* ఈ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి
* రైతు సేవా కేంద్రాల వరకు ప్రత్యేక డ్యాష్ బోర్డు
* అమెరికా పన్నుల భారం రొయ్యల పరిశ్రమపై పడింది
* రొయ్యల సాగు మేత ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోండి
* రబీలో యూరియా కొరతనే మాట లేకుండా చేస్తామని వెల్లడి
– కలెక్టర్లకు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచన
అమరావతి: ఏ రాష్ట్రానికైనా ఆర్థిక ప్రగతికి ప్రధాన ముడి సరకు. ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగమేనని ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్లకు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రాథమికరంగం సాధించిన ప్రగతిపైన ప్రజంటేషన్ ఇచ్చారు. చక్కెర పరిశ్రమ ఉందంటే ముందు దానికి చెరకు కావాలి, కోక్ ఉందంటే ముందు కోక్ పంట ఉండాలి, ఆర్థికాభివృద్ధికి వ్యవసాయరంగం అత్యంత కీలకమన్నారు.
ఈ రంగంలో ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. మేమిచ్చిన గణాంకాలను మీరు జిల్లా స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడ ఇది ఎలా సాధ్యమైందనేది నిశితంగా పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో రెండు జిల్లాలు మినహా మిగిలిన 24 జిల్లాలూ ప్రాథమిక రంగానికి ఊతమిచ్చే జిల్లాలేనన్నారు. ఉద్యానవనం రంగం ప్రస్తుతం 30శాతం ఉంది, దీన్ని రాబోయే రోజుల్లో 50శాతానికి తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి ఆశయమని, దాన్ని సాధించడానికి కలెక్టర్లు కృషి చేయాలన్నారు. పాడిపరిశ్రమ గణనీయమైన వృద్ద నమోదు చేస్తోందన్నారు. 2025-26 మొదటి త్రైమాసికంలో 36.34 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 37.26 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్ప్తిని సాధించినట్లు తెలిపారు.
అమెరికా పన్నుల పెంపు అవరోధం
భారత్ ఎగుమతులపై అమెరికా విధించిన పన్నులు ఆక్వా రంగానికి పెద్ద అవరోధంగా మారిందన్నారు. రొయ్యల ఎగుమతిపై అమెరికా పన్నులు 60శాతం ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఈ సవాళ్లను అధిగమించడానికి ప్రత్యమ్నాయ మార్గాల అన్వేషణ చేస్తున్నామన్నారు. రొయ్యల సాగు రైతులకు మేత పెట్టుబడి వ్యయమే 40 శాతం అవుతోందన్నారు. ఈ భారం తగ్గించేలా జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయిలో పని చేయాలన్నారు.
మేత వ్యయం కనీసం 6 శాతం భారం తగ్గించేలా మనం చేయగలిగినా వారికి ఎంతో మేలు చేసినవారమవుతామన్నారు. అలాగే యాంటీబయాటిక్స్ ఒక పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు.
ఆర్ ఎస్ కే స్థాయి నుంచి డ్యాష్ బోర్డు
రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చే వ్యవసాయరంగానికి ప్రభుత్వం అమిత ప్రధాన్యమిస్తోందన్నారు. రైతు సేవా కేంద్రాల స్థాయి నుంచి వృద్ది రేటు సాధనా క్రమం ఎలా ఉంది అనేది మదింపు వేస్తున్నామన్నారు. దీని ప్రకారం మీకు ఎప్పటికప్పుడు ఏ మండలం, ఏ గ్రామ పరిధిలో పరిస్థితి ఎలా ఉందనేది తెలుస్తుందన్నారు. దానికనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవడానికి కలెక్టర్లకు వీలు కలుగుతుందన్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రీజియన్, జిల్లా మండల స్థాయి వరకు కూడా జీవీఏ (స్థూల విలు జోడింపు) పరంగా మథింపు వేశామన్నారు.
ఇందులో అనంతపురం, తూర్పు గోదావరి, ఏలూరు, సత్యసాయి, నెల్లూరు జిల్లాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయన్నారు. రైతు సేవా కేంద్రాల వారీగా చూస్తే తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు మండలంలోని భలభద్రాపురం-1, 2, 3, అరికరేవుల రైతు సేవా కేంద్రాలు, కోనసీమ జిల్లాలోని వెలగతేడు-2 రైతు సేవా కేంద్రం ముందు వరసలో నిలిచాయన్నారు.
ఇద్దరు ఆర్ ఎస్ కే సిబ్బందికి ప్రశంసలు
అనిమల్ హజ్జెండరీ, హార్టీకల్చర్ విభాగాల్లో గణనీయమైన ఫలితాలు సాధించిన ఇద్దరు రైతు సేవా కేంద్రాల సిబ్బందిని ఈ సమావేశంలో ఆయన ప్రశంసించారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కాపవరం రైతు సేవా కేంద్రంలో అనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ జే.సత్యవేణి 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రూ.816 కోట్ల జీవీఏ సాధించారు. ఈమె ఈ ఆర్థిక సంవత్సరం రూ.895.14 కోట్లు జీవీఏ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కడప జిల్లా లింగాల మండలం, కొమ్మునూతల రైతు సేవా కేంద్రంలో పనిచేస్తున్న విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ కె. పవన్ కల్యాణ్ 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 480 కోట్ల జీవీఏ సాధించారు.
ఈ ఆర్థిక సంవత్సరం రూ.580.80 కోట్ల జీవీఏ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రైతు సేవా కేంద్రం పరిధిలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు అందరూ కూడా వంద శాతం సూక్ష్మసేద్యం చేసేలా చూడగలిగారు. టిష్యూ కల్చర్‌తో అరటి సాగు చేసేలా రైతులను ప్రోత్సహించారని తెలిపారు
రబీకి యూరియా కొరత ఉండదు
వచ్చే రబీ సీజన్లో యూరియా కొరత అనే మాట లేకుండా చేస్తామన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో యూరియా సమస్యలు కొన్ని వచ్చాయని, మాకు ఎదురూన అనుభవాలు అన్నీ భేరీజు వేసుకున్నామని దీని ప్రకారం వచ్చే రబీ సీజన్లో యూరియా కొరతన్న మాట వినపడకుండా చేస్తామన్నారు. యూరియా సరఫరా అంటే కేవలం ఇన్వెంటరీ నమోదు మాత్రమే కాదని, కలెక్టర్లు యూరియా క్షేత్ర స్థాయిలో ఎలా పంపిణీ జరుగుతుందనేది కూడా చూడాలన్నారు