– బీజేపీ నేతల వెల్లడి
బర్కత్ పురా: తెలంగాణ విమోచన దినోత్సవం 2025ను విజయవంతంగా నిర్వహించడానికి హైదరాబాద్లోని బర్కత్ పురా సిటీ ఆఫీసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్ చందర్ రావు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఈ సమావేశంలో సెప్టెంబర్ 17 వేడుకల కోసం సమగ్ర ప్రణాళిక, భద్రతా ఏర్పాట్లు, కంటోన్మెంట్ పార్కులో దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహ ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాల షెడ్యూల్ గురించి దిశానిర్దేశం చేశారు.
నిజాం, రజాకార్ల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరాకరిస్తూ వచ్చాయి. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అనేక పోరాటాలు చేస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విస్మరించినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న అధికారిక తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది.
2022, 2023లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, 2024లో జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా నిర్వహించనుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొని జాతీయ జెండా ఎగరవేయనున్నారు. ఇంకా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు, రాష్ట్ర పార్టీ నాయకులు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్వాతంత్య్ర పోరాట యోధుల గాథలను, ఉద్యమ కథలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా, పరేడ్ గ్రౌండ్ సమీపంలోని కంటోన్మెంట్ పార్కులో దివంగత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనిర్వహిస్తున్న ఈ వేడుకలకు బీజేపీ – తెలంగాణ పూర్తిగా సహకరిస్తోంది. వీటితో పాటు పార్టీ పరంగానూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది.