– ఆ హోటళ్లకు మా భూములివ్వం
– సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనున్న మా భూములు ఎందుకిస్తాం?
– మా భూములు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు
– తుళ్లూరు సీఐ కూడా భూములివ్వాలని బెదిరిస్తున్నారు
– వరల్డ్ బ్యాంకుకు ఇద్దరు అమరావతి రైతుల ఫిర్యాదు
అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో ల్యాండ్ పూలింగులో లేని తమ భూములను ఇవ్వాలని ఎపి సిఆర్డిఎ అధికారులు బెదిరిస్తున్నారని ఇద్దరు రైతులు వరల్డ్ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. ఎల్పిఎస్ స్కీములో లేని తమ భూములను హోటల్ నిర్మాణానికి కేటాయించి దానికి వీలుగా తమ భూమి సరిహద్దులు తొలగించి, బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మందడం ప్రాంతానికి చెందిన భూ యజమానులు పసుపులేటి జమలయ్య, కలపాల శరత్ కుమార్ ఈ మేరకు బుధవారం ఫిర్యాదు పంపించారు. తమ భూములు సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్నాయని, అక్కడ జీవి ఎస్టేట్ అండ్ హోటల్స్ కు భూమి కేటాయించారని పేర్కొన్నారు.
తాము భూసమీకరణ పథకంలో లేమని వివరించారు. సిఆర్డిఎ అధికారులు తమ భూములు సమీకరణకు ఇవ్వకపోతే ఊరుకోబోమని బెదిరించారని, అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. అయినా వినకుండా తమ భూములకు ఉన్న ఫెన్సింగ్ ను బలవంతంగా తొలగించారని వివరించారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా తుళ్లూరు పోలీసుస్టేషన్ సిఐ కూడా భూములు ఎందుకివ్వరని బెదిరించారని పేర్కొన్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో తాము ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించారు. దీని పై తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇందులో జమలయ్యకు మందడం సర్వే నెంబరు 225/1లో 40 సెంట్లు, కలపాల శరత్‌కుమార్‌కు సర్వే నెంబరు 225/1లో 30 సెంట్లు భూమి ఉంది. దీనికి సంబంధించిన వివరాలనూ ఫిర్యాదుతో జతచేసినట్లు వారు తెలిపారు. సిఎస్, డిజిపి, సిఆర్డిఎ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులకు ఈ నెల 10న రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినట్లు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
– వల్లభనేని సురేష్
(సీనియర్ జర్నలిస్టు)
9010099208