– ‘రాజు’గారి రూటే సెప‘రేటు’
– ‘ఫ్యాక్టరీస్’ బాసుగా ఉండగా ఆ కెమికల్ కంపెనీకి కరసేవ
– ‘సొంత సామాజికవర్గ’ అభిమానంతో శ్రమదానం
– విష వాయువు పీల్చి కార్మికులు మరణించినా సహజ మరణాల ఖాతా నివేదిక
– ఆ తర్వాత కార్మికుల కుటుంబాలతో కేసులు కాకుండా యాజమాన్యం రాజీలు
– ఆ కెమికల్ కంపెనీపై ఇప్పటిదాకా ఒక్క కేసు పెట్టని విధేయత
– రిటైరయిన తర్వాత అదే కంపెనీలో ఉపాధ్యక్షుడి అవతారం
– దానిపై ముందే చెప్పిన ‘సూర్య ’ కథనం.. తాజాగా నిజమైన వైనం
– తాజాగా కన్సల్టెంట్ హోదాతో కొత్త అవతారం
– రిటైరయినా విశాఖలో ఇప్పటికీ తమ్ముడి కంపెనీకే ఏజెన్సీ పట్టం
– తమ్ములుం గారి థర్డ్‌పార్టీ ఏజెన్సీకి 15-20 లక్షలు ఇవ్వాలని ఓ ఫ్యాక్టరీ అధికారి సిఫార్సు
– మరో చెన్నై కంపెనీ థర్డ్‌పార్టీ ఏజెన్సీకీ 20 లక్షలివ్వాలట
– అడ్డం తిరిగిన పరవాడ, అచ్యుతాపురం పరిశ్రమ యజమానులు
– ఆ మేరకు తమకు నోటీసులివ్వాలని స్పష్టం చేసిన మరికొన్ని కంపెనీలు
– సీఎంఓకు ఫిర్యాదు చేసిన రెండు కంపెనీల యజమానులు?
– ఆ ‘ఫ్యాక్టరీస్’ అధికారిని ఏరి కోరి విశాఖకు బదిలీ చేయించుకున్న ఘనులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
కార్మిక శాఖలోని ఫ్యాక్టరీస్ విభాగంలో ఒక వెలుగు వెలిగినంత వరకూ ఆ ‘రాజు’ గారి రూటే సెప‘రేటు’. ఆయన చెప్పిందే వేదం. చేసిందే శాసనం. ముఖ్యంగా విశాఖలో ఉన్న వందల కంపెనీలను ‘రెండు హోదాల్లో’ కంటిచూపుతో శాసించిన ఘనుడు. పాయకరావుపేటలో సదరు ‘ఫ్యాక్టరీస్’రాజు గారికి బాగా ఇష్టమైన, మరో రాజుగారి కెమికల్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో తరచూ విషవాయువు విడుదలయి, అందులో పనిచేసే కార్మికులు వాటిని పీల్చి ఉచితంగా పైకి పోతుంటారు. ఆ కెమికల్ కంపెనీలో ఇప్పటికీ జరుగుతున్నది అదే. కానీ ఆ కంపెనీపై ఒక్క కేసూ నమోదు కాలేదు. కారణం అప్పట్లో ఉన్నతాధికారిగా పనిచేసిన ‘ఫ్యాక్టరీస్ రాజు’ది.. ‘మనం మనం బరంపురం’ తాలూకు అభిమానం!
ఆ అభిమానమే ఇప్పుడు ఆయన రిటైరయినా ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ను చేసింది. అంటే కంపెనీ బాగోగులు, ఫ్యాక్టరీస్ విభాగం, పీసీబీలో లైజనింగ్ చేసే కన్సలెక్టన్సీ కొలువన్నమాట. సదరు రాజుగారు ‘ఫ్యాక్టరీస్’ విభాగం బాసుగా వెలగబెట్టినప్పుడు జరిగిన అనేక అవకతవకలు, అవినీతిని ‘సూర్య ’ వెలుగులోకి తెచ్చింది.
రిటైరయిన తర్వాత సదరు అధికారి ఏ కంపెనీకి శ్రమదానం చేస్తున్నారో, అదే కంపెనీలో పెద్ద హోదా ఇవ్వబోతున్నారని కూడా ‘సూర్య’ అప్పుడే వెల్లడించింది. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు అదే జరిగింది. ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు తమను కంటికిరెప్పలా కాపాడుకుని, తమ కంపెనీలో డజన్ల మంది కార్మికులు విషవాయువు పీల్చి బాల్చీ తన్నేసినా.. ఒక్క కేసు కూడా పెట్టకుండా కాపాడినందుకు.. సదరు రాజుగారికి ఆ హోదా ఇచ్చారన్నమాట.
వైసీపీ అధినేత జగన్ పుణ్యమా అని.. క్విడ్ ప్రో కో అన్న పదం ప్రపంచానికి తెలిసొచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఆ పదాన్ని వాడింది. లేకపోతే ఆ పదానికి ఎప్పటికీ అర్ధం తెలిసేది కాదేమో?! క్విడ్ ప్రో కో అంటే నీకింత.. నాకు ఇంత అన్నమాట! నువ్వు నాకు మేలు చేసినందున, తర్వాత నేను చేసే మేలన్నమాట!!
కార్మిక శాఖ పరిథిలోని ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్లో సుదీర్ఘకాలం పనిచేసి, విశాఖ, విజయవాడ, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను కంటిచూపుతో శాసించి.. కొద్దికాలం క్రితమే రిటైరయిన ఓ రాజుగారి క్విడ్ ప్రో కో కథ ఇది. ఆయన రిటైరయ్యారు కదా? ఇంకా ఆయన గురించి ఎందునుకోవచ్చు.
కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆయన మూలాలే ఇంకా బలంగా పనిచేస్తున్నాయి. ఆయన కోరుకున్న వారినే అక్కడ ఫ్యాక్టరీస్ బాసులుగా నియమిస్తున్నారు. పైగా.. కంపెనీల్లో చేసే థర్డ్ పార్టీ ఏజెన్సీ ఓనరయిన ‘‘సారు తమ్ములుం’’గారి కంపెనీకే, థర్డ్ పార్టీ ఏజెన్సీ పనులు అప్పగించే మరో క్విడ్ ప్రో కో.
విశాఖ, పర వాడ, అచ్యుతాపురం పారిశ్రామికవాడల్లో వందలాది ఫ్యాక్టరీలున్నాయి. అందులో కెమికల్‌తో పాటు సాధారణ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. కేవలం గాలి, నీరు, వాయు కాలుష్యం జరిగితేనే అది పీసీబీ పరిథిలోకి వస్తుంది. ఆపై కంపెనీలో ఏ ప్రమాదం జరిగినా దానికి కార్మిక శాఖ పరిథిలోని ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటుదే బాధ్యత. వాటిపై చర్యలు తీసుకునే అధికారం కూడా ఆ శాఖదే. అయితే ఇటీవలి కాలంలో.. తమకు సంబంధం లేని అంశాల్లో కూడా పీసీబీ వేలు పెట్టి, తమ శాఖలో జోక్యం చేసుకుంటోందన్నది ఫ్యాక్టరీస్ అధికారుల ఆరోపణ. దాని సంగతి తర్వాత చర్చించుకుందాం.
అయితే ఇటీవల రిటైరయిన ఓ ఫ్యాక్టరీస్ ఉన్నతాధికారి.. పదవిలో ఉండగా విశాఖలోని ఫ్యాక్టరీలను ఏలేశారు. దానికి పైస్థాయి పెద్దలతోపాటు, కార్మికశాఖ పేషీ ఉద్యోగులు కూడా సహకరించారు. ఆ సమయంలో పాయకరావుపేటలోని ఓ రాజు గారి కెమికల్ కంపెనీ నుంచి తరచూ విషవాయువు విడదలయి, అక్కడ పనిచేసే కార్మికులు మృతి చెందేవారు. ఆ అగ్రి ప్రొడక్ట్ చేసే కంపెనీ తన ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేస్తుంటుంది.
దానితో ఫ్యాక్టరీస్ కింది స్థాయి అధికారులు రంగంలోకి దిగి, ప్రమాద కారణాలపై నివేదికలు ఇచ్చేవారు. అంటే విషవాయువు లీకయిన ఫలితంగానే, కార్మికుల మృతి చెందారని నివేదికలిచ్చేవారన్న మాట. అయితే సదరు రిటైరయిన అధికారి అప్పట్లో తన అధికారం వినియోగించి, వాటని సహజ మరణాలుగా మార్చేవారన్న ఆరోపణలు అప్పుడే వినిపించాయి.
ఆ కంపెనీలో తరచూ విష వాయువు లీకవడం, ఫలితంగా కార్మికులు మృతి చెందడం, దానిని సహజ మరణంగా చిత్రీకరించడం, ఇవన్నీ బయటకు పొక్కుకుండా మృతుల కుటుంబాలకు ఎంతో కొంత ముట్టచెప్పి యాజమాన్యం రాజీ చేసుకోవడం.. ఇప్పటికీ ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇదంతా పాయకరావుపేట ప్రజలకు, కార్మికులు, కార్మిక సంఘాలకు తెలిసిందే.
వీటిపై సూర్య లో ఎప్పటికప్పుడు కథనాలు వెలువడున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో త్వరలో రిటైరవుతున్న సదరు రాజు గారు.. తాను విశేష సేవలందిస్తున్న మరో రాజుగారి కంపెనీలో పెద్ద హోదా కోసం కర్చీఫ్ వేశారని, రిటైరయిన తర్వాత పెద్ద ప్యాకేజీతో.. తాను కంటికి రెప్పలా కాపాడిన కంపెనీలోనే చేరబోతున్నట్లు ‘సూర్య’ అప్పుడే చెప్పింది. అనుకున్నట్లుగానే సదరు రాజు గారు.. తాను అధికారిగా ఉన్నప్పుడు ఏ కంపెనీకయితే శ్రమదానం చేశారో, ఇప్పుడు అదే కంపెనీ ఉపాధ్యక్షుడు (కన్సల్టెంట్)గా అవతారమెత్తారు.
నిజానికి సదరు ‘ఫ్యాక్టరీస్ రాజు’గారు రిటైరయినా ఆయన హవా ఇంకా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. అప్పట్లో ఆయన దగ్గర విధేయతగా పనిచేసి, చెప్పినట్లు నివేదికలిచ్చిన వారినే విశాఖ ఫ్యాక్టరీస్‌లో బదిలీ చేయించుకున్నారు. అంటే ఇప్పుడు తాను కన్సల్టెంటుగా పనిచేస్తున్న కెమికల్ కంపెనీకీ రక్షణ కోసమన్నమాట!
సీఎంఓకు చేరిన ‘థర్డ్ పార్టీ సేఫ్టీ ఏజెన్సీ’ పంచాయతీ
విశాఖ జోన్‌లోని ఫ్యాక్టరీలకు.. ఇప్పుడు ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటులోని ఓ ఉన్నతాధికారి ‘వసూల్‌రాజా’గా మారారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీ స్థాయిలో పలుకుబడి ఉపయోగించి విశాఖకు చేరిన సదరు ఫ్యాక్టరీస్ అధికారి.. తాను సూచించిన థర్డ్‌పార్టీ సేఫ్టీ ఏజెన్సీలతోనే పనులు చేయించాలని కంపెనీలకు హుకుం జారీ చేస్తున్నారట. ఆ మేరకు ఆయన సూచించిన ఆ ఏజెన్సీలు.. ఒక్కో కంపెనీ నుంచి 15 నుంచి 20 లక్షలు డిమాండ్ చేస్తుండటంతో, కొందరు పారిశ్రామికవేత్తలు అడ్డం తిరిగి దీనిపై సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అందులో ఓ ఎమ్మెన్సీ కంపెనీ అయితే.. ‘ఆ మేరకు మీరు మాకు నోటీసు ఇవ్వండి. మేం ఎక్కడ చూసుకోవాలో అక్కడే చూసుకుంటాం’ అని అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది. ఆ విధంగా నాలుగైదు పెద్ద కంపెనీలు ఎదురుతిరిగినట్లు చెబుతున్నారు. కాగా తనకు సన్నిహితంగా ఉండే ఓ థర్డ్ పార్టీ ఏజెన్సీకి ‘ఐకాన్’గా ఓ కంపెనీకే పనులివ్వాలని, సదరు అధికారి ఫ్యాక్టరీలకు నోటిమాటగా ఆదేశాలిస్తున్నారట. ఆ విధంగా ఆయన ఐదు ఏజెన్సీలను సిఫార్సు చేస్తున్నారట.
అయితే విశాఖలోని దాదాపు అన్ని కంపెనీ యజమానులకు రాజకీయ నేపధ్యం, పలుకుబడి ఉంది. దానితో వారు ఈ విషయాన్ని సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గతంలో ఇదే థర్డ్‌పార్టీ ఏజెన్సీకి లక్ష నుంచి 2 లక్షలు మాత్రమే ఖర్చయ్యేది. కానీ ఇప్పుడు దానిని ఏకంగా 15-20 లక్షలకు పెంచేయడమే పారిశ్రామికవేత్తల ఆగ్రహం-ఫిర్యాదుకు కారణం. గతంలో ఇలాంటి పీడించే పరిస్థితి ఎప్పుడూ లేదని, ఇటీవలి కాలంలోనే ఇలాంటి దోపిడీ మొదలయిందని తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
తమ్ముడు గారి కంపెనీకే ‘ఏజెన్సీ’ పట్టం
కాగా గతంలో ‘ఫ్యాక్టరీస్’ విభాగంలో కర్రపెత్తనం చేసి, కొద్దికాలం క్రితమే రిటైరయి.. మళ్లీ ఓ కంపెనీలో కన్సల్టెంటుగా పనిచేసిన ఆ రాజుగారి తమ్ముడికి సైతం విశాఖలో ఒక థర్డ్‌పార్టీ ఏజెన్సీ ఉందట. అన్నగారు అధికారంలో ఉన్నప్పటి నుంచే.. ఆయన భయానికి, తమ్ముడి గారి ఏజెన్సీకే ఫ్యాక్టరీలు థర్డ్‌పార్టీ పనులు అప్పగించేవి. అప్పుడు మిగిలిన ఏజెన్సీలు 2 లక్షల లోపు చార్జిలు వసూలు చేస్తే, ‘తమ్ముడు’ గారి ఏజెన్సీ మాత్రం, అప్పట్లోనే 5 లక్షలు వసూలు చేసేదని చెబుతున్నారు. మరి అన్నగారు అప్పట్లో ఫ్యాక్టరీస్ ఉన్నతాధికారాయె! ఫ్యాక్టరీ యజమానులకు ఆ మాత్రం భయం ఉంటుంది కదా మరి? ఒకవేళ తమ్ముడిగారి కంపెనీని కాదని, తక్కువ చార్జితో పనిచేసే మరో కంపెనీకి థర్డ్ పార్టీ ఏజెన్సీ పని అప్పగిస్తే.. ఇక ఆ ఫ్యాక్టరీకి కష్టాలు మొదలయినట్లే. ఇప్పుడు కూడా అన్నగారి సిఫార్సుతో విశాఖకు వచ్చిన ఓ ‘ఫ్యాక్టరీస్’ అధికారి.. తమ్ముడి ఏజెన్సీకే థర్డ్‌పార్టీ ఏజన్సీ పనులు అప్పగించాలని, ఫ్యాక్టరీ యజమానులను ఆదేశిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.