన చేతుల మీదుగా పూర్తి చేసి కుప్పం నీరందించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నారన్నారు.
738 కి.మీ ల పొడవున హంద్రీ నీవా కాలువకు 732 మీ ల ఎత్తుకు 27 లిఫ్ట్ ల ద్వారా ఆసియాలోనే అతిపెద్ద కెనాల్ ను పూర్తి చేసి అభినవ శ్రీకృష్ణదేవరాయులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిలిచారని అభివర్ణించారు. ఓటు వేసేవారు అభివృద్ధికే పట్టం కట్టాలన్నారు. గత పాలకులు తమ 5 సం.ల పాలనలో ఏనాడో ఒక తట్ట మట్టిని కూడా వేయలేదని, వారి విధ్వంసకర పాలనలో పోలవరంతో పాటు డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అయ్యిందని, అన్నమయ్య, పులిచింతల గేట్లు కొట్టుకుపోయింది, హెచ్ ఎన్ ఎస్ ఎస్ మోటారు బిల్లు లను కూడా గత ప్రభుత్వం చెల్లించలేదన్నారు. తద్వారా రాయలసీమకు తీరని ద్రోహం చేసిన ముఖ్యమంత్రి గా వై ఎస్ జగన్ నిలిచారన్నారు.
సినిమా సెట్టింగ్ లతో హంద్రీ నీవా కాలువ ప్రారంభించి హెలికాప్టర్ వరకు వెళ్ళే లోపే కాలువలో నీరు ఇంకిపోయిందని దుయ్యబట్టారు. అలాగే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్ట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టిన రోజున శ్రీకారం చుడితే ఎన్నికలకు ముందు పనులు పూర్తి చేయకనే జాతికి గత ముఖ్యమంత్రి అంకితం చేశారన్నారు. వారిదంతా అబద్ధపు సంక్షేమన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత ను తీసుకున్న ముఖ్యమంత్రి కి రాయలసీమ ప్రాంత ప్రజలు అండదండలందించాలన్నారు. 19 నియోజకవర్గాల్లోని ప్రతి చెరువుకు నీరందించాలన్నారు. ఆయన మంత్రివర్గంలో తాను పని చేయడం తన భాగ్యమన్నారు.
కోట్లమంది జీవితాలను మారుస్తున్న సీఎం: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కోట్లమంది జీవితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మార్చుతున్నారన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కృష్ణా జలాలను హంద్రీ నీవా ద్వారా కుప్పం కు తీసుకువచ్చినట్టు తెలిపారు. నాడు దివంగత ఎన్టీఆర్ సంకల్పం చేస్తే హంద్రీ నీవా ద్వారా జలాలను తెచ్చేందుకు సంకల్పం చేస్తే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సాకారం చేశారన్నారు. 2014-19 లో 87 శాతం పనులు పూర్తికాగా తరువాత వచ్చిన వై సి పి ప్రభుత్వం కోర్టు లో కేసులు వేసి పనులు ఆపారన్నారు.
ప్రజా సంక్షేమం కోరని వారు పనులను ఆపితే భగీరథ ప్రయత్నానికి మించి శ్రీశైలం నుండి 1200 అడుగుల ఎత్తులో ఉన్న కృష్ణా జలాలను కుప్పానికి తెప్పించి కుప్పం దాహార్తిని సాగునీటిని అందించిన అభినవ భగీరథునిగా నిలిచారన్నారు. కృష్ణా జలాలు పారామసముద్రానికి తెచ్చిన రోజుని సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజుగా అభివర్ణించారు. ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళవలసిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి చెరువుకు నీరు అందించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించాలన్నారు. ప్రతి పొలానికి ఈ నీరు చేరుతుందని, కలిసికట్టుగా అందరం పని చేసి కుప్పం ప్రాంతాన్ని అగ్రగామిగా నిలపాలన్నారు.
అభివృద్ధిని భవిష్యత్ తరాలు గుర్తించుకుంటాయి : ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు మాట్లాడుతూ. . శ్రీశైలం నుండి 735 కి.మీ ల ప్రయాణం చేసి చివరి మైలు కుప్పం లోని పరమసముద్రం కు కృష్ణా జలాలు చేరిందన్నారు. తద్వారా వ్యవసాయం చాలా బాగా పెరగడమే కాకుండా భూగర్భ జలాలు కూడా పెరుగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గం లోని 530 చెరువులకు నీరు చేరాలన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లు గా రాష్ట్ర ముఖ్యమంత్రి పని చేస్తూ కేంద్రప్రభుత్వం నుండి ఎన్నో నిధులను రాష్ట్రానికి ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారన్నారు. భవిష్యత్ తరాల వారు సి ఎం లాంటి వ్యక్తి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటారన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి పి.ఎస్.ప్రద్యుమ్న, జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జే సి విద్యాధరి, కడా పిడి వికాస్ మర్మత్, పలమనేరు ఎం ఎల్ ఏ ఎన్. అమరనాథ్ రెడ్డి, ఏ పి ఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం నాయుడు, జిల్లా అధికారులు, కుప్పం ఆర్డీవో శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు