– మండిపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి: ఉల్లి, టమోటా రైతుల దీనస్థితి అంటూ జగన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. రైతుల కష్టాలు నిజంగా పట్టించుకునే హృదయం జగన్‌కి ఉంటే తన పాలనలోనే రైతులను దోపిడీకి గురి చేయడమేంటి అని ప్రశ్నించారు. రైతుల పట్ల కనీసం చిత్తశుద్ధి లేని జగన్ ఇప్పుడొచ్చి అబద్ధపు సానుభూతి నటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉల్లి, టమోటా రైతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లించిందని గుర్తు చేశారు. మద్ధతు ధరలు, రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని అన్నారు. రైతులకు అండగా నిలబడటం అంటే డ్రామాలు కాదు, క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపించడమేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. జగన్ పాలనలో రైతులు కన్నీరు మున్నీరయ్యారు… ఇప్పుడు ఆయన కార్చే కన్నీరు మొసలి కన్నీరు తప్ప మరేదీ కాదన్నారు.
ప్రస్తుతం ఉల్లి రైతులను ఆదుకోవడం లేదని జగన్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, మార్కెట్ లో ధరలు పెరగడం, తగ్గడం అనేది మార్కెట్ డైనమిక్స్ డిసైడ్ చేస్తాయని, ధరలు తగ్గినప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధతు ధరను అందించి రైతులకు న్యాయం చేస్తామని, ధరలు పెరిగినప్పుడు సబ్సిడీ రూపంలో వినియోగదారులకు సరసమైన ధరలలో ఉత్పత్తులను అందచేస్తామని తెలిపారు. 2025 లో ఉల్లి ధరలు పతనమవుతున్నాయని ముందస్తు అంచనా వేసి క్వాలిటీతో సంబంధం లేకుండా 1200 మద్ధతు ధరను ప్రకటించామని తెలిపారు.
తొలుత మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వమే ప్రత్యక్షంగా రైతులకు ఉల్లి క్వింటాకు 1200 చెల్లించి కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా అమ్మకాలు చేసినట్టు తెలిపారు. డిమాండ్ ను మించి ఒకే సారి రైతులు పంటను మార్కెట్ కు తీసుకురావడంతో మార్కెట్ వ్యత్యాసపు ధరను ప్రకటించామని…1200 క్వింటా ఉంటే ఆ ధరకు తక్కువగా రైతులకు లభిస్తే మిగిలిన నగదును ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తుందన్నారు. 2016లో ఉల్లి ధరలు పడిపోతే 7723 మంది రైతులనుండి 2.77 లక్షల క్వింటాళ్ళు కొనుగోలు చేసి 7 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని, 2018లో మరొక సారి 9740 మంది రైతుల నుండి 3.48 లక్షల క్వింటాళ్ళ ఉల్లి కొనుగోలు చేసి 6.45 కోట్లు చెల్లించామని తెలిపారు.
2025 సంవత్సరంలో ఈ నెల 15 వ తేదీ వరకు రైతు బజార్ల కోసం 9014 క్వింటా ఉల్లిని కొనుగోలు చేశాం. మార్క్ ఫెడ్ ద్వారా 53239 క్వింటాలను సేకరించాం. వ్యాపారుల ద్వారా 15292 క్వింటాల ఉల్లిని నేరుగా కోనుగోలు చేయడం జరిగింది. ధర వ్యత్యాస పథకం కింద మార్క్ ఫెడ్, ప్రైవేట్ వ్యాపారుల ద్వారా 51268 క్వింటాల ఉల్లిని కోనుగోలు చేశారు. మార్క్ ఫెడ్ ద్వారా 931 మంది రైతుల ద్వారా 5.97 కోట్ల ఉల్లిని కోనుగోలు చేసిందని, అందులో ధర వ్యత్యాసం కింద 752 మంది రైతులకు 4.25 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.
జగన్ హయాంలో 2020 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో ఉల్లి ధరలు పడిపోతే, నామ మాత్రంగా క్వింటాకి రూ.770/-లు మద్దతు ధర ప్రకటించి, ఏ ఒక్కరి దగ్గరా ఉల్లి కొనుగోలు చేయకుండా, రైతులను మోసం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా జగన్ గుండె కరగలేదా.. కేవలం 250 మంది రైతుల దగ్గర 75 లక్షలు ఇచ్చి ఉల్లిని కొన్న నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు అంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం రైతు బజార్లలో 12 నుంచి 15 రూ ఉల్లి కేజీ అమ్ముతుంటే, ప్రైవేట్ సంస్థ బిగ్ బాస్కెట్ లో 34 రూ కేజీ అంటూ ప్రజలకు నష్టాన్ని చేకూర్చే విషయాలను కార్పొరేట్ మాజీ సీఎం వెల్లడించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
2020లో మీ ప్రభుత్వ సమయంలో ఉల్లి ధరలు పడిపోయినప్పుడు మీ సమయంలో ఎంత మంది దగ్గర కొన్నావు, ఎన్ని కోట్లు రైతులకు అందచేశారు అన్న విషయంపై వివరాలు చెప్పగలరా… బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాలు విసిరారు. మార్కెట్ ధరల వ్యత్యాసాల సమయంలో రైతుల పట్ల ఎలా వ్యవహరించాం అనేది ముఖ్యం.. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను ఉదాహరణలతో సహా వెల్లడించామని, ఇలా బహిరంగంగా తెలిపే దమ్ము, ధైర్యం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు.
టమోటా మార్కెట్ లో ధరలు పడిపోకముందే, ధర తగ్గింది, విపరీతంగా సరుకు మార్కెట్ కు వస్తుంది అనే తప్పుడు సమాచారాన్ని జగన్ అండ్ కో సృష్టించారని, రైతులకు రావలసిన గిట్టుబాటు ధర రాకుండా చేయడం కుట్రకోణం దాగి ఉందని అనుమానం కలుగుతుందని మంత్రి అచ్చెన్న అన్నారు. గత సంవత్సరం, అంటే 2024-2025 లో ధరలు తక్కువగా ఉండటం వల్ల రాయలసీమ ప్రాంత రైతుల నుండి రూ 2.00 కోట్ల విలువైన 1677.50 మెట్రిక్ టన్నుల టమోటాను సేకరించి, డిసెంబర్-2024 నుండి మార్చి-2025 వరకు లాభనష్టాలు లేకుండా రాష్ట్రంలోని రైతు బజార్ల ద్వారా విక్రయించాం 2025-26 సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో ధరలు తక్కువగా ఉండటం వలన రైతుల నుండి 1.25 కోట్ల విలువైన 1141 మెట్రిక్ టన్నుల టమోటాను కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతు బజార్లకు లాభనష్టం లేకుండా సరఫరా చేశాం.
నేటి వరకు సుమారు 75 మెట్రిక్ టన్నుల టమోటాను కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతు బజార్లకు లాభనష్టం లేకుండా సరఫరా చేసాం. వైసీపీ హయాంలో 3780 మెట్రిక్ టన్నుల టమోటా పంటను సేకరించగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పడి నుండి నేటి వరకు 4672 మెట్రిక్ టన్నుల టమోటా పంటను సేకరించామని తెలిపారు. ఎదో ఒక మార్కెట్ లో క్వాలీటి బాలేని పంటను హైలేట్ చేస్తున్నారని, రైతుల పట్ల కనీస చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తూ తప్పుడు కథనాలను సృష్టించి రైతులను మోసం చేస్తున్నాడని, దీని వలన మరింత మార్కెట్ పడిపోతుందని అన్నారు.
అయినప్పటికి రైతుల వద్ద కోనుగోలు చేసి రైతు బజార్లులలో అమ్మేందుకు చర్యలు చేపడుతున్నామని, రైతులను ఆదుకునే విషయంలో మీచేత చెప్పించుకునే స్థితికి మేం చేరుకోలేదు అన్న విషయాన్ని గుర్తించుకోవాలని జగన్ కు మంత్రి అచ్చెన్న సూచించారు.