– సీఎంగా చేసిన వ్యక్తి అలా మాట్లాడవచ్చా?
– మెడికల్ కాలేజీలు, రోడ్లనూ కూల్చేస్తారా?
– జగన్ బెదిరింపులను సమాజం స్వాగతిస్తుందా?
– వైసీపీకి కూల్చడం తప్ప నిలబెట్టడం రాదా?
– ఇలాగైతే ఆ 11 సీట్లు ఇవ్వడమూ ప్రమాదమే
– జగన్ వ్యాఖ్యలపై జనాగ్రహం
(చాకిరేవు)
ఆయన ఐదేళ్లు రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన బాధ్యతాయుతమైన నాయకుడు. ఇంకా బోలెడు రాజకీయ భవిష్యత్తు ఉన్న యువ నాయకుడు. మరి ఆయన ఇంకెంత జాగ్రత్తగా మాట్లాడాలి? కానీ అందుకు భిన్నంగా.. ఈ ప్రభుత్వంలో పనులు చేసే కాంట్రాక్టర్లను, తన ప్రభుత్వం వస్తే వాళ్ల సంగతి తేలుస్తామని బెదిరిస్తారా? అంటే ఆయన ఒక పార్టీ నాయకుడా? బెదిరింపు సంఘాలకు అధ్యక్షుడా?.. బ్లాక్‌మెయిలర్ల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడా?..అలాంటి మాటలతో సమాజానికి ఆయన ఇచ్చే సంకేత ం ఏమిటి?
అంటే మెడికల్ కాలేజీలు కట్టిస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కూల్చేస్తారా? రోడ్డు నిర్మిస్తే దానినీ ధ్వంసం చేస్తారా? .. ఇలాంటి వారినా మనం ఎన్నుకునేది? వీరికా మనం ఓటు వేసేది? అంటే జగన్‌కు విధ్వంసం తప్ప నిర్మాణం రాదా? కూల్చివేతలు తప్ప, నిలబెట్టడం ఆయన రక్తంలో లేదా? ఇలాగైతే ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా ఇవ్వడం ప్రమాదం.. ఇంకో తప్పు చేస్తే మనల్ని భవిష్యత్తు తరాలు క్షమించవు. ఇదీ ఇప్పుడు యావత్ ఆంధ్రావని మూకుమ్మడి భయాందోళనతో వ్యక్తమవుతున్న అభిప్రాయం.
ఆంధ్రా అంటే జగన్ జాగీరు అనుకుంటున్నారు.
కనీసం ప్రతిపక్ష నేతగాని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను తన వ్యక్తిగత ఆస్తిలా భావిస్తున్నారని, అందుకే ఇటువంటి హెచ్చరికలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పులివెందులలో కూడా ధరావత్తు దక్కకపోయినా.. దమ్మిడీ బుద్ధి రాలేదని, ఆయన తీరు మారలేదని ఎద్దేవా చేస్తున్నారు.ఎవరిదాకో ఎందుకు? సొంత పార్టీ నేతల నుంచే జాలువారుతున్న వ్యాఖ్యలివి.
“మళ్లీ జగన్ వచ్చే వరకు ఎవడూ టెండర్ వెయ్యకూడదు, ఏ పనీ చెయ్యకూడదు”అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఎవరైనా సరే టెండర్లు వేసినా, పనులు చేసినా వాటిని రద్దు చేస్తానని, డబ్బులు వెనక్కి తీసుకుంటానని హెచ్చరించడం ఆయన వైఖరిని స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
“మెడికల్ కాలేజీలు గట్రా అయితే కూల్చను కూడా కూల్చేస్తాడేమో!” అని ప్రజలు, పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లయితే తవ్వి పారేస్తారేమో అని భయపడుతున్నారు. ఈ జన్మలో ఇక జగన్ తిరిగి అధికారంలోకి రారని నమ్మి, ఆయన పార్టీ నేతలు సైతం కొత్త టెండర్లు వేయడం, వైన్ షాపులకు కూడా టెండర్లు వేయడం చూస్తుంటే, ఆయనను సొంత పార్టీ వారే నమ్మడం లేదని అర్థమవుతోంది.
జగన్ హెచ్చరికలు రోడ్డుపై వెళ్లే రౌడీ ఇచ్చే వార్నింగ్ లా ఉన్నాయని ప్రజలు, నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అతి త్వరలో జైలుకు వెళ్లబోయే ఈ వ్యక్తి ప్రవర్తన సైకోలా ఉందని, ఈ రుబాబు ఇంకెంత కాలం భరించాలో అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ వ్యాఖ్యలు తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేలా ఉన్నందున.. బీజేపీలో తలదాచుకోవడం మంచిదన్న ఆలోచనకు జగన్ వ్యాఖ్యలు ప్రాణం పోశాయి.