* రైతుల కష్టాలను పట్టించుకోరా?
* కేంద్రం ఇచ్చిన పంపిణీలో లోపాలు
* ఎరువుల్లేక నాశనమవుతున్న పంటలు
* ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ పూర్ణచంద్రరావు మండిపాటు
అమరావతి: ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు ఎరువుల అవసరం ఎంతో ఉన్నా, కేంద్రం నుంచి వచ్చిన యూరియా రాష్ట్రప్రభుత్వ వైఫల్యంతో అవి రైతులకు అందడం లేదని.. దాంతో పొలాలు ఎండిపోతున్నాయని ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా 40%వరకు పంపిణీ లోపం కారణంగా పొలాల్లో ఎరువుల్లేక పంటలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు. ‘‘శ్రీకాకుళం జిల్లాలో 1.2 లక్షల ఎకరాలకు యూరియా కొరత ఉంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 80,000 ఎకరాల్లో పంటలు ఎరువుల్లేక వాడిపోతున్నాయి ఏలూరు, కర్నూలు జిల్లాల్లో రైతులు రాత్రంతా రైతుసేవా కేంద్రాల వద్ద క్యూలలో నిలబడుతున్నారు. నంద్యాల, నెల్లూరు జిల్లాల్లో యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతోంది. రైతు సమస్యలపై స్పందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవసాయ శాఖపై కనీస అవగాహన లేకుండా, రైతుల బాధలను తేలిగ్గా తీసుకున్నారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, మార్క్ ఫెడ్ ఎండీ, జాయింట్ డైరెక్టర్ లాంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతుసేవా కేంద్రాల్లో ఎరువుల కొరత తీవ్రంగా పెరిగిందని తెలిపారు.