* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* అనంతపురం జిల్లాకు రవి చేసిన సేవలు శ్లాఘనీయం
* బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే రవన్న లక్ష్యం
* పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు
* పెనుకొండలో పరిటాల రవి కాంస్య విగ్రహం ఆవిస్కరణ
* సొంత నిధులతో పరిటాల విగ్రహం ఏర్పాటు చేసిన మంత్రి సవిత
* భారీగా తరలొచ్చిన పరిటాల రవి కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ శ్రేణులు
పెనుకొండ/శ్రీసత్యసాయి : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిటాల రవీంద్ర(పరిటాల రవి) తన జీవితాన్ని త్యాగం చేశారని, పేదల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. పేదల కోసం, వెనుకబడిన అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం పరిటాల రవి అహర్నిశలు కృషి చేశారన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకు తెలియజేయాలన్న సంకల్పంతో పరిటాల రవి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పరిటాల రవి జయంతి సందర్భంగా శనివారం పెనుకొండ పట్టణంలోని దర్గా సర్కిల్ లో ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి సవిత ఏర్పాటు చేసి, ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిటాల రవి సతీమణి, ఎమ్మెల్యే పరిటాల సునీత, తనయుడు శ్రీరామ్, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు సురేంద్ర బాబు, ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సవిత మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అన్న ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన బాటలో నడిచిన పరిటాల రవి పేదల బాగు కోసం తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. వెనుకబడిన అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం రవన్న చేసిన సేవలు మరువలేనివన్నారు.
పరిటాల రవి బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. పేదల గుండెల్లో రవన్న చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. సమ సమాజ నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలు భావి తరాలకు తెలియజేయాలన్న సంకల్పంతో పెనుకొండలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ మహనీయుడి కాంస్య విగ్రహం ఏర్పాటుతో తన జీవితం ధన్యమైందన్నారు.
తన కుటుంబానికి, పరిటాల రవి కుటుంబానికి సత్సంబంధాలున్నాయన్నారు. తన రాజకీయ అరంగేట్రం రవన్న సూచన, స్ఫూర్తితోనే జరిగిందన్నారు. పరిటాల రవి చూపిన దారిలోనే ఆయన సతీమణి, ఎమ్మెల్యే సునీత, తనయుడు శ్రీరామ్ పనిచేస్తూ, పేదల అభ్యున్నతి కోసం రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు.
మంత్రి సవిత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
అంతకుముందు పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ నుంచి మంత్రి సవిత ఆధ్వర్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ దర్గా సర్కిల్ వరకు సాగింది. ర్యాలీలో పరిటాల రవి సతీమణి, ఎమ్మెల్యే సునీత, ఎమ్మెల్యే సురేంద్ర బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలొచ్చారు. జోహర్ రవన్న అంటూ కార్యకర్తల చేసిన నినాదాలతో పెనుకొండ మార్మోగింది.
ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, పలువురు ప్రజాప్రతినిధులు, పరిటాల రవి అభిమానులు, కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.