* రోగులకు ఉచితంగా 63 రకాల పరీక్షలు, 175 రకాల మందులు!
* వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న..పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శాసనమండలిలో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా సీనియర్ సభ్యుడు సోము వీర్రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలో ఉన్న 560 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 3,920కు గాను 344 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి కూడా చర్యలు చేబట్టాం. అన్ని రకాల ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీకి అవసరాలకు తగ్గట్లు నియామకాల నోటిఫికేషన్లు ఇస్తున్నాం.
2023-24లో పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా 69.54 లక్షల మంది రోగులు సేవలు పొందారు. 2024-25లో ఈ సంఖ్య 73.67 లక్షలకు పెరిగింది. మురికివాడలు, బాగా వెనుకబడిన ప్రాంతాల్లో ఈ ఆరోగ్య కేంద్రాలు నడుస్తున్నందున్న స్థానిక పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. వీటిల్లో 63 రకాల ల్యాబ్ పరీక్షలు, 175 రకాల మందులను ఉచితంగా రోగులకు అందచేస్తున్నాం. 2020 – 21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఈ కేంద్రాల నిర్వహణ కోసం రూ.10,341.81 కోట్లను జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖర్చుపెట్టాం’ అని మంత్రి సత్యకుమార్ వివరించారు.
క్యాన్సర్ లక్షణాలు కలిగిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక సర్వే!
“గత 2022-23లో 73 వేల కొత్త క్యాన్సర్ కేసులు నమోదైతే .. దురదృష్టవశాత్తు 42వేల మంది ప్రాణాలు విడిచారు. ఈ పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను లక్షణాల ఆధారంగా ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్షేత్రస్ధాయి సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నాం. 4.10 కోట్ల మందికి క్యాన్సర్ లక్షణాలు గుర్తించేందుకు స్క్రీనింగ్ చేయబోతున్నాం. ఈ స్క్రీనింగ్ ఎలా చేయాలన్న దానిపై వైద్యులు, ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు జరుగతున్నాయి. క్యాన్సర్ కేసుల గుర్తింపు సర్వే పూర్తయితే ఎ.ఎన్.ఎం., ఇతర సిబ్బంది అన్ని రకాల రోజూవారీ విధులకు యథావిధిగా హాజరవుతారు’ అని మంత్రి సత్యకుమార్ వివరించారు.