– ప్రకటించిన బీఆర్ఎస్ క్రమిశిక్షణా కమిటీ
– స్వాగతించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు
– ముందే చెప్పిన ‘‘సూర్య’’
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీఆర్ఎస్తో కేసీఆర్ బిడ్డ కవిత బంధం తెగిపోయింది. తెలంగాణ జాగృతి పేరుతో బీఆర్ఎస్కు సమాంతర కార్యక్రమాలు నిర్వహించి, అన్న కేటీఆర్, బావ హరీష్‌కు పోటీగా నిలిచిన కవిత అంకం ఇక ఆ పార్టీలో ముగిసింది. ఇప్పటివరకూ ఆమె కార్యక్రమాలన్నీ ఇక తీపి-చేదు గుర్తులే.
క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నందుకు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, బీఆర్ఎస్ క్రమశిక్షణ కమిటీ పత్రికాప్రకటన విడుదల చేసింది. కాగా కవితపై ఒకటి రెండు రోజుల్లో వేటు వేయనున్నారంటూ ‘‘సూర్య’’లో ఒకరోజు ముందు వచ్చిన వార్తా కథనం ఆక్షరసత్యమయింది.
కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన హరీష్‌తోపాటు, మాజీ ఎంపి కేసీఆర్ షడ్డకుడి కుమారుడైన సంతోష్‌రావుపై అవినీతి ఆరోపణలు చేసినందుకు కవితపై పార్టీ వేటు వేసింది. కేసీఆర్‌కు అవినీతి మకిలి అంటించింది హరీష్, సంతోష్‌రావు, మెగా కృష్ణారెడ్డి అని, ఇకపై తాను స్వతంత్రంగా వ్యవహరిస్తానంటూ కవిత చేసిన ప్రకటన కారును కుదిపేసింది.
దానితో నష్టనివారణకు దిగిన కేసీఆర్.. తన కుమార్తెను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, పార్టీలో నెలకొన్న అనిశ్చిత వాతావరణానికి తెరదించాలని క్రమశిక్షణ మిటీని ఆదేశించారు.
కాగా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ప్రతిష్ఠ పెంచారని అభినందించారు. వ్యక్తుల కంటే పార్టీ గొప్పదని, పార్టీ కోసం నిరంతరం కష్టపడే హరీష్‌రావుపై ఆరోపణలు చేయడం ద్వారా కవిత క్రమశిక్షణ ఉల్లంఘించారని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం చేశారన్నారు.
కేటీఆర్ స్పందించరేం?
కాగా తన చెల్లి, ఎమ్మెల్సీ కవిత వ్యవహారశైలిపై ఇప్పటివర కూ పెదవి విప్పని అన్న, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ే సీఆర్.. ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా, మౌనంగా ఉండటమే ఆశ్చర్యం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి హరీష్‌రావే కారణమన్న కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్-బిజెపి ఆరోపణలను నిజం చేసినట్టయింది. కనీసం కేటీఆర్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్‌పై చెల్లి చేసిన ఆరోపణలను కూడా కేటీఆర్ ఖండించకపోవడమే ఆశ్చర్యం. అటు హరీష్, సంతోష్‌రావు సైతం తమపై కవిత చేసిన ఆరోపణలు ఖండించకపోవడమే ఆశ్చర్యం. దాన్ని బట్టి వారి మౌనం అంగీకారమేనని అర్ధమవుతోందంటున్నారు.
కవిత సొంత పార్టీ?
కాగా పార్టీ ద్వారా తనకు సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా తర్వాత.. సొంత పార్టీ పెట్టేందుకు కవిత సిద్ధమవుతోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ జాగృతి లేదా తెలంగాణ భారత రాష్ట్ర సమితిగా ఉండవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
