– రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
విజయవాడ: వైసీపీ నేతలు శాంతిభద్రతల గురించి మాట్లాడటం హాస్యాస్పదం… జగన్ హయాంలో సొంత తల్లి, చెల్లి, కుటుంబ సభ్యులకు రక్షణ లేక రాష్ట్రం వదిలిపోయారు. సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి 48 గంటలు దాచిన చరిత్ర వైసీపీది. ఇప్పుడు వైసీపీ నేతలు శాంతిభద్రతల గురించి మాట్లాడం విడ్డూరంగా ఉంది. వైసీపీ నేతల డీఎన్ఏలోనే హత్య రాజకీయాలు ఉన్నాయి. బాబాయ్ ని హత్య చేసి అధికారంలోకి వచ్చిన మీరు హత్య రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. సత్య హరిచంద్రుడి కన్నా వైసీపీ నేతలే నిజాయితీపరులు అన్న విధంగా ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పేర్ని నాని వంటి కొందరు వైసీపీ నాయకుల రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిపోయి, షెడ్లో పనికిరాని వాహనాల్లా మారారు. అందుకే, టీవీలు, పత్రికల్లో కనిపించేందుకు అసత్యాల స్క్రిప్ట్‌లతో నీచమైన రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేని కోడిగుడ్డు వైసీపీ నేత కూడా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. వీరి రోజువారీ కార్యక్రమం ఒకటే—తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను అనుసరించి అసత్య ప్రచారాలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం, మేము బతికే ఉన్నామని చెప్పుకోవటం. నీచ రాజకీయాలు వైసీపీ డీఎన్ఏలోనే ఉన్నాయన్నారు. ఇంకా, మంత్రి ఏమన్నారంటే…
బాబాయ్‌ను గొడ్డలితో నరికిన ఘటన నుంచి గులక రాయి డ్రామాల వరకు, వైసీపీ రాజకీయ నాటకాలు చూసి రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. టిడిపి ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించి పేదల కళ్ళలో ఆనందం చూస్తే, వైసీపీ నేతలు మాత్రం రుషికొండ ప్యాలస్ కట్టి జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూశారు. ఇది పెత్తందారి పోకడ్లకు నిదర్శనం కాదా? రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం, ప్రజలకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యం. వైసీపీ మార్క్ అరాచకాలు, అక్రమాలు, హత్య రాజకీయాలకు చరమగీతం పాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.