– రైతు కమిషన్ చైర్మన్ కొదండరెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు.. తనిఖీ చేసి సీజ్ చేస్తున్న నల్లబెల్లాన్ని రైతులకు తక్కువ ధరకు ఇవ్వాలని రైతు కమిషన్ చైర్మన్ కొదండరెడ్డి కోరారు. రైతులు నల్లబెల్లాన్ని సేంద్రియ ఎరువుల తయారీలో వాడుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని సీజ్ చేసిన నల్లబెల్లాన్ని రైతులకు ఇవ్వడం వలన సాగుకు సాయం చేసినట్లేనన్నారు. దీనిపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశమయ్యారు.
రీసెంట్ గా రైతు కమిషన్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన చేసిన సమయంలో చాలా మంది రైతులు నల్లబెల్లంతో సేంద్రియ ఎరువు తయారు చేసే విషయాన్ని కమిషన్ దృష్టికి తెచ్చినట్టు మంత్రికి వివరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేసి.. కొంతకాలానికి దాన్ని అడవుల్లో లేదంటే ఇతర ప్రాంతాల్లో పారబోస్తున్నారు. అలా వృథాగా పారబోయడం కంటే.. రైతులకు ఇస్తే.. సేంద్రియ ఎరువు ఉపయోగానికి వాడుకునే అవకాశం వుంటుందన్నారు.
రైతు కమిషన్ ప్రతిపాదనకు ఎక్సైజ్ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చైర్మన్ కొదండరెడ్డి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కమిషన్ సభ్యులు భూమి సునీల్ తోపాటు కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్, కమిషన్ అధికారి హరివెంకట ప్రసాద్, ఆదర్శ రైతు కోటిరెడ్డి ఉన్నారు.