– చలో పరేడ్ గ్రౌండ్స్
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రవి ప్రసాద్ గౌడ్
హైదరాబాద్: 75 సంవత్సరాలు దేశాన్ని పాలించిన పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించేందుకు అంగీకరించలేదని, 1998లో విద్యాసాగర్ రావు నేతృత్వంలో బిజెపి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్ తెలిపారు.
కలెక్టర్ కార్యాలయాల ముందు, ఎమ్మార్వో ఆఫీసుల ముందు మూడు రంగుల జెండా ఎగురవేసినందుకు బిజెపి నాయకులపై, కార్యకర్తలపై అనేక కేసులు పెట్టారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవిప్రసాద్ గుర్తు చేశారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుకోవడానికి అంగీకరించలేదు. సెప్టెంబరు 17న అక్రమ నిర్బంధాలకు గురిచేశారు. ఇది మూడో సంవత్సరం. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించుకోబోతున్నామని తెలిపారు.
నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించింది. ఏ మిలటరీ, భారత సైన్యం నిజాం మీద యుద్ధం ప్రకటించి, పోలీస్ యాక్షన్ పేరుతో ఇక్కడి ప్రజలను రక్షించి మూడు రంగుల జెండా ఎగురవేసిందో… ఆ ఆర్మీకి సంబంధించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెప్టెంబరు 17న పరేడ్ గ్రౌండ్స్ కు రానున్నారు.
కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం దిగరాకపోవడం దురదృష్టకరం. త్వరలోనే ఆరు నూరైనా గ్రామాల్లో, అన్ని స్కూల్స్లో, ప్రతి ఇంటిపై మూడు రంగుల జెండా ఎగురవేసి… ఈ ఉత్సవాలను అధికారికంగా జరుపుకునే పరిస్థితి ఏర్పడతుందని చెప్పారు.
ఎవరు ఔనన్నా కాదన్నా.. వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటి పై మూడు రంగుల జెండా ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటామని రవి ప్రసాద్ గౌడ్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన చరిత్రను ప్రజలకు సులభంగా అందించేందుకు ప్రత్యేక డిజిటల్ మ్యూజియం రూపొందించడం జరిగింది. నిజాం పాలనలో జరిగిన దమనకాండ, రాష్ట్ర విమోచన ఉద్యమానికి సంబంధించిన అన్ని అంశాలను తెలియజేసేలా ఈ డిజిటల్ మ్యూజియం రూపొందించడం జరిగిందని అందరూ తిలకించాలని తెలిపారు.
ఈ చారిత్రాత్మక డిజిటల్ మ్యూజియాన్ని సెల్ ఫోన్ల ద్వారా, కంప్యూటర్లు, టీవీల్లో వీక్షించి నిజాం నిరంకుశ పాలనపై జరిగిన పోరాటాల గురించి తెలుసుకోవాలని రవి ప్రసాద్ గౌడ్ కోరారు.