– ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు
– ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.30 వేల కోట్లు
– ఏడాదిన్నరగా పీఆర్సీ కమిటీ ఊసే లేదు
– ఐఆర్ ఇస్తామని మోసం. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్
– ఓపీఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చి దారుణంగా మోసం
– ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఉద్యోగులకు పోస్టింగులు లేవు
– యాప్‌ల పేరుతో టీచర్లకు అడుగడుగునా వేధింపులు
– 15 నెలలైనా చంద్రబాబు మొదటి సంతకానికే దిక్కు లేదు
– డీఎస్సీతో 16 వేల టీచర్ పోస్టుల భర్తీ ఇప్పటికీ పూర్తి కాలేదు
– వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం
తాడేపల్లి: మోసపు హామీలతో ఉద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా, వారికి హక్కుగా పొందాల్సిన పీఆర్సీ, ఐఆర్, డీఏలు వంటి అంశాల విషయంలోనూ తీవ్రంగా వంచిస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మొదటి సంతకం చేసిన టీచర్ పోస్టుల భర్తీ 15 నెలలైనా ఇప్పటికీ పూర్తి కాలేదని, కానీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఒకేసారి ఏకంగా 1.36 లక్షల సచివాలయాల శాశ్వత ఉద్యోగాలిచ్చి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు.
ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.30వేల కోట్లు తక్షణం చెల్లించాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగులను ఓపీఎస్ పరిధిలోకి ఎప్పుడు తీసుకొస్తారని ప్రశ్నించారు
వైయస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోలేదని, మేం అధికారంలోకి వస్తే ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటామని చెప్పిన చంద్రబాబు 15 నెలలుగా పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ కమిషన్ వేసి వేతనాలు రివైజ్ చేయడం జరుగుతుంది. పరిస్థితులను బట్టి ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి డీఏను ప్రకటించడం కూడా నిత్యం జరిగే ప్రక్రియ. 12వ పీఆర్సీ 2023 జూలై లో పీఆర్సీని ప్రకటించాల్సిన సమయం.
ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్ పీఆర్సీ ఎంత వేయాలనే దానిపై 2023 జూలై 12న కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు. ఈలోపు ఎన్నికలు రావడం, కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం బలవంతంగా ఆ కమిటీతో రాజీనామా చేయించింది. కానీ నేటి వరకు కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేయకుండా ఉద్యోగులను వేధిస్తున్నారు. ఇప్పటికి పీఆర్సీ కమిటీ కూడా వేయలేదు. కనీసం ఉద్యోగులకు ఐఆర్ కూడా ప్రకటించలేదు.
కూటమి అధికారం లోకి వచ్చిన ఈ ఏడాదిన్నరలో పీఆర్సీ లేకుంగా ఐఆర్ ప్రకటించకుండా వదిలేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే అరియర్స్ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక రూ. 21,980 కోట్లు అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయని చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. నేటికి ఆ బకాయిలు రూ.30 వేల కోట్లకు చేరుకున్నాయి.
ఎన్నికల నాటికి అనేక డిపార్ట్మెంట్లలో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తికాగా, విద్యాశాఖలో మాత్రం మిగిలిపోయింది. అసెంబ్లీ, మండలి, గవర్నర్ ఆమోదం పూర్తయినా కూటమి ప్రభుత్వం చాలా మందిని ఇంతవరకు క్రమబద్ధీకరించలేదు. డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని చంద్రబాబు మొదటి సంతకం పెట్టి 15 నెలలైంది. ఇంతవరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.
డీఎస్సీ మీద ఆశలు పెంచుకున్న నిరుద్యోగులను 16 చెరువులు నీరు తాగిస్తున్నాడు. క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో అర్థంకాక అయోమయంలో ఉన్నారు.
వీఆర్వో, ఆఆర్ఏల వ్యవస్థలో ప్రమోషన్లు కావాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. కానీ టీడీపీ ప్రభుత్వం వారిని ఏనాడూ పట్టించుకోలేదు. అలాంటిది అర్హులైన వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో 40 శాతం కోటా కల్పించేలా నిబంధనలు తీసుకొచ్చాం. వీఆర్ఏలకు దివంగత వైయస్సార్ ప్రభుత్వం 2008లో 10 వేల మంది వీఆర్ఏలకు వీఆర్ఓలుగా ప్రమోషన్లు లభిస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు.
2024 కూటమి ప్రభుత్వం వచ్చాక ఆప్కాస్‌ను నిర్వీర్యం చేసి మళ్లీ పాత విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల చేతుల్లో పెట్టాడు. ఎన్నికలకు ముందు సీపీఎస్, జీపీఎస్ కన్నా మిన్నగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) తీసుకొస్తామని చంద్రబాబు, వపన్ కళ్యాణ్ హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయకుండా మోసం చేశారు. దీంతో ఉద్యోగులు తాము ఏ సీపీఎస్ కింద ఉన్నామో, జీపీఎస్ కింద ఉన్నామో అర్ధం కాని అయోమయంలో ఉన్నారు.
ప్రమోషన్ కోసం ప్రభుత్వ ఉద్యోగులు డిపార్ట్మెంట్ పరీక్షలు రాయాల్సి ఉంటే వారి ప్రమోషన్లు అడ్డుకునేందుకు టీడీపీ ప్రభుత్వం నెగిటివ్ మార్కుల విధానం తీసుకొచ్చంది. ఇలాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని గుర్తించిన నాటి సీఎం వైయస్ జగన్ వెంటనే రద్దు చేసి డిపార్ట్మెంట్ పరీక్షల విధానం తీసుకొచ్చి వేధింపులకు గురవుతున్న ఉద్యోగులకు అండగా నిలిచారు. ఆ విధంగా ఉద్యోగులకు సులభంగా ప్రమోషన్లు పొందే వీలు కల్పించారు.
ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో ఉద్యోగులకు వేధింపులు
కూటమి ప్రభుత్వంలో పచ్చ బిళ్ల ఉన్నవారికే పనులు చేస్తామని మంత్రులు బాహాటంగా చెబుతున్నారు. ఉద్యోగులు స్వతంత్రంగా నిబంధనల ప్రకారం పనిచేయలేక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తాము చెప్పినట్టు వినకపోతే కూటమి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యోగులను నోటికొచ్చినట్టు తిడుతూ బెదిరిస్తున్నారు.
ఐవీఆర్ఎస్ కాల్స్ ని అడ్డం పెట్టి సచివాలయ ఉద్యోగులను టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. లంచాలు తీసుకోకపోయినా తీసుకున్నారని చెప్పి కమిటీలు వేసి వేధిస్తున్నారు. వైయస్ జగన్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారనే కోపంతో వారితో అటెండర్ డ్యూటీ నుంచి వాచ్మెన్ ఉద్యోగుల దాకా అన్ని పనులు చేయిస్తున్నారు. ఉద్యోగులనే కనీస గౌరవం ఇవ్వకుండా కుట్రపూరితంగా వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. రకరకాల యాప్‌ల పేరుతో టీచర్లను అడుగడుగునా వేధిస్తున్నారు. నోరెత్తి మాట్లాడితే సస్పెండ్, ట్రాన్సఫర్ల పేరుతో ఇబ్బంది పెడుతున్నారు.
కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ఇస్తామన్నారు. మంచి పీఆర్సీ అన్నారు. ఏళ్ళు గడుస్తున్నా కనీసం కమిటీ కూడా వేయలేదు. కేబినెట్ మీటింగ్‌లలో ఎక్కడా ప్రస్తావించడం లేదు. నాలుగు డీఏలు పెండింగ్‌లు ఉన్నాయి. రూ. 30 వేల కోట్లకు ఉద్యోగుల బకాయిలు పేరుకుపోయాయి. ఓపీఎస్ అమలు చేస్తామన్నారు. దాని ఊసేలేదు.
పెన్షనర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దాన్ని ఇంతవరకు పట్టించుకున్నపాపాన పోలేదు. అంగన్వాడీలు, ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతామని పట్టించుకోలేదు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. పథకాలు ఇవ్వకపోగా ఒకటో తేదీనే జీతాలిస్తున్న ఆప్కాస్ని నిర్వీర్యం చేశారు. 93 వేల మంది జీవితాలను దళారుల చేతుల్లో పెట్టారు. 2.60 లక్షల మంది వలంటీర్ల జీతాలు రూ. 10 వేలకు పెంచుతామని చెప్పి, శాశ్వతంగా ఉన్న ఉద్యోగాల నుంచి ఊడపెరికేశారు.
హెల్త్ అసిస్టెంట్లను బలవంతంగా తొలగిస్తున్నారు. నచ్చని ఉద్యోగులకు నెలల తరబడి పోస్టింగులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. రేషన్ వాహనాలను రద్దు చేసి దాదాపు 20 వేల మంది ఉద్యోగుల కుటుంబాలను రోడ్డున పడేశారు. 114 ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా వదిలేశారు.