సామాన్యుడికి సత్వర న్యాయం! ఇది కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్న అందమైన అబద్ధం!! ఎందుకంటే ఆ సత్వర అదే పదానికి కొలమానం, నిర్దిష్ట కాలపరిమిత ఏమీ ఉండదు కాబట్టి!!!
అలాగని సామాన్యుడికి న్యాయం జరగడం లేదని కాదు. కానీ దానికి దశాబ్దాలు పడుతోంది. అంటే సత్వరం కాదు. అప్పటికి జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. దానికి కారణాలు కోర్టుల్లో కేసులకు సరిపడా న్యాయమూర్తులు, సిబ్బంది సంఖ్య లేకపోవడం.
అందుకే న్యాయమూర్తులపై కేసుల భారం, ఒత్తిళ్లు! కాదనం. కానీ దాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత పాలకులదే కదా? ఆ పని చే యకపోవడం వల్ల నష్టపోతున్నది కూడా సామాన్యుడే. అందుకే సామాన్యునికి సత్వర న్యాయం జరగాలని, కొన్ని లక్షల బాధిత గొంతులు నిరంతరం ఏదో ఒక రూపంలో.. ఏదో ఒక వేదికపై వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ దేశంలో ‘సామాన్యుడికి న్యాయం’ అంటూ చివరికి జరుగుతోందంటే.. ఒక్క న్యాయ వ్యవస్థ పైన ఉన్న, నమ్మకమే ఇన్ని దశాబ్దాలుగా సగటు కక్షి దారుడి కి ఎంతో కొంత ఊరట కలిగిస్తోంది. అంటే వారిలో వ్యవస్థపై పెట్టుకున్న ప్రబల నమ్మకమే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా న్యాయ వ్యవస్థ లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే , సమ న్యాయం అనేది ఒక అరుదైన- ఖరీదైన వస్తువు గానే కాక.. బీద-ధనికల మధ్య ప్రస్ఫుటమైన ఒక గీత స్పష్టంగా కనిపిస్తోంది.
న్యాయ వ్యవస్థ పై ఎవరు మాట్లాడాలని కోరుకోరు. ఎందుకంటే అది కోర్టు ధిక్కరణ అవుతుంది గనుక. మరి గతంలో సాక్షాత్తు కొంత మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులే వారి అధికార నివాసంలో లోనే పాత్రికేయులు సమావేశంలో.. ప్రధాన న్యాయ వ్యవస్థ లోని లొసుగులు గురించి బహిరంగంగా మాట్లాడిన తర్వాత, దిద్దుబాటు చర్యలు ఏమాత్రం కనిపించనప్పుడు, న్యాయం కోసం అర్రులు చాస్తూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కక్షి దారుల పరిస్థితి ఏమిటో దేవతల గా పిలవబ డుతూ ఉన్న న్యాయమూర్తులకే ఎరుక.
ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. హైకోర్టు న్యాయమూర్తులపై, కొన్ని తీర్పులు విషయంలో వాడిన భాష, తీరు, అలాగే హై కోర్టు న్యాయ మూర్తు లు.. క్రింది కోర్టు న్యాయమూర్తులపై చేస్తున్న వ్యాఖ్యలు సమాజం ఒకింత గగుర్పాటు కు లోను అయ్యే అవకాశం ఉంటుంది. తీర్పుల జాప్యంతో నిర్దోషి విలువైన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తోంది.న్యాయ మూర్తుల కొరత కొంతవరకు నిజమే అయినా, ఆ కొరతను పూర్తి చేయటంలో ఎక్కడో లోపం ఉన్నట్లు ప్రస్ఫుటం గా కనిపిస్తోంది. ఎ వరు భాద్యత వహించాలి? దరిమిలా శిక్ష ఎవరికి?
ఒకప్పుడు న్యాయ వ్యవస్థ ద్వారా తీర్పులు పొందడంలో ఆరితేరిన వాళ్లు గా కొంత మంది నాయకులు లో ముఖ్యంగా, దేవేగౌడ,చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి, అధికార పార్టీ లోని ప్రముఖులు పేర్లు వినబడేవి. దీనికి కారణం ” ఫేస్ వేల్యూ ” ఉన్న న్యాయ వాదులు. వీరు ఖరీదైన, బలమైన క్లయింట్ ల కు మాత్రమే అందుబాటులో ఉంటారు. నైపుణ్యం కలిగిన కొందరు న్యాయవాదులు ఉన్నా, చాలా సందర్భాలలో సరైన న్యాయం జరగదు. కారణం న్యాయదేవతలకే తెలియలి.
పైకోర్టు లో సాధారణ కక్షి దారుడు పిటిషన్ దాఖలు చేయాలంటే రిజిస్ట్రీలో అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. పరిశీలన, కేటగిరి, అయిన తర్వాత బెంచి పైకి వస్తే, అడ్మిషన్ కోసం కేవలం 30 నుంచి 40 సెకండ్ లలో కక్షి దారుడి తల రాత ను డిస్మిస్ పేరుతో కొట్టివేస్తే , వాదనలు కూడా వినకుండా.. న్యాయం ఉందా, లేదా తేల్చు కోవడం కోసం ఎక్కడి కి వెళ్లాలి?
పలుకుబడి, ధనవంతులు వ్యాజ్యములు వెంటనే అత్యవసర కేసు గా విచారణ కు వస్తాయి. ఇలాంటి ఉదంతాలు దేశ వ్యాప్తంగా ఎన్నో?! ఈ లోపాయికారి వ్యవస్థ ఎవరికి ఆవిరి దీపం? ఎ వరికి కొరివి దీపం? ఇటీవల ఒక న్యాయమూర్తి ఇంట్లో డబ్బుల కట్టలు దొరికితే, కనీసం అరెస్టు కూడా లేదు. కేవలం తొలగించాలని ప్రయత్నం తప్ప! ఒక చిన్న చిరుద్యోగి 500 రూపాయలతో ఏసిబికి పట్టుబడితే సస్పెండ్.. జైలు. ఆ కుటుంబం నాశనం!
రాజ్యాంగం ఈ దేశ పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు అగ్ర తాంబూలము. అదే రాజ్యాంగానికి గుండె లాంటిది అని చెప్పుకునే మనం.. మరి ప్రాధమిక హక్కులకు భంగం కలిగించే విషయంలో కోర్టు కు వెళితే, ఎన్ని పిటిషన్ లు విచారణకు నోచుకోవడం లేదో తెలిసిన విషయమే.
దేవతలుగా కొలవబడుతూ ఉన్న అరుదైన అవకాశం గల గౌరవనీయ న్యాయ మూర్తులు బడుగు, బలహీన, వర్గాల వారు న్యాయం కోసం అల్లాడుతున్న క్రింది- మధ్య తరగతి వ్యాపారులు.. కొన్ని లొసుగుల ముసుగులో కొట్టు మిట్టాడుతు, సర్వం కోల్పోయి ఉచ్చదశలో ఉన్న విధి ప్రేరిత మయిన ఆశా జీవులకు న్యాయ పరిధిలో న్యాయం చేయడం ధర్మం కూడా. న్యాయం- ధర్మం ఎప్పటికీ అందరికీ సమానమే అని మరొక సారి న్యాయ దేవత పరిరక్షకులుగా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా.
నిజానికి ఈ ఆవేదన.. ఏళ్ల చుట్టూ న్యాయం కోసం కాళ్లరిగేలా, కోర్టుల చుట్టూ తిరిగే స్వానుభవం ఉన్న నాకొక్కడికే కాదు. న్యాయం కోసం చకోరపక్షుల్లా కోర్టుల వైపు ఆర్తిగా చూసే వేలాదిమంది బాధితులది. న్యాయం పలుకుబడి ఉన్న వారికే కాదు. సామాన్యులకూ సత్వరం అందుతుందన్న నమ్మకం కలిగించాల్సిన బాధ్యత న్యాయస్థానాలదే. ఆ నమ్మకమే న్యాయస్థానాలపై ఇంకా ‘నమ్మకం’ ఉంచుతోంది. ఎందుకంటే న్యాయం ఎప్పటికీ గొప్పదే కాబట్టి!
My humble request to my Lordships
Kindly look at the genuinity of any petition
– ఓ.వి.రమణ
టి టి డి పాలకమండలి మాజీ సభ్యులు