– మాజీ మంత్రి దేవినేని ఉమా
గొల్లపూడి: జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో జరిగిన దుర్మార్గాలు బయట పడతాయనే భయమే అసెంబ్లీ రాకుండా పోవడానికి కారణమని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడ రూరల్ గొల్లపూడి టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
“జగన్ రెడ్డి చేసిన అవినీతిని, వైద్య రంగంలో జరిగిన అవకతవకలను ప్రభుత్వం సభలో ప్రజల ముందు ఉంచబోతోంది. దమ్ము ధైర్యం ఉంటే జగన్ రెడ్డి సభకు రావాలి. ప్రెస్ క్లబ్‌కు వచ్చి మీడియా ఎదుట మాట్లాడాలి,” అని ఉమా సవాల్ విసిరారు.
అయితే, గతంలో 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ సభకు హాజరయ్యామని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా లేదని నెపం చెప్పుకుంటూ పారిపోతున్నాడన్నారు.
మెడికల్ కాలేజీల పేరుతో భారీ అవినీతి
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మెడికల్ కాలేజీల పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు చెబుతూనే, కేంద్రం ఇచ్చిన నిధుల్లో కేవలం 470 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన దాఖలాలు ఉన్నాయని ఉమా పేర్కొన్నారు. కేంద్రం 975 కోట్లు విడుదల చేయగా, మిగతా నిధుల బొమ్మ ఏంటో జగన్ సమాధానం చెప్పాలన్నారు.
చంద్రబాబు తీసుకువచ్చిన ప్రాజెక్ట్ “ఎయిమ్స్‌కు కూడా నిర్వహించలేకపోయారు. రోజుకు నాలుగు నుంచి ఐదు వేల మంది ఓపి రోగులు వస్తుంటే, తాగునీళ్లు ఇవ్వడానికే జగన్ రెడ్డికి వీలుకాలేదని అని ధ్వజమెత్తారు.
కన్వీనర్ కోటాలో 85 శాతం స్థానాలను 50 శాతానికి తగ్గించి, ఎన్నారై కోటాను 15 శాతం నుంచి 35 శాతానికి పెంచడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేశారని విమర్శించారు. ఇది వైద్య విద్యలో సమాన అవకాశాలకు తీవ్ర ఆటంకంగా మారిందని తెలిపారు.
కరోనా సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్‌ను హింసించి, అవమానించడం ద్వారా జగన్ రెడ్డి తన ప్రవర్తన ఏ స్థాయిలో ఉందో చాటిచెప్పారని ఉమా ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై జగన్‌కు విశ్వాసం లేదని, అందుకే సభకు రావాలనే ఆత్మవిశ్వాసం లేదన్నారు.
ఒంటిమిట్టలో పరాభవం… పులివెందులలో డిపాజిట్ కోల్పోతే ఇలా పారిపోతారా?
ఇటీవల జరిగిన ఒంటిమిట్ట ఉప ఎన్నికలో వైసీపీకి వచ్చిన ఘోర పరాజయం, పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన పరిణామాలు జగన్‌ను అసెంబ్లీకి రానివ్వకుండా చేస్తున్నాయని ఉమా విమర్శించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన నేతగా జగన్ పేరుగాంచారని ఆరోపించారు.
“నాకు పత్రిక లేదు, చానెల్ లేదు అంటూ జగన్ మాట్లాడుతుండటం వింత. సాక్షి పత్రిక, టీవీ చానెల్లన్నీ అతని కుటుంబానివే. వాటి ద్వారా ప్రభుత్వం, కూటమిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు,” అని ఉమా వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన “సూపర్ సిక్స్” పథకాలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని తెలిపారు. అనంతపురంలో జరిగిన సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ఈ విజయాన్ని తట్టుకోలేకనే జగన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రజల సమస్యలపై సమగ్ర చర్చ జరగబోతోందని, జగన్ రెడ్డి దాని నుంచి తప్పించుకోవడం దారుణమని దేవినేని ఉమా తీవ్రంగా విమర్శించారు.