రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం తో….ఒక చక్రవర్తిలా కంటి చూపుతో రాష్ట్రాన్ని శాసించిన వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని కేంద్ర దర్యాప్తు సంస్థలు గానీ, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు గానీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదా!?
ఉన్నదా… అంటే, ఉన్నది. లేదా… అంటే, లేదు.
అరెస్ట్ అయితే తనకు రాజకీయ ప్రయోజనం ఉంటుంది అని ఆయన అనుకుంటే…. అవుతారు. ఉండదు అని ఆయన అనుకుంటే…. అవ్వరు. ఏ నిర్ణయం అయినా ఆయన చేతిలోనే ఉంది గానీ; కేంద్రం చేతిలోనో…., రాష్ట్రం చేతిలోనో లేదని రాజకీయ జ్యోతిష్యులు అంటున్నారు.
నిజానికి, ‘జైలు’, ‘అరెస్టు’ అనేవి వైసీపీ నేతలకు పెద్ద విషయం ఏమీ కాదు.
‘ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే…. బయటకు వచ్చేస్తాం. జైలు అని భయ పడాల్సిన పని లేదు… ” అని తాడేపల్లి పార్టీ కార్యాలయం లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశం లో జగన్ చెప్పినట్టు మీడియా లో వార్తలు కూడా వచ్చాయి. అందువల్ల, వైసీపీ నాయకులు గానీ…; ఆ పార్టీ తో అంటకాగిన వారు గానీ ‘జైలు’కు వెళ్ళాల్సి రావడాన్ని పెద్ద నామోషీ గా తీసుకోవడం లేదు.
అందుకే, ఆ విషయానికి పెద్ద ప్రాముఖ్యం ఏమీ లేదన్నట్టుగా జగన్
తనకు అలవాటైన ” రాజకీయాన్ని” రొటీన్ గా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.
ఆయనపై సీబీఐ, ఈడీ పెట్టిన కేసులు ఓ పక్కన బూజు పట్టి పోతున్నప్పటికీ ; ఆ రెండు సంస్థలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఓ దశాబ్దానికి పైబడి, జగన్ బెయిల్ పై ఉన్నారు. బెయిల్ పై ఉండే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఉన్నారు.
మళ్ళీ, ఎన్నికలు వస్తే….”నేనే ముఖ్యమంత్రి ని ” అని ఢంకా బజాయించి చెబుతున్నారు. ఆ ప్రకటనను కూటమి వైపు నుంచి ఖండించిన ప్రాణి కనిపించలేదు. ఎవరి “ప్రజా సేవ ” లో వారు చాలా సీరియస్ గా మునిగిపోయి ఉన్నట్టు ఉంది.
కానీ, ప్రజలలో మాత్రం…. ” జగన్ అరెస్ట్ అవుతారా… అవ్వరా…. ” అనే చర్చ గట్టిగానే జరుగుతున్నట్టు కనపడుతున్నది. రాష్ట్రం లో ఎక్కడికి వెళ్లినా, ” జగన్ అరెస్ట్ అవుతారా అని అడిగేవాళ్ళు తారస పడుతున్నారు.
“జగన్ ఖచ్చితం గా అరెస్ట్ అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను.” అని జగ్గంపేట పేట ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రూ ఓ యూ ట్యూబ్ వీడియో ఇంటర్వ్యూ లో బల్ల గుద్ది మరీ చెప్పారు. లిక్కర్ ను అడ్డం పెట్టుకుని, 3500 కోట్లు తినేశాక కూడా జగన్ ను అరెస్ట్ చేయకపోతే…. కూటమి ప్రభుత్వం తీవ్రంగా నష్ట పోతుందని ఆయన అన్నారు.
అయితే ; ఢిల్లీ వారి కేసుల్లో గానీ, అమరావతి వారి కేసుల్లో గానీ జగన్ ను దర్యాప్తు సంస్థలు “టచ్ ” చేసే అవకాశాలు బహు తక్కువనేది పరిశీలకుల మాట గా ఉంది.
ఢిల్లీ బేస్డ్ దర్యాప్తు సంస్థలకు కేంద్రప్రభుత్వాన్ని నిర్హహిస్తున్న బీజేపీ పెద్దలే బాస్ లు.
దాదాపు పుష్కర కాలం గా జగన్ ‘అభిమానం ‘ ఏ రేంజ్ లో ఉంటుందో వారికి తెలియంది కాదని ఢిల్లీలో రాజకీయాలు పరిశీలిస్తున్నవారు అంటుంటారు. ఆ ‘అభిమానం’ కొనసాగినంత కాలం… సీబీఐ గానీ, ఈడీ గానీ జగన్ వైపు కన్నెత్తి చూసే ప్రశ్నే లేదనేది రాజకీయ వర్గాల మాట.
ఇక, రాష్ట్రం విషయానికి వస్తే ; “జగన్ నన్ను జైలు లో పెట్టించారు కనుక, నేను కూడా జగన్ ను జైలు లో పెట్టించాలి అనడం కరెక్ట్ కాదు ” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు.
వారి వారి జాతకాలలో గ్రహస్థితి అసలేమీ బాగుండక, జైలు దర్శనం రాసి ఉంటే తప్ప, తాను ప్రతీకార రాజకీయాలు చేయనని చంద్రబాబు నాయుడు ఘంటాపథం గా చెబుతున్నారు. తన మంచి పాలన, అభివృద్ధి పథకాలు చూసి ప్రజలే కూటమి ని గెలిపిస్తారనే గట్టి నమ్మకం తో చంద్రబాబు నాయుడు ఉన్నారు.
దీనికి తోడు, జగన్ కు అనుకూలంగా అత్యంత బలమైన శక్తులు కూడా తమవంతు కృషి చేస్తూనే ఉంటాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వమని ” కోరడానికి ” భారత రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ స్వయం గా ఫోన్ చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
దీని వల్ల, జగన్ కు బీజేపీ కేంద్ర పెద్దల “ఆశీస్సులు ” పుష్కలంగా ఉన్నాయనే సందేశం… చేరాల్సిన వారికి చేరింది. ఎన్డీఏ కూటమి లో జగన్ సభ్యుడు కాకపోయినప్పటికీ, బీజేపీ ఆశీస్సులకు కొరత ఏమీ లేదనే విషయాన్ని బీజేపీ పెద్దలు ఎప్పటికప్పుడు విశదీకరిస్తున్నారు.
దీనికి తోడు ; జగన్ కు – కూటమి కి మధ్య ” కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.
అదాని అటు జగన్ కు, ఇటు కూటమికి అభిమాన పాత్రుడు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ వారు అటు జగన్ కు, ఇటు కూటమి పెద్దలకు కావలసిన వారు. కడపలోని షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వారు అటు జగన్ కు, ఇటు కూటమి కి శ్రేయోభిలాషులు.
ఇలా, అనేక కారణాల నేపథ్యం లో…. జగన్ రాజకీయం నిరాఘాటంగా సాగిపోతుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అసత్యమేవ జయతేః
– భోగాది వేంకట రాయుడు