– రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి: ప్రవాసాంధ్రులు శక్తివంతులుగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని, విద్య, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి కోసం ఖండాంతరాలు దాటిన ప్రవాసాంధ్రులు మరింతగా అభివృద్ధి పథంలో పయనించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
వారం రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెండు రోజుల పాటు జర్మనీలోని పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశంలోని ఫ్రాంక్ ఫర్ట్ లో ఉన్న భారత దౌత్య కార్యాలయాన్ని సందర్శించి, భారత కాన్సులేట్ జనరల్ బృందంతో భేటీ అయ్యారు. జర్మనీలో నివశిస్తున్న తెలుగువారి యోగ క్షేమ సమాచారాలను, అక్కడ తెలుగు ఎన్నారైలకు ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. యన్ ఆర్ ఐల అభివృద్ధిదికి ఏ పీ యన్ ఆర్ టి విభాగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో జర్మన్ పెట్టుబడుల అవకాశాలపై మంత్రి శ్రీనివాస్ కాన్సులేట్ జనరల్ బృందంతో కలిసి సమీక్షించారు. ఈ సమావేశంలో చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగంతోపాటు, ఇతర ప్రాధాన్య రంగాల్లో కూడా జర్మన్ పెట్టుబడులకు అవకాశాలను మంత్రి చర్చించారు. జర్మనీలో పలు కంపెనీలలో సిఇవోలు గా కీలక స్థానాలలో ఉన్న పలువురు ప్రవాసాంధ్రులు ఈ సమావేశంలో పాల్గొని విలువైన సూచనలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు అందిస్తుందని భరోసా మంత్రి భరోసానిచ్చారు.
ఈ సమావేశంలో తెలుగు వెలుగు సంస్థ అధ్యక్షుడు ప్రభంజన్, ఉపాధ్యక్షుడు సూర్య వెలగ, జవ్వాజి గ్రూప్ సి ఇ వో కృష్ణ జవ్వాజి, ప్రవాసాంధ్రులు సుమంత్ కొర్రపాటి, టిట్టు మద్దిపట్ల, నరేష్ కోనేరు, పవన్ కుర్రా, శివ బాతల, వంశీ కృష్ణ దాసరి, తదితరులు పాల్గొన్నారు.