– ప్రభుత్వానికి మచ్చరాకుండా పనిచేయండి
– రాష్ట్ర ప్రజలకు విశేష సేవలందించండి
– జీపీవోల నియామక వేదికలో ప్రతిజ్ఞ చేయించిన పొంగులేటి
– హైటెక్స్ లో గ్రామ పాలనా అధికారులకు (జీపీవోలు) నియామక పత్రాలను అందజేసే కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన వెంటనే గ్రామ సుపరిపాలనపై దృష్టి సారించి గ్రామాధికారుల నియామకానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ హైటెక్స్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్న జీపీవోల నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. గత ప్రభుత్వం 2020 ఆర్వోఆర్ చట్టం, ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో కలిపేసి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, దీని రూపకల్పన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సుమారు 36-37 గంటలకు పైగా పలుమార్లు విసిగించి ఆయన సలహాలతో మరీ అద్బుతంగా తీసుకువచ్చామని వివరించారు.
భూభారతిని తొలుత 4 మండలాల్లోని 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకువచ్చామని తర్వాత 32 మండలాల్లోనూ, జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందించామని వివరించారు. ఎవరి నుంచి ఒక్క రూపాయికూడా తీసుకోకుండా 8.65 లక్షల దరఖాస్తులు తీసుకున్నామని తెలిపారు
గత ప్రభుత్వంలో సాదాబైనామాలపై సుమారు 9.26 లక్షల దరఖాస్తులకు మోక్షం కలగలేదని, పైగా కోర్టులలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. తాజా నిర్వహించిన సదస్సులలో సుమారు 8.65 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఈ నేపధ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వం తరపున మరింత గట్టిగా కృషి చేసి వారం రోజుల క్రితం కోర్టులో సాదాబైనామాలపై స్టేను తొలగించేలా ప్రయత్నించి సఫల మయ్యామని తెలిపారు. గతంలో వచ్చిన దరఖాస్తులు, ప్రస్తుత తాజా దరఖాస్తులన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో 6860 క్లస్టర్లను ఏర్పాటు చేసి 10,954 రెవెన్యూ గ్రామాలలో గ్రామపరిపాలనాధికారుల నియామకం చేపడుతున్నామని వివరించారు. సర్వేయర్ల నియామకం ద్వారా భూ సమస్యలకు చెక్ పెడతామన్నారు. 318 మంది సర్వేయర్లుకు అదనంగా 800 మందిని నియమించడమేగాక 7000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను వచ్చే ఉగాదిలోగా భర్తీ చేస్తామని ప్రకటించారు.
సుమారు 3 దశాబ్దాలుగా వివిధ ప్రాజెక్ట్ లకు జరిగిన భూ సేకరణలో ఇంకా రైతుల పేర్లు పానీలో ఉండిపోయాయని ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీనాటికి అన్ని గ్రామాల వారీగా జమాబందీ మేరకు అప్పటి వరకు జరిగిన క్రయవిక్రయాలను హక్కులను వివరించేలా ప్రకటన జారీ చేస్తామన్నారు. దీని హార్డ్‌కాపీలు ప్రతి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉంచుతామన్నారు.
ఇకపై ప్రభుత్వానికి మాట, మచ్చ రాకుండా పనిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ కుటుంబ సభ్యులదేనని చెబుతూ ఉన్నత సేవలు అందిస్తామంటూ మంత్రి ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. నాతోపాటు మీరు , మీతోపాటు నేను ప్రజలకు మరిన్ని మంచి సేవలు అందిద్దామన్నారు.