– విశాఖలో సీఎం చంద్రబాబు,వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్చే ప్రారంభం
– రాష్ట్రంలో కోటి మందికి పైగా ఆరోగ్య పరీక్షలు చేయాలని లక్ష్యం
– అన్ని స్థాయిల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో భారీగా ఏర్పాట్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్తో సహా దేశ వ్యాప్తంగా బుధవారం నుంచి వచ్చే నెల 2వరకు “స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమం కింద మహిళల ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక వైద్య శిబిరాలు జరుగనున్నాయి. ఇండోర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభిస్తారు. ఇదే సమయంలో విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి రాష్ట్రoలో జరిగే వైద్య శిబిరాల్ని ప్రారంభిస్తారు.
విజయవాడలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 14,500 వైద్య శిబిరాలు జరుగుతాయి. ఈ వైద్య శిబిరాలు ఉప ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని బోధనాసుపత్రుల ప్రాంగణాల్లో జరుగుతాయి. 8,181 స్పెషలిస్టు వైద్యులు పాల్గొని మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. ఈ శిబిరాల ద్వారా చిన్నారులు, బాలబాలికలకు కలిపి కోటి మందికి పైగా ఆరోగ్య పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యం గా పెట్టుకుంది.
మెప్నా, గ్రామ వార్డు సచివాలయాలు, అంగన్వాడీలు , వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వారితో కలిపి 4,000 సిబ్బంది వైద్య శిబిరాల నిర్వహణ విధుల్లో పాల్గొననున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, మునిసిపల్, విద్యాశాఖాధికారులతో పాటు ఐఎంఎ, రెడ్ క్రాస్ సొసైటీలు కూడా ఈ శిబిరాల నిర్వహణలో భాగస్వామ్యం కానున్నాయి. అలాగే అన్ని స్థాయిల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర స్థాయిలలో ఉన్న ప్రజాప్రతినిధులు కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,524 మంది పాల్గొంటారు.
మహిళలకు అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్
రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఇతర పరీక్షలు చేస్తారు శిశువులు, చిన్నారులకు టీకాలు వేస్తారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం నాడు ఓ ప్రకటన జారీ చేసింది.