– మరో పాకిస్తాన్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్ లా మారి ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేది
– సర్దార్ వల్లభాయి పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదు
– జలియన్ వాలాబాగ్ ను మించి పరకాల, బైరాన్ పల్లి, గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపాతం సృష్టించారు
– ఈ దురాగతాలను చరిత్రకారులు విస్మరించారు
– బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గల్లీగల్లీలో అధికారికంగా నిర్వహిస్తాం
– సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ‘తెలంగాణ విమోచన దినోత్సవం’లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
సికింద్రాబాద్: భారత్ లో తెలంగాణ విలీనం కాకుండా మన పరిస్థితి ఎట్లుండేదో ఒక్క క్షణం ఆలోచించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మరో పాకిస్తాన్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్ లా మారి ఆకలి కేకలతో కల్లోల దేశంగా తెలంగాణ మారేదని ఆందోళన వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయి పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని చెప్పారు.
ఇంతటి చరిత్ర కలిగినందునే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. భారత ప్రభుత్వం గెజిట్ ప్రకటించినందున జనవరి 26, పంద్రాగస్టు మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ విమోచన ఉత్సవాలు’ పేరుతో అధికారికంగా నిర్వహంచాలని కోరారు. తెలంగాణ ప్రజా పాలన పేరుతో ఉత్సవాలు నిర్వహించడం సరికాదని, దానికంటే తెలంగాణ ప్రజా వంచక పాలన దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.
సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ కు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోపాటు కేంద్ర పర్యాటక, సాంస్క్రుతిక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్, బోగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరిగే సమయంలో ఆ పోరాటాలను గుర్తించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని పార్లమెంట్ బిల్లుకు ఆమోదం తెలపడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి రాజ్ నాథ్ సింగ్. ఈరోజు తెలంగాణ ప్రజలు ఒకేసారి మూడు పండుగలు జరుపుకునే రోజు.
భర్తలను కట్టేసి వాళ్ల కళ్లముందే భార్యలను, బిడ్డలను మానభంగాలు చేసి హింసించారు. నగ్నంగా మహిళలతొ బతుకమ్మ ఆడించారు. హిందువుల ఇండ్లల్లో పడి దోచుకుతిన్నరు. తెలుగు చదివే అవకాశమే లేకుండా చేశారు. ఉర్దూను బలవంతంగా రుద్దారు. బలవంతపు మతమార్పిళ్లు చేశారు. మతం మారకపోతే పన్నుల మీద పన్నుల వేసి ప్రజలను పీక్కు తిన్నారు.
పరకాలలో జాతీయ జెండాను ఎగరేశారనే సాకుతో 1500 మందిని జలియన్ వాలాబాగ్ తరహాలో కాల్చి చంపారు. జలియన్ వాలాబాగ్ ఘటనను ప్రపంచం ముందుంచిన చరిత్ర కారులు… అంతకు మించి పరకాల దురాగతాన్ని, వీర బైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, వెయ్యి ఊడల మర్రి ఘటనల్లో రజాకార్ల సాగించిన రాక్షసత్వాన్ని మాత్రం విస్మరించడం దారుణమైన విషయం.
నాటి బలిదానాలకు, పోరాటాలను భావితరాలకు చెప్పి త్యాగధనులకు సరైన గుర్తింపు నివ్వాలనే ఉద్దేశంతోనే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ అధికారికంగా జరుపుకుంటున్నాం. సర్దార్ వల్లభాయి పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదు. తెలంగాణను పాకిస్తాన్ లో కలపాలని లేదా ముస్లిం దేశంగా మార్చాలని నిజాం కుట్రలు చేసిండు. ఒకవేళ తెలంగాణ భారత్ లో విలీనం కాకుండా మన పరిస్థితి ఎట్లుండేదో ఒక్క క్షణం ఆలోచించండి.
మరో పాకిస్తాన్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్ లా మారి ఆకలి కేకలతో అల్ల కల్లోలమయ్యే దుస్థితి వచ్చేది. ఇది ఆనాడే గ్రహించిన పటేల్ తెలంగాణకు స్వాతంత్య్రం రాకుండా స్వతంత్య్ర రాజ్యంగా ఉంటే భారతమాత కడుపులో కేన్సర్ ఉన్నట్లేనని ప్రకటించి నిజాం కుట్రలను భగ్నం చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ పటేల్ మాకు ఎప్పటికీ ఆరాధ్యుడే.
మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు తొలిసారి తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాలని కోరిన విషయం గుర్తు చేస్తున్నా. ఇంత గొప్ప చరిత్ర కలిగిన తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర పాలకులు పేరు మార్చి కార్యాలయాలకే పరిమితం చేయడం దారుణం. తెలంగాణ పోరాట యోధుల త్యాగాలను, బలిదానాలను అవమానించడమే.
తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏమిటో ప్రజలకు సమాధానం వస్తుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గల్లీగల్లీలో అధికారికంగా నిర్వహిస్తాం. ప్రధానమంత్రి, లోక నాయకుడు మోదీ మోదీ బర్త్ డే కూడా ఈరోజే కావడం మనందరికీ సంతోషాన్ని పంచే రోజు.