– కడప కడుపులో ఫార్మా బాంబు
– కడపను కలుషితం చేస్తారా?
– వ్యర్ధాలను ఎక్కడ విడిచిపెడుతున్నారు?
– కడపలో జీఎం ఎకో నిర్వాకం బట్టబయలు
– సమీక్షలో కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కన్నెర్ర
– చర్చకు వచ్చిన సిమెంట్ ఫ్యాక్టరీలు, జీఎం ఎకో కార్యకలాపాలు
– ఫ్యాక్టరీస్ అధికారి చెప్పేవరకూ పీసీబీ ఏం చేస్తోందని కలెక్టర్ ఆగ్రహం
– పైకి రాశామని నీళ్లు నమిలిన పీసీబీ అధికారి
– ప్రాసిక్యూషన్ కు నోటీసు ఇచ్చానన్న ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్
– సేఫ్టీ డాక్యుమెంటేషన్ లేకుండానే వ్యాపారం చేస్తున్నారని కలెక్టర్‌కు వివరణ
-రెండేళ్ల నుంచి ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ రెన్యువల్ లేకుండానే అనుమతులు లేకుండానే జీఎం ఎకో నిర్భయంగా వ్యాపారం
– ఫ్యాక్టరీస్ అనుమతి లేకుండానే ఆరు నెలల నుంచి కెమికల్ కంపెనీ నడుపుతున్న మారథాన్ కంపెనీ
– సరైన డాక్యుమెంట్లు లేకపోయినా దానికి అనుమతి ఇచ్చిన పీసీబీ అధికారి
– ఇప్పుడు పదోన్నతిపై విశాఖ బదిలీకి పైరవీలు?
– తొలుత సరైన డాక్యుమెంట్లు లేవంటూ అనుమతి తిరస్కరించిన పీసీబీ సైంటిస్టులు?
– అయినా అడ్డదారిలో అనుమతి తెచ్చుకున్న ధిక్కారం
– వేరే కంపెనీ సేఫ్టీ డాక్యుమెంటేషన్‌ను కాపీ చేసిన మారథాన్?
– మారథాన్‌కు తాము ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదన్న ఏజెన్సీ
– మారథాన్ కంపెనీపై ఫోర్టరీ కేసు పెడుతున్నట్లు వెల్లడి
– సాలీడ్ సరే.. లిక్విడ్ ఎక్కడకు తరలిస్తున్నారు?
– లిక్విడ్‌ను కొండలు, భూముల్లో వదిలేస్తున్నారన్న ఆరోపణలు
– ఫ్యాక్టరీస్ ఆమోదముద్ర లేకుండానే నేరుగా సిమెంట్ కంపెనీలకు తరలింపు
– సిమెంట్ కంపెనీల దగ్గర ఫార్మా ట్యాంకర్ల ‘జీపీఎస్ మాయ’?
– సీఎఫ్ఓ ఉంటే సరిపోతుందా?.. ఫ్యాక్టరీస్ అనుమతులు అవసరం లేదా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇప్పటికే కాలుష్యకాసారంగా మారిన విశాఖ విష వ్యర్థాలతో రోగానబారిన పడితే.. ఇప్పుడు ఆ జాబితాలో కొత్తగా కడప చేరింది. విశాఖకు చెందిన ఫార్మా కంపెనీల వ్యర్ధాలను కడపకు తరలించి, కడపలో కుమ్మరిస్తున్న వైనంపై కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉగ్రరూపం ప్రదర్శించారు.
‘‘కడపను ఏం చేద్దామనుకుంటున్నారు? ఫార్మా వ్యర్ధాలను తెచ్చి ఇక్కడ కుమ్మరిస్తే పర్యావరణం మాటేమిటి? అయినా.. ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటు అధికారి చెప్పేవరకూ చర్యలు తీసుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఇలాంటి అక్రమాలు, ఉల్లంఘనలను సహించేదాలేద’’ని కడప కలెక్టర్ తాజాగా ఆగ్రహం వ్యక్తం చే సిన వైనం వెలుగుచూసింది.
అంతేనా?.. అసలు రెండేళ్ల నుంచి ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటు నుంచి రన్నింగ్ లైసెన్స్, రెన్యువల్ లైసెన్సులు లేకుండానే.. జీఎం ఎకో కంపెనీ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసిన కలెక్టర్ విస్మయం వ్యక్తం చేశారు. అసలు ఆ కంపెనీకి అనుమతి ఇచ్చిన పీసీబీ అధికారి ఎవరని ఆరా తీశారు.
విశాఖలోని ఫార్మా కంపెనీలు తమ వ్యర్ధాలను కడపకు తరలించి, కడప ప్రజల గుండెలపై కుంపట్లు పెడుతున్నాయా? రెండేళ్ల నుంచి ప్యాక్టరీస్ డిపార్టుమెంట్ నుంచి రెన్యువల్ అనుమతులు లేకున్నా, నిర్భయంగా వ్యర్ధాలను ప్రీప్రాసెస్ చేస్తున్న కంపెనీకి అనుమతి ఇచ్చిన పీసీబీ అధికారి ఎవరు? ఈ రెండేళ్ల నుంచి పీసీబీ దానిని తనిఖీ చేయకుండా గుడ్డిగుర్రానికి పళ్లు తోముతోందా? సీఎఫ్ఓ ఉంటే సరిపోతుందా? ఫ్యాక్టరీస్ అనుమతి లేకుండానే వ్యాపారం చేస్తుందా? లేదా అన్న అంశాలను పీసీబీ తనిఖీ చేయదా?
అసలు ఎలాంటి అనుమతి లేకున్నా కంపెనీకి అనుమతి ఇచ్చిన పీసీబీ అధికారి ఎవరు? లిక్విడ్, సాలిడ్ ఫార్మా వ్యర్ధాలను ఆ కంపెనీ ఎక్కడకు తరలిస్తోంది? దానిని శాస్త్రీయ పద్ధతిలో ట్రీట్మెంట్ చేసి ఎక్కడ విసర్జిస్తోంది? ఆరు నెలల నుంచి ఫ్యాక్టరీస్ అధికారుల నుంచి అనుమతులు లేకుండా, ఫార్మా వ్యర్ధాలు తరలిస్తున్న మారథాన్ కంపెనీ వెనక ఉన్న పెద్ద తలలు ఎవరు? అసలు ఆ కంపెనీకి నిజంగా సేఫ్టీ డాక్యుమెంటేషన్ ఉందా? ఇదీ ఇప్పుడు కడప పారిశ్రామిక వాడలో హాట్‌టాపిక్.
విశాఖ ఫార్మా వ్యర్ధాలు కడపకు తరలిస్తున్నారన్న నిజం ఆలస్యంగా బయటపడింది. విశాఖలో రాంకీ ఫార్మా మాదిరిగానే.. జీఎం ఎకో అనే కెమికల్ కంపెనీకి విశాఖ ఫార్మా కంపెనీలు తమ వ్యర్ధాలను కడపకు తరలిస్తున్నాయని, వాటిని తీసుకుంటున్న ఆ కంపెనీకి అసలు ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటు నుంచి ఎలాంటి అనుమతులు, రెన్యువల్ లేకపోయినా, గత రెండేళ్ల నుంచి నిర్భయంగా వ్యాపారం చేస్తోందన్న విషయం కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తాజాగా నిర్వహించిన.. జిల్లా క్రైసస్ గ్రూపు కమిటీ సమీక్షా సమావేశంలో బయటపడటం, జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేసింది.
సమీక్షలో ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో, నిర్ఘాంతపోవడం ఆయన వంతయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దానితో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ‘‘ ఈ విషయం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చెప్పేవరకూ తెలుసుకోకుండా పీసీబీ అధికారులు నిద్రపోతున్నారా? మీకు బాధ్యత లేదా? కడపకు తరలిస్తున్న విశాఖ ఫార్మా లిక్విడ్-సాలిడ్ వ్యర్ధాలను ఎక్కడ పారబోస్తున్నారు? ఏం చేస్తున్నారు? దానిపై నివేదిక ఇవ్వండి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటా’మని హెచ్చరించారు.
అంతకుముందు విశాఖ ఫార్మా కంపెనీల వ్యర్ధాలను తరలిస్తున్న వైనంతోపాటు, వాటిని తీసుకుంటున్న జీఎం ఎకో అనే కంపెనీ తమకు ఇచ్చిన సేఫ్టీ డాక్యుమెంటేషన్ తప్పులతడకగా ఉన్నాయని, గత రెండేళ్ల నుంచి ఆ కంపెనీ రెన్యువల్ చేసుకోకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తోందని, కేవలం పీసీబీ ఇచ్చిన సిఎఫ్ఓ సర్టిఫిె ట్తోనే ఆ కంపెనీ వ్యాపారం చేస్తోందని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్.. సమీక్షలో పాల్గొన్న ఉన్నతాధికారులకు వెల్లడించారు.
కెమికల్ కంపెనీలకు పీసీబీ సిఎఫ్ఓ ఇచ్చినప్పటికీ, బయట నుంచి వచ్చే కెమికల్ లోపలికి వెళ్లేందుకు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ లేబిల్ కచ్చితంగా ఉండాలని ఆయన ఉన్నతాధికారులకు వివరించారు. కానీ ఈ కంపెనీ అవి లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. ఇప్పటివరకూ ఆ కంపెనీకి రెన్యువల్ ఇవ్వలేదు.
విశాఖ నుంచి వచ్చే ఫార్మా కెమికల్ వ్యర్ధాల డ్రమ్ములపై సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ లేబిల్పై దానిని సర ఫరా చేసిన వారిసంతకాలు, అవి ఉత్తమమైనవి అని స్టిక్కర్ ఉంటేనే కంపెనీలు ప్రొడఆ డ్రమ్ములోని మెటీరియల్‌ను వాడుకోవచ్చు. అయితే విశాఖ నుంచి వస్తున్న ఫార్మా వ్యర్ధాల డ్రమ్ములపై ఎలాంటి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ లేబిల్- వాటిపై సంతకాలు, అసలే లేవని తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు.
ఫార్మా లిక్విడ్ వేస్ట్‌ను సిమెంట్ పరిశ్రమలకు పంపించే ముందు చేసే ప్రక్రియకు.. ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటు అనుమతి ఇవ్వాలని, హజార్డ్ అవేర్బిలిటీ స్టడీ రిపోర్టును కూడా తమ శాఖ ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్‌కు వివరించారు. ఇవన్నీ మంజూరయిన తర్వాతనే కంపెనీలు ప్రొడక్షన్ ప్రారంభించాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ వివరించారు.
అయితే జీఎం ఎకో కంపెనీ ఇవేమీ లేకుండానే.. విశాఖ ఫార్మా కంపెనీల నుంచి వ్యర్ధాలు తీసుకుంటున్నట్లు, తమ పరిశీలనలో తేలిందని ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ కలెక్టర్‌కు వివరించారు. గతంలో ఈఈ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పీసీబీ అనుమతి ఇచ్చిందని చెప్పారు. ప్రధానంగా కంపెనీలో చాలా ఎత్తున సిలెండర్లు ఉన్నట్లు తమ తనిఖీలో గుర్తించామని చెప్పారు.
దీనిపై సీరియస్ అయిన కలెక్టర్.. ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసే వరకూ ఈ విషయం మీకు ఎందుకు తెలియదు? అని కలెక్టర్ పీసీబీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా, తాము పైకి సమాచారం పంపించామని నీళ్లు నమిలారు. దానికి స్పందించిన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్.. అనేక ఉల్లంఘనలపై తాము జీఎం ఎకో కంపెనీని ప్రాసిక్యూషన్ చేయాలని నోటీసులు పంపించామని, 15 రోజుల తర్వాత కంపెనీ నుంచి వచ్చే వివరణ బట్టి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌కు వివరించినట్లు తెలిసింది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలు దృష్టిలో ఉంచుకుని, నిబంధనలు పాటించని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
మారథాన్ కంపెనీ సేఫ్టీ డాక్యుమెంటేషన్ నిజమా? నకిలీనా?
కాగా మారథాన్ ఫైన్‌కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సేఫ్టీ డాక్యుమెంటేషన్ నిజమా? నకిలీనా? నిజంగా ఆ కంపెనీ ప్రభుతం ధృవీకరించిన సంస్ధ నుంచి సర్టిఫికెట్ తీసుకుందా? లేక ఇతర కంపెనీలకు ఇచ్చిన సేఫ్టీ డాక్యుమెంటేషన్‌ను కాపీ పేస్ట్ చేసి, దానిని మార్ఫింగ్ మాయతో ఫోర్జరీ చేసి ప్రభుత్వానికి కళ్లకు గంతలు కట్టిందా? ఎలాంటి అనుమతులు లేకుండా ఆరునెలల నుంచి మారథాన్ కంపెనీ కడపలో కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తుందన్నదే ప్రశ్న.
మారథాన్ ఫైన్‌కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి ఆరా తీసిన అధికారుల దృష్టికి.. ఒక థర్డ్‌పార్టీ సంస్థ, ఆ కంపెనీకి సేఫ్టీ డాక్యుమెంటేషన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు గ్రహించింది. అయితే ఆ సర్టిఫికెట్లో అనేక అనుమానాలు రావడంతో, అనుమానం వచ్చిన అధికారులు.. సదరు సంస్ధకు మెయిల్ పెట్టి..మారథాన్ ఫైన్‌కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మీరు సర్టిఫికెట్ ఇచ్చారా? ఇచ్చినట్లయితే, మీ తనిఖీలో గుర్తించిన అంశాలను మాకు పంపించండి అంటూ మెయిల్ ద్వారా వివరణ కోరారు. దానితో నిర్ఘాంతపోయిన సదరు సంస్థ.. అసలు తాము మారథాన్ ఫైన్‌కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదని, ఫోర్జరీ చేశారని ఆ మెయిల్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం.
దానితో రంగంలోకి దిగి ఏం జరిగిందో తెలుసుకున్న ఆ ధర్డ్ పార్టీ సంస్థ.. తమ కంపెనీ లెటర్‌హెడ్‌ను మార్ఫింగ్ చేసి, చీటింగ్ చేసిన మారథాన్ ఫైన్‌కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నిజానికి ఈ కంపెనీ ప్రారంభించే ముందు ఉత్పత్తికి సంబంధించి.. పీసీబీ సైంటిస్టులు అడిగిన ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వని నేపథ్యంలో, ఆ కంపెనీ ప్రొడక్టుకు సైంటిస్టులు అనుమతి నిరాకరించినట్లు పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. అయినా ఆ కంపెనీకి పీసీబీ అధికారి అనుమతి ఇవ్వడం విశేషం.
మారథాన్ కంపెనీ సేఫ్టీ డాక్యుమెంటేషన్ చేయలేదని, అసలు ఫ్యాక్టరీ లైసెన్సు లేకుండానే కంపెనీ నడిపిస్తున్నట్లు అధికారుల తనిఖీలో వె ల్లడయింది. ఇంకా విచిత్రం ఏమిటంటే.. మారథాన్ కంపెనీ అసలు ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటుకు అప్లికేషన్ కూడా పెట్టకపోవటం! ఇవన్నీ లేకుండా కంపెనీ నడిపిస్తున్నారంటే వారి వెనుక ఎన్ని పెద్దతలలున్నాయో సుస్పష్టం. అయితే విచిత్రంగా మారథాన్ కంపెనీ పదిరోజుల క్రితం అప్లికేషన్ పెట్టుకోగా, దానిని అధికారులు తిరస్కరించారు. నిజానికి ప్రొడక్షన్‌కు 15 రోజుల ముందు అప్లికేషన్ పెడితే, ఫ్యాక్టరీస్ అధికారులు దానిని పరిశీలించి అనమతులు జారీ చేయాలని యాక్ట్‌లో స్పష్టంగా ఉంది. మారథాన్ కంపెనీ ఈ నిబంధనలు కూడా పాటించలేదని దీనితో స్పష్టమవుతోంది.
అయితే పీసీబీ ఈఈ ఇచ్చిన అనుమతి మేరకు కంపెనీ ప్రొడక్షన్ ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు అదే అధికారి పదోన్నతి పొంది, పర్యావరణ శాఖ ఉన్నతాధికారి అయిన ఒక ఐఏఎస్ అండ.. ఆయన ‘కృప’తో, బాగా ఆదాయం వచ్చే విశాఖకు బదిలీ అయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా సదరు పీసీబీ అధికారి.. మారథాన్ ఫైన్‌కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏ ప్రాతిపదికన సీఎఫ్ఓ మంజూరు చేశారు? దానిని మంజూరు చేసేముందు స్వయంగా కంపెనీని తనిఖీ చేశారా? ముఖ్యంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ నుంచి అన్ని అనుమతులున్నాయా? లేవా? అని రికార్డులు పరిశీలించారా? సంస్థ ఇచ్చిన సేఫ్టీ డాక్యుమెంటేషన్ సర్టిఫికెట్ నిజమైనదా? కాదా? అన్నది ఆ సంస్ధతో మాట్లాడి నిర్ధారించుకున్నారా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఒకవేళ.. సదరు సంస్థ, మారథాన్ ఫైన్‌కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ లెటర్‌హెడ్‌ను ఫోర్జరీ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆ కంపెనీపై క్రిమినల్ చర్యలతోపాటు, అనుమతించిన పీసీబీ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకతప్పదు.
ఆ అధికారి ‘కృప’తో విశాఖకు బదిలీ యత్నం?
ఇదిలాఉండగా.. నకిలీ సర్టిఫికెట్తో వ్యాపారం చేస్తున్న కంపెనీకి సర్టిఫికెట్ ఇచ్చిన ఆ పీసీబీ అధికారి.. తాజాగా పదోన్నతి వచ్చిన నేపథ్యంలో.. పర్యావరణ శాఖలోని ఓ ఐఏఎస్ అధికారి ‘కృప’తో, బాగా ఆదాయం వచ్చే విశాఖకు బదిలీ అయేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ మేరకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో మాట-ముచ్చట కూడా పూర్తి చేసుకున్నట్లు పీసీబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వ్యవహారాల్లో రాటు దేలిన ఆ అధికారి ‘కృప’తోనే, సదరు అధికారి ఆ పీసీబీ అధికారిని విశాఖకు బదిలీ చేయించే ఒప్పందం కుదుర్చుకున్నారని పీసీబీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి యవ్వారాలు ఆ శాఖలో ‘అనంత’ం అని బాహాటంగానే చెబుతున్నారు.
కొండలు, భూముల్లో సాలిడ్ లిక్విడ్ పోస్తున్నారా?
కాగా విశాఖ నుంచి కడపకు వచ్చే ఫార్మా వ్యర్థాలను ఏం చేస్తున్నారు? ఏవిధంగా ప్రాసెస్ చేస్తున్నారన్న చర్చకు తెరలేచింది. కాగా లిక్విడ్ వేస్ట్‌ను కడప, జమ్మలమడుగు, మైదుకూరు పరిసర ప్రాంతాల్లోని కొండలు, పొలాల్లో విడిచిపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలే కరువు ప్రాంతంతోపాటు, ప్యాక్టరీ పొగ, కాలుష్యంతో రోగాలబారిన పడుతున్న ఆ ప్రాంత ప్రజలకు.. ఈ ఫార్మా లిక్విడ్ వేస్ట్ పొలాల్లో పోయడంతో మరిన్ని రోగాలకు గురవుతున్నారన్న ఆందోళన స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది.
నిజానికి చాలా ఏళ్ల క్రితం సిమెంట్ కంపెనీల ఉత్పత్తికి డీజిల్, ఫర్నేస్ ఆయిల్ అవసమయ్యేవి. అవి ఖర్చు ఎక్కువ కావడంతో.. వాటికి బదులు ఫార్మా సాలిడ్, లిక్విడ్ వేస్ట్‌ను వాడటం ప్రారంభించాయి. పైగా వాటిని ఫార్మా కంపెనీలు తమకు ఎదురు డబ్బులివ్వడంతో సిమెంట్ కంపెనీలపై భారం తగ్గింది. అయితే సిమెంట్ కంపెనీలకు ఫార్మా వేస్ట్ పంపించేముందు వాటిని ప్రాసెసింగ్ చేయాలి. కానీ సిమెంట్ కంపెనీలకు ఫార్మా కంపెనీల ట్యాంకర్లు తీసుకువెళ్లే కంపెనీలు, దానికి భిన్నంగా నేరుగా సిమెంట్ కంపెనీలకు తీసుకువెళుతున్న పరిస్థితి.
అసలు లిక్విడ్‌ను సిమెంట్ కంపెనీలకు తీసుకువెళ్లేముందు పాటించాల్సిన పద్ధతులను కూడా ఫార్మా కంపెనీలు అటకెక్కిస్తున్నాయి. నిజానికి ఫార్మా లిక్విడ్‌ను సిమెంటు కంపెనీలకు తీసుకువెళ్లే ముందు వాటి పరీక్షకు ల్యాబ్‌కు పంపించాలి. ఆ నివేదికను ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ ఆమోదించిన తర్వాతనే సిమెంట్ పరిశ్రమకు తరలించాల్సి ఉంది. కానీ ఫార్మా లిక్విడ్‌ను తీసుకువెళుతున్న ట్యాంకర్లు అందుకు భిన్నంగా, నేరుగా సిమెంట్ కంపెనీలకు తరలిస్తున్నారని ప్యాక్టరీస్ అధికారులు చాలాకాలం నుంచి చెబుతున్నా దానిపై ఇప్పటిదాకా చర్యలు లేకపోవడమే వింత.
జీపీఎస్‌ను సైతం మేనేజ్ చేస్తున్న ఫార్మా మాయ
కాగా ఫార్మా వేస్ట్‌ను ప్రాసెస్ చేసి సిమెంట్ కంపెనీలకు తీసుకువెళ్లాల్సిన ఫార్మా కంపెనీ ట్యాంకర్లు.. అధికారుల కళ్లు కప్పేందుకు, జీపీఎస్‌ను కూడా మాయ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంటే సిమెంట్ కంపెనీలకు 500 మీటర్ల దూరంలో కొన్ని గంటలపాటు ట్యాంకర్లు నిలబెడతాయి. దానితో అక్కడ తమ విధి నిర్వహించినట్లు, జీపీఎస్ ద్వారా అధికారులకు సంకేతాలిస్తారన్నమాట. తర్వాత జీపీఎస్‌ను ఆఫ్ చేసి, ట్యాంకర్లను నేరుగా సిమెంట్ కంపెనీలోకి తీసుకువెళతాయన్న విషయం అందరికీ తెలుసని పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు.